IND vs SL: సిరాజ్ జోరు.. శ్రీలంకపై భారత్‌ రికార్డు విజయం..

శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. 

Published : 16 Jan 2023 01:59 IST

తిరువనంతపురం: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి 317 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్‌ అవతరించింది. ఐర్లాండ్‌పై 290 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ పేరిట ఉన్న రికార్డును భారత్‌ అధిగమించింది. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (275), సౌతాఫ్రికా (272), సౌతాఫ్రికా (258), భారత్‌ (257) అత్యధిక పరుగులతో ఉన్నాయి. తొలుత భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. 22 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. గాయం కారణంగా వాండర్సే బ్యాటింగ్‌కి దిగలేదు. శ్రీలంక బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. నువనిదు ఫెర్నాండో (19) టాప్‌ స్కోరర్‌. మహమ్మద్‌ సిరాజ్‌ (4/32) శ్రీలంక పతనంలో కీలకపాత్ర పోషించాడు. షమి (2/20), కుల్‌దీప్‌ యాదవ్‌ (2/16) కూడా రాణించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. 

టపా టపా వికెట్లు.. 

391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు మహమ్మద్‌ సిరాజ్‌ ఆదిలోనే షాకిచ్చాడు. రెండో ఓవర్లో అవిష్క ఫెర్నాండో (1)ని వెనక్కి పంపిన సిరాజ్‌.. నాలుగో ఓవర్లో కుశాల్ మెండిస్‌ (4)ని ఔట్‌ చేశాడు. షమి వేసిన 6.3 ఓవర్‌కు అసలంక (1) వెనుదిరిగాడు.  నువనిదు ఫెర్నాండో (19)ని 7.3 ఓవర్‌కు  క్లీన్‌బౌల్డ్ చేసిన సిరాజ్‌.. కొద్ది సేపటికే హసరంగ (1)ని ఔట్‌ చేసి నాలుగో వికెట్‌ని ఖాతాలో వేసుకున్నాడు.12వ ఓవర్‌లో కరుణరత్నె (1)ని అద్భుతంగా రనౌట్‌ చేశాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన 15 ఓవర్లో చివరి బంతికి డాసున్‌ శనక (11) క్లీన్‌బౌల్డ్ అవ్వగా.. షమి వేసిన 15.4 బంతికి వెల్లలగె (3)., సూర్యకుమార్‌ యాదవ్‌కి చిక్కాడు. కుల్‌దీప్‌ వేసిన 22వ ఓవర్‌లో చివరి బంతికి లాహిరు కుమార (9) ఔటయ్యాడు.

విరాట్ విశ్వరూపం

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (166; 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్‌లు) విశ్వరూపం ప్రదర్శించాడు. శుబ్‌మన్ గిల్ (116; 97 బంతుల్లో  14 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా శతక్కొట్టాడు. రోహిత్ శర్మ (42), శ్రేయస్‌ అయ్యర్‌ (38) రాణించారు. లంక బౌలర్లలో లహిరు కుమార, కసున్‌ రజిత తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నె ఒక వికెట్‌ తీశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని