T20 World Cup: అఫ్గాన్‌ ఆటకట్టు

టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో న్యూజిలాండ్‌ లాంటి పెద్ద జట్టును 84 పరుగుల తేడాతో ఓడించిన జట్టు అఫ్గానిస్థాన్‌. ఆ జట్టుతో సూపర్‌-8 మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తొలి సగం వరకు భారత్‌ ఆట చూస్తే..  కంగారు తప్పలేదు.

Updated : 21 Jun 2024 07:00 IST

సూపర్‌-8లో భారత్‌ శుభారంభం
తొలి మ్యాచ్‌లో 47 పరుగుల విజయం
మెరిసిన సూర్య.. విజృంభించిన బుమ్రా

టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో న్యూజిలాండ్‌ లాంటి పెద్ద జట్టును 84 పరుగుల తేడాతో ఓడించిన జట్టు అఫ్గానిస్థాన్‌. ఆ జట్టుతో సూపర్‌-8 మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తొలి సగం వరకు భారత్‌ ఆట చూస్తే..  కంగారు తప్పలేదు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన వేళ.. జస్‌ప్రీత్‌ బుమ్రా ప్రత్యర్థి బ్యాటర్ల మీదికి బంతుల్ని బుల్లెట్లలా సంధించిన తరుణాన..  భారత్‌ ముందు అఫ్గాన్‌ పసికూనే అయింది. 47 పరుగుల తేడాతో  నెగ్గిన రోహిత్‌సేన సూపర్‌-8 దశను ఘనంగా ఆరంభించింది.

బ్రిడ్జ్‌టౌన్‌

టీ20 ప్రపంచకప్‌ లీగ్‌ దశలో తడబడ్డ భారత్‌.. సూపర్‌-8ను మాత్రం ఘనవిజయంతో మొదలుపెట్టింది. గురువారం రోహిత్‌సేన 47 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు సాధించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ (53; 28 బంతుల్లో 5×4, 3×6), హార్దిక్‌ పాండ్య (32; 24 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (3/26), ఫారూఖీ (3/33) ఆకట్టుకున్నారు. అనంతరం బుమ్రా (3/7)తో పాటు అర్ష్‌దీప్‌ (3/36), కుల్‌దీప్‌ (2/32) కూడా సత్తా చాటడంతో అఫ్గాన్‌ 20 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. 26 పరుగులు చేసిన అజ్మతుల్లానే టాప్‌స్కోరర్‌. భారత్‌ తన తర్వాతి సూపర్‌-8 మ్యాచ్‌లో శనివారం బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది.

బూమ్‌ బూమ్‌ బుమ్రా: 4 ఓవర్లు.. 7 పరుగులు.. ఒక మెయిడెన్‌.. 3 వికెట్లు.. ఈ గణాంకాలు చూస్తేనే బుమ్రా ధాటికి అఫ్గానిస్థాన్‌ బ్యాటర్లు ఎంతగా విలవిలలాడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. షాట్‌ ఆడడం సంగతి అటుంచితే.. వికెట్‌ ఇవ్వకుండా అతడి బంతిని కాచుకోవడమే అఫ్గాన్‌ బ్యాటర్లకు సవాలుగా మారింది. ఓపెనర్లు గుర్బాజ్‌ (11), జజాయ్‌ (2)లను వరుస ఓవర్లలో ఔట్‌ చేయడం ద్వారా బుమ్రా అఫ్గాన్‌ పతనానికి పునాది వేశాడు. మధ్యలో అక్షర్‌ మెయిడెన్‌తో ఇబ్రహీం జద్రాన్‌ (8) వికెట్‌ తీసి అఫ్గాన్‌ కష్టాలను ఇంకా పెంచాడు. 23/3తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును నైబ్‌ (17), అజ్మతుల్లా (26), నజిబుల్లా (19), నబి (14) కాస్త ఆదుకునే ప్రయత్నం చేశారు. వారి పోరాటం జట్టు స్కోరును వంద దాటించడానికి మాత్రమే ఉపయోగపడింది. చాలా ముందే అఫ్గాన్‌ ఓటమి ఖరారైపోయింది. మధ్య ఓవర్లలో కుల్‌దీప్, జడేజా (1/20) ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. తొలి స్పెల్‌లో తేలిపోయిన అర్ష్‌దీప్‌ చివరి రెండు ఓవర్లలో 3 వికెట్లతో అఫ్గాన్‌ కథ ముగించాడు. సరిగ్గా ఇన్నింగ్స్‌ చివరి బంతికి ఆ జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది.

సూపర్‌ సూర్య: మొదట భారత్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన తీరు చూస్తే 181 పరుగులు చేయడం గొప్పే. గ్రూప్‌ దశలో లాగే టాప్‌ఆర్డర్‌ తడబడడంతో భారత్‌ 150 పరుగులైనా చేస్తుందా అన్న సందేహం కలిగింది ఓ దశలో. ఫామ్‌తో తంటాలు పడుతున్న రషీద్‌ ఖాన్‌ ఈ మ్యాచ్‌లో విజృంభించి బౌలింగ్‌ చేసి భారత ప్రధాన బ్యాటర్లను పెవిలియన్‌కు క్యూ కట్టించాడు. అయితే భారత్‌ను తొలి దెబ్బ తీసింది మాత్రం పేసర్‌ ఫారూఖీనే. అతను వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో రోహిత్‌ (8) షాట్‌ గురి తప్పడంతో రషీద్‌ చేతికి చిక్కాడు. లీగ్‌ దశలో పేలవ ప్రదర్శన చేసిన కోహ్లి (24), ఈ మ్యాచ్‌లో నిలదొక్కుకోవాలన్న పట్టుదల ప్రదర్శించగా.. మరో ఎండ్‌లో పంత్‌ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. 54/1తో భారత్‌ కుదురుకుంటున్నట్లే కనిపించింది. కానీ రషీద్‌ రాకతో మొత్తం మారిపోయింది. తన తొలి ఓవర్లోనే అతను పంత్‌ను వికెట్ల ముందు బలిగొన్నాడు. తన తర్వాతి ఓవర్లో అతను కోహ్లి సహనానికి తెరదించాడు. డీప్‌ కవర్స్‌లో కోహ్లి మంచి షాటే ఆడినా.. నబికి దొరికిపోక తప్పలేదు. తన మూడో ఓవర్లో దూబె (10)ను కూడా రషీద్‌ ఔట్‌ చేయడంతో 11 ఓవర్లలో భారత్‌ 90/4తో కష్టాల్లో పడింది. అఫ్గాన్‌ మరింత పట్టు బిగించే ప్రయత్నంలో ఉండగా.. అప్పటికే క్రీజులో కుదురుకున్న సూర్యకుమార్‌ ఎదురుదాడికి దిగాడు. రషీద్‌ను మాత్రం ఆచితూచి ఆడిన అతను.. మిగతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడికి హార్దిక్‌ నుంచి చక్కటి సహకారం లభించింది. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన హార్దిక్‌.. తర్వాత తనూ షాట్లకు దిగాడు. దీంతో భారత్‌ 17వ ఓవర్లోనే 150కు చేరుకుంది. దీంతో స్కోరు 200కు చేరువయ్యేలా కనిపించింది. కానీ ఆ ఓవర్లోనే సూర్య ఔటైపోయాడు. తర్వాతి ఓవర్లో హార్దిక్‌ కూడా వెనుదిరిగాడు. అక్షర్‌ (12) కొన్ని షాట్లు ఆడి స్కోరును 180 దాటించాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) రషీద్‌ (బి) ఫారూఖీ 8; కోహ్లి (సి) నబి (బి) రషీద్‌ 24; పంత్‌ ఎల్బీ (బి) రషీద్‌ 20; సూర్యకుమార్‌ (సి) నబి (బి) ఫారూఖీ 53; దూబె ఎల్బీ (బి) రషీద్‌ 10; హార్దిక్‌ (సి) అజ్మతుల్లా (బి) నవీనుల్‌ 32; జడేజా (సి) నైబ్‌ (బి) ఫారూఖీ 7; అక్షర్‌ రనౌట్‌ 12; అర్ష్‌దీప్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 181; వికెట్ల పతనం: 1-11, 2-54, 3-62, 4-90, 5-150, 6-159, 7-165, 8-181; బౌలింగ్‌: ఫజల్‌హక్‌ ఫారూఖీ 4-0-33-3; నబి 3-0-24-0; నవీనుల్‌ 4-0-40-1; రషీద్‌ ఖాన్‌ 4-0-26-3; నూర్‌ అహ్మద్‌ 3-0-30-0; అజ్మతుల్లా 2-0-23-0

అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 11; జజాయ్‌ (సి) జడేజా (బి) బుమ్రా 2; ఇబ్రహీం జద్రాన్‌ (సి) రోహిత్‌ (బి) అక్షర్‌ 8; గుల్బదిన్‌ నైబ్‌ (సి) పంత్‌ (బి) కుల్‌దీప్‌ 17; అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (సి) అక్షర్‌ (బి) జడేజా 26; నజిబుల్లా (సి) అర్ష్‌దీప్‌ (బి) బుమ్రా 19; నబి (సి) జడేజా (బి) కుల్‌దీప్‌ 14; రషీద్‌ఖాన్‌ (సి) జడేజా (బి) అర్ష్‌దీప్‌ 2; నూర్‌ అహ్మద్‌ (సి) రోహిత్‌ (బి) అర్ష్‌దీప్‌ 12; నవీనుల్‌ హక్‌ (సి) పంత్‌ (బి) అర్ష్‌దీప్‌ 0; ఫారూఖీ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 19 మొత్తం: (20 ఓవర్లలో ఆలౌట్‌) 134; వికెట్ల పతనం: 1-13, 2-23, 3-23, 4-67, 5-71, 6-102, 7-114, 8-121, 9-121; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-36-3; బుమ్రా 4-1-7-3; అక్షర్‌పటేల్‌ 3-1-15-1; హార్దిక్‌ 2-0-13-0; కుల్‌దీప్‌ 4-0-32-2; జడేజా 3-0-20-1


మార్పు పని చేసింది 

ఐపీఎల్‌లో అదరగొట్టినా, అంతకుముందు భారత్‌కు ఆడిన మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటినా.. కుల్‌దీప్‌ యాదవ్‌కు టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో ఒక్క మ్యాచూ ఆడే అవకాశం దక్కలేదు. అమెరికాలో పేసర్లకు అనుకూలించిన పిచ్‌పై ముగ్గురు స్పెషలిస్టు పేసర్లతో ఆడిన భారత్‌.. కుల్‌దీప్‌ను పక్కన పెట్టింది. కానీ సూపర్‌-8 దశకు రాగానే భారత్‌ వ్యూహం మారింది. టోర్నీ ముందుకు సాగే కొద్దీ వెస్టిండీస్‌లో పిచ్‌లు స్పిన్నర్లకూ సహకరిస్తాయన్న అంచనాల నేపథ్యంలో సిరాజ్‌ను తప్పించి.. అక్షర్, జడేజాలకు తోడు మూడో స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ను ఆడించింది. అతను పరుగులు కొంచెం ఎక్కువే (4 ఓవర్లలో 32) ఇచ్చుకున్నప్పటికీ రెండు వికెట్లు తీసి సత్తా చాటుకున్నాడు. సిరాజ్‌ గ్రూప్‌ దశలో 3 మ్యాచ్‌లాడి ఒక్క వికెట్టే పడగొట్టడంతో.. సూపర్‌-8లో అతడి స్థానాన్ని కుల్‌దీప్‌తో భర్తీ చేయడం సరైన నిర్ణయమే అని రుజువైంది.


4066

అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి పరుగులు. భారత్‌ తరపున అత్యధిక టీ20 పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్‌ (4050)ను కోహ్లి అధిగమించాడు.


7

ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్లలో బుమ్రా ఇచ్చిన పరుగులు. ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అతి తక్కువ పరుగులు ఇచ్చిన భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.


‘‘బుమ్రా సామర్థ్యమేంటో, తనేంటో చేయగలడో మాకు తెలుసు. పరిస్థితులు ఎలా ఉన్నా తనను సరిగ్గా ఉపయోగించుకోవడం కీలకం. బాధ్యత తీసుకోవడం బుమ్రాకు ఇష్టం. ఏళ్ల నుంచి అదే చేస్తున్నాడు. పరిస్థితులను బట్టి ముగ్గురు స్పిన్నర్ల కూర్పును అనుసరిస్తాం’’

 రోహిత్‌ Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని