CWG 2022: భారత్‌కు పతకాల పంట.. మొత్తం 61 పతకాలు..

కామన్వెల్త్‌ క్రీడల్లో చివరి రోజు భారత్‌ అదరగొట్టింది. బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో అటు పీవీ సింధు, ఇటు లక్ష్యసేన్‌ బంగారు పతకాలు సాధించిన అనంతరం మరో నాలుగు పతకాలు సొంతమయ్యాయి...

Updated : 15 Aug 2022 14:37 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో చివరి రోజు భారత్‌ అదరగొట్టింది. బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో అటు పీవీ సింధు, ఇటు లక్ష్యసేన్‌ బంగారు పతకాలు సాధించిన అనంతరం మరో నాలుగు పతకాలు సొంతమయ్యాయి. అందులో బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత ఆటగాళ్లు సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లైన బెన్‌ లేన్‌, సీన్‌ వెండీల జోడీపై వరుసగా రెండు గేమ్స్‌లోనూ 21-15, 21-13 తేడాతో విజయం సాధించింది. దీంతో బ్యాడ్మింటన్‌లో భారత్‌ నేడు మూడో పసిడిని కైవసం చేసుకుంది. ఇది కామన్వెల్త్‌ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ విభాగంలో భారత్‌కు అత్యుత్తమ ప్రదర్శన. ఈ గేమ్‌లో ఇదివరకు ఎప్పుడూ ఇలా మూడు స్వర్ణాలు సాధించిన దాఖలాలు లేవు. ఇది భారత బ్యాడ్మింటన్‌కు అతిగొప్ప రోజుగా మిగిలింది.

టేబుల్‌ టెన్నిస్‌లోనూ పసిడి..

ఇక పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ ఫైనల్స్‌లోనూ భారత ఆటగాడు శరత్‌ కమల్‌ ఆచంట గెలుపొందాడు. ఇంగ్లాండ్‌ ఆటగాడు లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌తో తలపడిన తుదిపోరులో 4-1తో గెలుపొందాడు. దీంతో భారత్‌ ఈరోజు నాలుగో పసిడిని సొంతం చేసుకుంది. శరత్‌ 2006లో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి ఈ విభాగంలో స్వర్ణం సాధించాడు. మళ్లీ ఇన్నాళ్లకు మరోసారి ఆ ఘనత సాధించాడు. దీంతో మొత్తంగా ఈ ఆటగాడు కామన్వెల్త్‌ క్రీడల్లో 13 పతకాలు కైవసం చేసుకున్నాడు.

జ్ఞానశేఖరన్‌ కాంస్యం..

మరోవైపు పురుషుల టేబుల్‌ టెన్నిస్‌లోనే భారత ఆటగాడు జ్ఞానశేఖరన్‌ సాతియాన్‌ కాంస్య పతక పోరులో పతకం గెలుపొందాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఇంగ్లాండ్‌ ఆటగాడు పాల్‌ డ్రింక్‌హాల్‌ను 11-9, 11-3, 11-5, 8-11, 9-11, 10-12, 11-9 తేడాతో ఓడించి 4-3తో విజయం సాధించాడు. దీంతో కామన్వెల్త్‌ క్రీడల్లో అతడు తొలిసారి సింగిల్స్‌లో పతకం కైవసం చేసుకున్నాడు. ఇక ఆదివారం పురుషుల డబుల్స్‌ విభాగంలో సాతియాన్‌.. శరత్‌ కమల్‌ ఆచంటతో కలిసి ఇంగ్లాండ్‌ జోడీ డ్రింక్‌హాల్‌, లియాప్‌ పిచ్‌ఫోర్డ్‌పై విజయం సాధించి రజతం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కామన్వెల్త్‌ క్రీడల్లో సాతియాన్‌కు ఇది ఆరో పతకం కావడం విశేషం.

రజతంతో సరిపెట్టుకున్న హాకీ జట్టు..

ఇక హాకీ పురుషుల విభాగంలో ఫైనల్స్‌ చేరిన భారత జట్టు పూర్తిగా నిరాశపర్చింది. తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా విఫలమైంది. ఈ మ్యాచ్‌లో నాలుగు క్వార్టర్లలోనూ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన ఆసీస్‌ జట్టు 7-0తో భారత్‌ను చిత్తుగా ఓడించింది. దీంతో కామన్వెల్త్‌ క్రీడల్లో ఆ జట్టు వరుసగా ఏడోసారి బంగారు పతకం కైవసం చేసుకుంది. మరోవైపు ఈ ఓటమితో భారత్‌ రజతంతో సరిపెట్టుకుంది. ఇక మొత్తంగా భారత్‌ ఈసారి కామన్వెల్త్‌ క్రీడల్లో 61 పతకాలు కైవసం చేసుకుంది. అందులో 22 స్వర్ణాలు ఉండగా 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని