IND vs SA: గెలుపు ధీమాతో టీమ్‌ఇండియా.. ఇక సఫారీతో సై..

ఆసీస్‌పై సిరీస్‌ గెలుపుతో ఆత్మవిశ్వాసంతో టీమ్‌ఇండియా సఫారీతో పోరుకు సిద్ధమైంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది..........

Updated : 27 Sep 2022 17:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరకుండానే వెనుదిరిగిన టీమ్‌ఇండియా.. ఆపై పుంజుకుంది. ప్రపంచ ఛాంపియన్‌  ఆస్ట్రేలియాపై సిరీస్‌ను సొంతం చేసుకొని ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఈ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతోనే రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు సిద్ధమైంది. అయితే ఆసీస్‌పై సిరీస్‌ గెలిచినప్పటికీ.. భారత జట్టులోని పలు లోపాలు తేటతెల్లమయ్యాయి. అందుకే ప్రపంచకప్‌కి ముంగిట సఫారీ జట్టుతో జరగబోయే ఈ పోరు ఎంతో కీలకం కానుంది. ప్రపంచకప్‌లో పైచేయి సాధించాలంటే.. జట్టులోని లోపాలను సరిచేసుకొనేందుకు ఈ సిరీస్‌ ఓ సువర్ణావకాశం. లేదంటే తర్వాత జరిగే మెగా టోర్నీలో బొక్కబోర్లా పడటం ఖాయం.

బలమైన బ్యాటింగ్‌ లైనప్‌

భారత జట్టు అతితక్కువ స్కోరుకే ఔటవడం ఈ మధ్య కాలంలో ఏనాడూ జరగలేదు. అందుకు కారణం బలమైన బ్యాటింగ్‌ లైనప్‌. ఒకరు విఫలమైనా.. మరొకరు రాణించి ప్రత్యర్థి ముందు మంచి స్కోర్లనే ఉంచారు. కెప్టెన్ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, సూర్య కుమార్‌ యాదవ్‌ లాంటి నైపుణ్యం గల బ్యాటర్లు జట్టు సొంతం. కొద్దికాలంగా రన్స్‌ చేసేందుకు ఇబ్బంది పడిన కోహ్లీ మళ్లీ ఫామ్‌ను అందుకొని పరుగుల వేటను ప్రారంభించాడు. ఆసియా కప్‌లో సెంచరీ, ఆపై ఆసీస్‌తో నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో అర్ధ శతకంతో రాణించాడు. ఇక సూర్య కుమార్‌ ప్రస్తుతం తన అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సఫారీతో సిరీస్‌తోపాటు వరల్డ్‌కప్‌లోనూ మెరుపులు కొనసాగాలని జట్టు మొత్తం ఆశిస్తోంది.

ఇదే పెద్ద సమస్య

ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచుతున్నప్పటికీ.. దాన్ని కాపాడుకోలేకపోవడమే ఇప్పుడు జట్టు ముందున్న అతిపెద్ద సమస్య. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. పవర్‌ ప్లేలో ఉత్తమంగానే బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ.. తర్వాత తేలిపోతున్నారు. గతంలో డెత్‌ ఓవర్ల స్పెషలిస్టులుగా పేరుగాంచిన భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌.. ఇప్పుడు అక్కడే ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ప్రపంచకప్‌కి ముందు వారు ఈ సమస్యను అధిగమించేందుకు ఈ సిరీస్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. వారు తిరిగి తమ లయను అందుకోవాలని జట్టుతోపాటు అభిమానులు కోరుకుంటున్నారు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన బుమ్రా సైతం కట్టడిగా బౌలింగ్‌ చేస్తే.. ప్రత్యర్థులకు చెమటలు పట్టించడం ఖాయం.

నేనున్నానంటూ అక్షర్‌

గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా జట్టుకు దూరం కావడంతో శిబిరంలో ఆందోళన నెలకొనగా.. అతడి స్థానంలో వచ్చిన అక్షర్‌ పటేల్‌ నేనున్నానంటూ జట్టుకు ధైర్యాన్నిచ్చాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న అక్షర్‌ సిరీస్‌ గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. బ్యాటింగ్‌లో అవకాశం రాకపోయినప్పటికీ.. పొదుపుగా బౌలింగ్‌ చేసి కీలక వికెట్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శనతో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ సైతం దక్కించుకున్నాడు. దీంతో జడేజా స్థానాన్ని పరిపూర్ణంగా భర్తీ చేస్తాననే ధీమా ఇచ్చాడు. ఈ సిరీస్‌కు మరో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ దూరం కానుండటంతో అక్షర్‌ పాత్ర మరింత కీలకం కానుంది. వీరితోపాటు డీకే, అశ్విన్‌, చాహల్‌ తమ శక్తిమేర రాణించాల్సిన అవసరం ఉంది.

భారత్‌దే పైచేయి

భారత్‌, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌దే పైచేయి. ఈ రెండు జట్లు మొత్తంగా 20 సార్లు పోటీ పడగా.. టీమ్‌ఇండియా 11 సార్లు గెలుపొందింది. సఫారీ జట్టు 8 సార్లు విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ప్రస్తుతం ఉన్న ఆ జట్టులోనూ స్టార్లకు కొదువలేదు. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న మార్‌క్రమ్‌తోపాటు క్వింటన్‌ డికాక్‌, డేవిడ్‌ మిల్లర్‌ లాంటి స్టార్‌ బ్యాటర్లు ఆ జట్టులో ఉన్నారు. కాగా భారత బౌలర్లు వీరిని కట్టడిచేయాల్సిన అవసరం ఉంది. ఎంగిడి, ఎన్‌రిచ్‌ నోకియా, రబాడా, తబ్రిజ్‌ షంసి లాంటి ఉత్తమ బౌలర్లు సైతం ఆ జట్టు సొంతం. వీరిని సమర్థంగా ఎదుర్కొంటే ఈ సిరీస్‌లో భారత్‌కు తిరుగుండదనేది విశ్లేషకుల మాట.

భారత జట్టు

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), దినేశ్‌ కార్తీక్‌ (కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, యుజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమేశ్ యాదవ్‌, హర్షల్‌ పటేల్, దీపక్‌ చాహర్, జస్ప్రీత్‌ బుమ్రా

దక్షిణాఫ్రికా జట్టు

తెంబా బవుమా (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, రీజా హెండ్రిక్స్‌, హెన్‌రిక్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహారాజ్‌, మార్‌క్రమ్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగీ ఎంగిడి, నోకియా, వేన్‌ పార్నెల్‌, ప్రిటోరియస్‌, కగిసో రబాడా, రిలీ రోసో, తబ్రిజ్‌ షంసి, ట్రిస్టన్‌ స్టబ్స్‌

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని