ZIM vs IND : భారత్‌-జింబాబ్వే గత ఐదు వన్డేలు.. 200లోపే స్కోరు

తొలి వన్డేలో వికెట్‌ నష్టపోకుండా అలవోకగా ఛేదించిన భారత్‌.. రెండో వన్డేలో మాత్రం జింబాబ్వే బౌలర్ల నుంచి...

Published : 21 Aug 2022 01:29 IST

ఇంటర్నెట్ డెస్క్: తొలి వన్డేలో వికెట్‌ నష్టపోకుండా అలవోకగా ఛేదించిన భారత్‌.. రెండో వన్డేలో మాత్రం జింబాబ్వే బౌలర్ల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంది. జింబాబ్వే నిర్దేశించిన 162 పరుగుల లక్ష్య ఛేదనను భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలో పూర్తి చేసింది. ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా సంజూ శాంసన్‌ నిలిచాడు. ఈ క్రమంలో జింబాబ్వేను మరోసారి తక్కువ స్కోరుకే పరిమితం చేసిన టీమ్‌ఇండియా ఓ అరుదైన రికార్డును నమోదు చేసింది. జింబాబ్వే గత ఐదు వన్డేల్లోనూ ఒక్కసారి కూడా 200 పరుగుల మైలురాయిని తాకకపోవడం గమనార్హం. 

భారత్- జింబాబ్వే జట్ల మధ్య గత ఐదు మ్యాచ్‌లను పరిశీలిస్తే.. 168 (49.5 ఓవర్లు), 126 (34.3 ఓవర్లు), 123 (42.2 ఓవర్లు), 189 (40.3 ఓవర్లు), 161 (38.1 ఓవర్లు) పరుగులకు జింబాబ్వే పరిమితమైంది. గత మ్యాచ్‌లో భారత్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ్టి గెలుపుతో జింబాబ్వేపై భారత్ వరుసగా 14వ విజయం (2013-22) సాధించింది. 

కెప్టెన్లు ఏమన్నారంటే...? 

* కేఎల్ రాహుల్ (భారత సారథి)‌: ఛేదన గురించి ఎలాంటి ఆందోళన పడలేదు. ఎందుకంటే  మాకు బ్యాటింగ్‌ ఆర్డర్‌ చాలా డీప్‌గా ఉంది. యువకులు మిడిలార్డర్‌లో రాణించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక నాకు కూడా ఈ సిరీస్‌ చాలా ముఖ్యం. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన తర్వాత భారీగా పరుగులు చేసి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలని భావించా. అయితే ఈ మ్యాచ్‌లో కలిసిరాలేదు. జింబాబ్వేకి కూడా మంచి బౌలింగ్ దళ ఉంది. లక్ష్యం తక్కువైనప్పటికీ సవాల్ తమ బౌలింగ్‌తో సవాల్‌ విసిరారు. గత బంగ్లాదేశ్‌ సిరీస్‌లోనూ జింబాబ్వే బౌలర్లు అద్భుతంగా రాణించారు. అయితే మా ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. ఇక్కడ భారతీయ అభిమానుల నుంచి గొప్ప మద్దతు లభించింది. వారిందరికీ ధన్యవాదాలు. 

* రెగిస్‌ చకబ్వా (జింబాబ్వే కెప్టెన్‌): ఇవాళ మంచి పోరాటం ఇచ్చామని అనుకుంటున్నా. అయితే ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది. గత మ్యాచ్‌లో వికెట్లు తీయడంలో ఇబ్బంది పడ్డాం. కానీ ఈసారి మాత్రం భారత్‌పై ఒత్తిడి తెచ్చి వికెట్లు పడగొట్టడంలో సఫలమయ్యాం. బ్యాటింగ్‌లో సరైన ఓపెనింగ్‌ దొరకకపోవడం, ఎక్కువ పరుగులు చేయలేకపోవడం నిరుత్సాహానికి గురి చేసింది. సవాళ్లను స్వీకరించడం మాకిష్టం. మా బౌలర్లు లెంగ్త్‌తో బంతులను సంధించడం బాగుంది.

* సంజూ శాంసన్‌: క్రీజ్‌లో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత బాగుంటుంది. మిడిలార్డర్‌లో ఆడటం ఎప్పుడూ బాగుంటుంది. దేశం కోసం ప్రాతినిధ్యం వహించడం ఇంకా ప్రత్యేకం. ఇవాళ మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు పట్టా. కానీ స్టంపింగ్‌ ఒకటి మిస్‌ చేశా. అయితే కీపింగ్‌, బ్యాటింగ్‌ రెండింటినీ ఎంజాయ్‌ చేశా. మా బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్‌ వేశారు. సరైన ప్రాంతంలో బంతులను సంధించారు. చాలా బంతులు అనుకోని విధంగా నా దగ్గరకు వచ్చాయి. సిరీస్‌ను ఇక్కడే కైవసం చేసుకోవడం ఆనందంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని