IND vs SL : లంకపై ఎప్పుడూ భారత్‌దే ఆధిపత్యం.. ఈసారీ తగ్గేదేలే

 మరో రెండు రోజుల్లో భారత్‌లో శ్రీలంక జట్టు పర్యటన ప్రారంభం కానుంది. ఇరు జట్లు...

Updated : 22 Feb 2022 21:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎల్లుండి నుంచి భారత్‌లో శ్రీలంక జట్టు పర్యటన ప్రారంభం కానుంది. ఇరు జట్లు మూడు టీ20లు, రెండు టెస్టుల్లో తలపడతాయి. ఫిబ్రవరి 24, 26, 27వ తేదీల్లో టీ20లు.. మార్చి 4-8 వరకు తొలి టెస్టు, మార్చి 12-16 వరకు రెండో టెస్టు మ్యాచ్‌ జరుగుతుంది. ప్రతిసారీ ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్ఇండియాను లంక తట్టుకోగలదో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈలోగా ఇరు జట్లు ఇప్పటి వరకు ముఖాముఖిగా ఎన్ని మ్యాచుల్లో తలపడ్డాయి.. ఎవరు పైచేయి సాధించారనే విషయాలను పరిశీలిద్దాం..

తొలిసారి ఎప్పుడంటే..?

దాదాపు 43 ఏళ్ల కిందట 1979న మొదటిసారిగా భారత్, శ్రీలంక జట్లు క్రికెట్‌లో తలపడ్డాయి. అదీనూ వన్డే మ్యాచ్‌లో కావడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో లంక విజయం సాధించింది. అయితే తొలిసారి వన్డే సిరీస్‌ను టీమ్‌ఇండియా సొంతం చేసుకుంది. వన్డే ప్రపంచకప్‌లో తొమ్మిదిసార్లు ఇరు జట్లు ఢీకొట్టుకున్నాయి. అదేవిధంగా 1982లో రెండు జట్లు ముఖాముఖిగా తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాయి. ఇరు జట్ల మధ్య 1985లో మొదటి టెస్టు సిరీస్‌ జరిగింది.  ఇక 2008/09 సీజన్‌లో మొదటిసారి టీ20 సిరీస్‌లో తలపడ్డాయి. ఇప్పుడు మరోసారి మూడు టీ20లు, రెండు టెస్టులను ఆడేందుకు లంక జట్టు భారత్‌కు వచ్చింది. 


కాస్త పోటీనిచ్చినా... టీమ్‌ఇండియాదే ముందంజ

ముఖాముఖిగా భారత్, శ్రీలంక జట్లు అంతర్జాతీయంగా 22 టీ20 మ్యాచ్‌లను ఆడాయి. మన దేశంలో జరిగిన 11 మ్యాచులకుగాను భారత్‌ 8, లంక కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది. అలాగే లంకలో ఎనిమిది మ్యాచుల్లో.. టీమ్‌ఇండియా ఐదు, శ్రీలంక మూడు మ్యాచుల్లో నెగ్గాయి. తటస్థ వేదికల్లో లంకనే కాస్త ఆధిపత్యం ప్రదర్శించింది. మూడు సార్లు తలపడగా.. ఒక మ్యాచ్‌లోనే భారత్ గెలిచింది. రెండు మ్యాచుల్లో లంక విజయం సాధించింది. మరొక మ్యాచ్‌లో ఫలితం ఎటూ తేలలేదు. ఇక సిరీస్‌ల పరంగా చూసినా.. ఐదు సిరీసుల్లో భారత్‌ మూడు దక్కించుకోగా.. లంక రెండు సిరీస్‌లను కైవసం చేసుకుని కాస్త పోటీనిచ్చింది.


టెస్టుల్లో పూర్తి ఆధిపత్యం మనదే

ఇప్పటి వరకు 17 టెస్టు సిరీస్‌ల్లో తలపడగా తొమ్మిదింట్లో భారత్‌... మూడు సిరీస్‌లను లంక కైవసం చేసుకుంది. మొత్తం 44 టెస్టుల్లో తలపడగా.. టీమ్‌ఇండియా 20, లంక ఏడు మ్యాచుల్లో విజయం సాధించాయి. మరో 17 టెస్టులు డ్రాగా ముగిశాయి. ఇక భారత్‌లో 20 జరగగా.. టీమ్‌ఇండియా 11 మ్యాచుల్లో  విజయం సాధించింది. లంక ఒక్కటీ గెలవలేకపోయింది. తొమ్మిది టెస్టులు డ్రాగా ముగియడం గమనార్హం. అయితే లంకలోనూ భారత్‌ ఆధిక్యత ప్రదర్శించింది. తొమ్మిది మ్యాచుల్లో టీమ్‌ఇండియా, ఏడింట్లో లంక గెలిచాయి. ఇక మరో ఎనిమిది టెస్టులు డ్రా అయ్యాయి. దీంతో ఈసారైనా భారత్‌లో ఒక్క మ్యాచ్‌లోనైనా గెలవాలని లంక ఆశిస్తోంది. అదేవిధంగా తొలిసారి పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్సీ చేపట్టిన రోహిత్ శర్మ తన మార్క్‌ను చూపించాలని తహతహలాడుతున్నాడు. ఇప్పటికే వన్డే, టీ20 సారథ్యంలో సక్సెస్‌ కావడంతో ఇప్పుడు దృష్టంతా లంకతో టెస్టులపై పడే అవకాశం ఉంది. టెస్టులకు జట్టును ఇంకా లంక క్రికెట్ బోర్డు ప్రకటించలేదు


జట్ల వివరాలు: 

భారత్‌ (టీ20) : రోహిత్ శర్మ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, దీపక్‌ హుడా, రవీంద్ర జడేజా, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్, మహమ్మద్‌ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్‌దీప్ యాదవ్, అవేశ్‌ ఖాన్ 

టెస్టు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్, ప్రియాంక్‌ పంచాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, శుభ్‌మన్‌ గిల్, హనుమ విహారి, రవిచంద్రన్‌ అశ్విన్‌, సౌరభ్‌ కుమార్, రిషభ్‌ పంత్, శ్రీకర్ భరత్, జయంత్ యాదవ్, కుల్‌దీప్‌ యాదవ్, బుమ్రా, షమీ, సిరాజ్, ఉమేశ్‌ యాదవ్‌

శ్రీలంక (టీ20) : శనక (కెప్టెన్‌), నిసాంక, కుశాల్‌ మెండిస్‌, చరిత్‌ అసలంక (వైస్‌ కెప్టెన్‌), దినేశ్‌ చండిమల్‌, దనుష్క గుణతిలక, కమిల్‌ మిషారా, జనిత్‌ లియనాగె, వనిందు హసరంగ, చామిక కరుణరత్నె, దుష్మంత చమీర, లాహిరు కుమార, బినుర ఫెర్నాండో, షిరన్‌ ఫెర్నాండో, మహీశ్‌ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్‌ జయవిక్రమ, అషియన్‌ డానియెల్‌



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు