IND vs NZ: తొలి టీ20.. సుందర్, సూర్య పోరాడినా.. టీమ్‌ఇండియాకు తప్పని ఓటమి

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది.

Updated : 27 Jan 2023 23:58 IST

రాంచీ: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. టీమ్‌ఇండియా బ్యాటర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ (50; 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చివర్లో దూకుడుగా ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (47; 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. కివీస్‌ బౌలర్లలో బ్రాస్‌వెల్, శాంటర్న్, ఫెర్గూసన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఇష్‌ సోధి, జాకబ్ చెరో వికెట్ తీశారు.

15 పరుగులకే మూడు వికెట్లు 

లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. శుభ్‌మన్‌ గిల్ (7), ఇషాన్‌ కిషన్‌ (4), రాహుల్‌ త్రిపాఠి (0) వెంటవెంటనే ఔట్‌ కావడంతో భారత్ 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్, హార్దిక్ పాండ్య (21) వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. దూకుడుగా ఆడిన సూర్య అర్ధ సెంచరీకి చేరువై ఇష్‌ సోధి బౌలింగ్‌లో ఔట్‌ అయ్యాడు. కొద్దిసేపటికే పాండ్య కూడా పెవిలియన్‌ చేరడంతో 89 పరుగులకే ఐదు వికెట్లు మళ్లీ కష్టాల్లో పడింది. తర్వాత సుందర్ పోరాడినా అతడికి మద్దతుగా నిలిచేవారు కరవయ్యారు. సుందర్‌ 25 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.  

తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవాన్‌ కాన్వే (52; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), ఫిన్‌ అలెన్ (35; 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చివర్లో డారిల్ మిచెల్ (59; 30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.అర్ష్‌దీప్ వేసిన 20 ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ రెండు, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, శివమ్‌ మావి తలో వికెట్‌ తీశారు. డారిల్ మిచెల్ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని