IND w Vs IRE w: ఐర్లాండ్‌పై విజయం.. సెమీస్‌కు చేరిన భారత్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి నాకౌట్‌ పోరుకు అర్హత సాధించింది.

Updated : 20 Feb 2023 22:26 IST

గాబెరా: మహిళల టీ20 ప్రపంచకప్‌ (‌Womens T20 World Cup)లో టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి నాకౌట్‌ పోరుకు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హర్మన్‌ప్రీత్ సేన.. 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (87; 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీకి చేరువలో ఔటైంది. షెఫాలీ వర్మ (24), జెమీమీ రోడ్రిగ్స్‌ (19) ఫర్వాలేదనిపించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో లారా డెలానీ 3, ఓర్లా ప్రెండర్‌గాస్ట్ 2, ఆర్లీన్ కెల్లీ ఒక వికెట్‌ తీశారు.

టీమ్‌ఇండియా నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి ఐర్లాండ్‌.. వర్షం కారణంగా ఆట నిలిపివేసే సమయానికి  8.2 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 54 పరుగులు చేసింది. ఐర్లాండ్‌ గెలుపు కోసం ఆ సమయానికి చేయాల్సిన స్కోరు 59. దీంతో టీమ్‌ఇండియాను విజేతగా ప్రకటించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు పడగొట్టింది.

దంచికొట్టిన మంధాన

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్.. మొదటి 10 ఓవర్లలో 63/1తో నిలిచింది. అనంతరం మంధాన దూకుడు పెంచింది. కారా ముర్రే వేసిన 14 ఓవర్‌లో వ్యక్తిగత స్కోరు 47 వద్ద స్మృతికి లైఫ్‌ లభించిన తర్వాత అదే ఓవర్‌లో చివరి బంతికి సిక్సర్‌ బాది అర్ధ శతకం పూర్తి చేసుకుంది. జార్జినా డెంప్సే వేసిన 15 ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన మంధాన.. డెలానీ వేసిన తర్వాతి ఓవర్‌లో సిక్సర్‌ బాదింది. ఇదే ఓవర్‌లో హర్మన్‌ (13), రిచా ఘోష్‌ (0)లు ఔటయ్యారు. డెలానీ వేసిన 18 ఓవర్‌లో మంధాన ఫోర్‌, సిక్సర్‌ మరోసారి జోరు చూపించింది. కానీ, ప్రెండర్‌గాస్ట్ వేసిన 18.4 ఓవర్‌కు గాబీ లూయిస్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటైంది. తర్వాతి బంతికే దీప్తి శర్మ (0) డకౌట్‌ అయింది. జెమీమా రోడ్రిగ్స్‌ ఆఖరి ఓవర్‌లో రెండు ఫోర్లు బాది చివరి బంతికి స్టంపౌట్‌ అయింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని