IND vs ZIM: యువ భారత్‌కు ఎదురుందా?

జోరుమీదున్న టీమ్‌ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. రెండో టీ20లో 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్‌.. బుధవారం కీలకమైన మూడో టీ20లో                 జింబాబ్వేను ఢీకొట్టనుంది.

Published : 10 Jul 2024 02:49 IST

జింబాబ్వేతో మూడో టీ20 నేడు
సాయంత్రం 4.30 నుంచి 
హరారె

జోరుమీదున్న టీమ్‌ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. రెండో టీ20లో 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్‌.. బుధవారం కీలకమైన మూడో టీ20లో                 జింబాబ్వేను ఢీకొట్టనుంది. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివమ్‌ దూబెల చేరికతో మరింత బలోపేతమైన టీమ్‌ఇండియాను నిలువరించడం జింబాబ్వేకు పెద్ద సవాలే.

జింబాబ్వేతో తొలి టీ20లో అనూహ్యంగా ఓడిన గిల్‌ నేతృత్వంలోని యువ జట్టు.. తర్వాతి మ్యాచ్‌లోనూ చెలరేగిపోయి పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. ఇక యువ భారత్‌ను ఆపడం ఆతిథ్య జట్టుకు కష్టమే కావచ్చు. కొత్తగా జైస్వాల్, సంజు శాంసన్, శివమ్‌ దూబె జట్టుతో చేరిన నేపథ్యంలో తుది జట్టును ఎంచుకోవడం భారత్‌కు తలనొప్పిగా మారనుంది.

జైస్వాలా.. అభిషేకా?: జైస్వాల్‌ ఈ మ్యాచ్‌లో ఏ స్థానంలో ఆడతాడన్నదే ఆసక్తి రేపుతోంది. జైస్వాల్, అభిషేక్‌ శర్మలలో ఓపెనర్‌గా ఒకరిని ఎంచుకోవడం జట్టు మేనేజ్‌మెంట్‌కు కష్టమైన పనే. జైస్వాల్‌ గైర్హాజరీలో ఓపెనర్‌గా అభిషేక్‌ ఆకట్టుకున్నాడు. గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన అతడు.. రెండో టీ20ల్లో 46 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. అయితే ఆ స్థానంలో ఓపెనర్‌గా జైస్వాల్‌కు మంచి రికార్డు ఉంది. 17 టీ20ల్లో దాదాపు 162 స్ట్రైక్‌రేట్‌తో అతడు పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. మామూలుగానైతే తొలి ప్రాధాన్య టీ20 జట్టు రిజర్వ్‌ ఓపెనర్‌ అయిన జైస్వాల్‌కే గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశాలెక్కువ. అయితే శతక్కొట్టి జోరు మీదున్న తన స్నేహితుడు అభిషేక్‌ను కెప్టెన్‌ గిల్‌ ఓపెనింగ్‌ నుంచి తప్పించడానికి ఇష్టపడతాడా అన్నది చూడాలి. అభిషేక్, జైస్వాల్‌లలో ఒకరైతే మూడో స్థానంలో ఆడాల్సివుంటుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున సాధారణంగా మూడో స్థానంలో ఆడే సంజు శాంసన్‌.. ఇక్కడ అయిదో స్థానంలో వచ్చే అవకాశముంది. రుతురాజ్‌ నాలుగో స్థానంలో రావొచ్చు. ఇక ఈ మ్యాచ్‌కు తుది జట్టులో మూడు మార్పులు జరగొచ్చు. తొలి రెండు మ్యాచ్‌లకు మాత్రమే ఎంపికైన సాయి సుదర్శన్‌ స్థానంలో జైస్వాల్‌ జట్టులోకి వస్తాడు. ధ్రువ్‌ జురెల్‌ స్థానంలో సంజు శాంసన్‌ ఆడతాడు. ఇక రియాన్‌ పరాగ్‌ స్థానంలో దూబె ఆడే అవకాశముంది. హార్డ్‌హిట్టర్‌ దూబెతో జింబాబ్వే స్పిన్నర్లకు సమస్యలు తప్పవు. తొలి రెండు మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయని గిల్‌ ఈ మ్యాచ్‌లో రాణించాలి. భారత బౌలింగ్‌ విభాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ముకేశ్, అవేష్, బిష్ణోయ్, సుందర్‌ మరోసారి సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు రెండో టీ20లో ఘోరంగా విఫలమైన జింబాబ్వే.. టీమ్‌ఇండియాకు పోటీ ఇవ్వాలన్నా అసాధారణంగా పుంజుకోవాలి. కెప్టెన్‌ సికందర్‌ రజాతో పాటు ఆల్‌రౌండర్లు బెనెట్, జాంగ్వి.. పేసర్లు ముజరబాని, చటారలపై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని