IND vs NZ: రేపటి నుంచే టీ20 సమరం.. పొట్టి సిరీస్‌లోనూ భారత్‌ జోరు కొనసాగిస్తుందా?

భారత్‌, న్యూజిలాండ్‌ (IND vs NZ) మధ్య జనవరి 27 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. తొలి టీ20 రాంచీలో జరగనుంది. 

Updated : 26 Jan 2023 20:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్: న్యూజిలాండ్‌పై మూడు వన్డేల సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. రేపటి నుంచే (జనవరి 27) మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది. వన్డే సిరీస్‌లో ఆడిన స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఈ సిరీస్‌కు  దూరంగా ఉన్నారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటాడు. వరుసగా సెంచరీలు బాది భీకరమైన ఫామ్‌లో ఉన్నశుభ్‌మన్‌ గిల్‌, రంజీల్లో ట్రిపుల్ సెంచరీ బాది జోరుమీదున్న పృథ్వీ షా ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య వెల్లడించాడు. ఇక, కివీస్‌పై వన్డే సిరీస్‌లో నిరాశపర్చిన సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌లు పొట్టి సిరీస్‌లోనైనా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మూడో వన్డేలో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన హార్దిక్‌ పాండ్య.. టీ20ల్లో అదే ఆటతీరును కొనసాగించాల్సిన అవసరముంది. మిడిల్‌ ఆర్డర్‌లో రాహుల్ త్రిపాఠి, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌ మధ్య పోటీ ఉండగా.. వీరిలో ఇద్దరికి ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. బౌలింగ్‌ విషయానికొస్తే.. అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌కు తుదిజట్టులో చోటు ఖాయం. శివమ్‌ మావి, ముఖేశ్ కుమార్‌లలో ఒకరిని మూడో పేసర్‌గా తీసుకోవచ్చు. స్పిన్‌ బౌలింగ్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌, చాహల్‌ మధ్య పోటీ ఉండగా.. నిలకడగా వికెట్లు పడగొడుతున్న కుల్‌దీప్‌ వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపొచ్చు. 

ఏ మ్యాచ్‌ ఎప్పుడు?

  • తొలి టీ20 రాంచీ - జనవరి 27న రాత్రి 7.గంటలకు
  • రెండో టీ20 లఖ్‌నవూ - జనవరి 29న రాత్రి 7.గంటలకు
  • మూడో టీ20 అహ్మదాబాద్‌ - ఫిబ్రవరి 01న రాత్రి 7.గంటలకు

గత రికార్డులు ఇలా..

భారత్‌, న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు 22 మ్యాచ్‌లు జరగ్గా.. 12 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా విజయం సాధించగగా.. కివీస్‌ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. 

భారత జట్టు:(అంచనా)

శుభ్‌మన్‌ గిల్, పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్‌), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), దీపక్‌ హుడా, వాషింగ్టన్ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, శివమ్ మావి, కుల్‌దీప్‌ యాదవ్‌.  

న్యూజిలాండ్‌ జట్టు: (అంచనా)

మిచెల్‌ శాంటర్న్‌ (కెప్టెన్‌), ఫిన్‌ అలెన్, మైఖేల్ బ్రాస్‌వెల్, డేవాన్‌ కాన్వే, జాకబ్, ఫెర్గూసన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్‌ (వికెట్‌ కీపర్‌), హెన్రీ షిప్లే, ఇష్‌ సోధి, టిక్నర్‌. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు