రెండు రోజుల సంబరం.. కోహ్లీసేన అంబరం

ఊహించిందొకటి.. జరిగింది మరొకటి! అంచనా వేసిందొకటి.. అయ్యింది మరొకటి! ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. లక్షాపదివేల సామర్థ్యం. జనాలతో కళకళాడుతున్న స్టాండ్లు. టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యమిచ్చే ప్రత్యర్థులు. గులాబి బంతితో పోరు. ఇంకేముంది! ఐదురోజుల క్రికెట్‌ వేడుక...

Updated : 25 Feb 2021 20:19 IST

టీమ్‌ఇండియాదే ‘గులాబి’

10 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం

అహ్మదాబాద్‌: ఊహించిందొకటి.. జరిగింది మరొకటి! అంచనా వేసిందొకటి.. అయ్యింది మరొకటి! ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. లక్షాపదివేల సామర్థ్యం. కళకళాడుతున్న స్టాండ్లు. టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యమిచ్చే ప్రత్యర్థులు. గులాబి బంతితో పోరు. ఇంకేముంది! ఐదురోజుల క్రికెట్‌ వేడుక చేసుకుందామని భావించారు అభిమానులు. కానీ.. వారికా మజా దొరకలేదు. స్పిన్‌ దెబ్బకు అది రెండు రోజుల సంబరంగానే మిగిలిపోయింది.

అక్షర్‌ పటేల్‌ ‘10+’ వికెట్ల సంబరానికి అశ్విన్‌ అనుభవ ఇంద్రజాలం తోడైన వేళ మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ చిత్తుగా ఓడింది. స్పిన్‌ మంత్రానికి బదులివ్వలేక రెండు ఇన్నింగ్సుల్లోనూ విలవిల్లాడింది. మొత్తంగా 193 పరుగులకే 20 వికెట్లు చేజార్చుకుంది. మరోవైపు తన బలమైన ఇదే స్పిన్‌ను కోహ్లీసేన అనువుగా మలుచుకుంది. 49 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. నాలుగు టెస్టుల సిరీసులో 2-1తో ముందంజ వేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడేందుకు మరింత చేరువైంది.

ఓపెనర్లే కొట్టేశారు
ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమ్‌ఇండియా సునాయాసంగా ఛేదించింది. 10 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (25; 25 బంతుల్లో 3×4, 1×6), శుభ్‌మన్‌ గిల్‌ (15; 21 బంతుల్లో 1×4, 1×6) చూడచక్కని షాట్లతో ఆకట్టుకున్నారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా దొరికిన బంతుల్ని నేరుగా బౌండరీకి తరలించారు. 11/0తో డిన్నర్‌కు వెళ్లిన కోహ్లీసేన ఆ తర్వాత వేగంగా విజయానికి చేరువైంది. ముఖ్యంగా ఓపెనర్లు అద్భుతమైన బౌండరీలతో అదరగొట్టారు. దాంతో భారత్‌ 6 ఓవర్లకే 35 పరుగులు చేసేసింది. అప్పటికే ఇంగ్లాండ్‌ ఆటగాళ్లలో ఓటమి తాలూకు నిరుత్సాహం కనిపించింది. ఇదే అదనుగా ఎనిమిదో ఓవర్లో రోహిత్‌ వరుసగా 4, 4, 0, 6తో లాంఛనం ముగించేశాడు. 

33 అయితేనేం!

గులాబి టెస్టులో రెండో రోజు సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. మ్యాచ్‌ ఆసక్తికర మలుపులు తిరిగింది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112కే ఆలౌటై ఆశ్చర్యపరిస్తే టీమ్‌ఇండియా 145కే బ్యాట్లెత్తేసి సంచలనం సృష్టించింది. గురువారం ఆట ఆరంభించిన కోహ్లీసేనను జాక్‌ లీచ్ (4/54)‌, జో రూట్‌ (5/8) రెండు గంటల్లోనే ఆలౌట్‌ చేసేశారు. భారత ఆధిక్యాన్ని కేవలం 33కు పరిమితం చేశారు. నిజానికి 99/3తో ఆట మొదలు పెట్టినప్పుడు భారత్‌ భారీ స్కోరు చేయడం ఖాయమే అనుకున్నారు! దూకుడుగా ఆడుతున్న రోహిత్‌ (66; 96 బంతుల్లో 11×4), నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్న అజింక్య రహానె (7; 25 బంతుల్లో 1×4) జట్టుకు తిరుగులేని ఆధిక్యం అందిస్తారనే భావించారు! కానీ జో రూట్‌ స్పిన్‌ దెబ్బకు రెండో రోజు టీమ్‌ఇండియా 46 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకొని 145కు ఆలౌటైంది.

రూట్‌ 5/8 దెబ్బ

పిచ్‌ అందిస్తున్న సహకారాన్ని ఉపయోగించుకున్న రూట్‌ కేవలం 32 బంతులు విసిరి 5 వికెట్ల ఘనత అందుకున్నాడు. అందులో మూడు మెయిడిన్‌ ఓవర్లు విసిరి 8 పరుగులే ఇచ్చాడు. రెండో రోజు బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ను రోహిత్‌, రహానెను ఔట్‌చేయడం ద్వారా జాక్‌ లీచ్‌ మొదట దెబ్బకొట్టాడు. ఆ తర్వాత రూట్‌ తన పని కానిచ్చేశాడు. రిషభ్‌ పంత్‌ (1), అశ్విన్‌ (17), వాషింగ్టన్‌ సుందర్‌ (0), అక్షర్‌ పటేల్‌ (0), జస్ప్రీత్‌ బుమ్రా (1)ని వరుసగా ఔట్‌ చేశాడు. అశ్విన్‌ కాసేపు ప్రతిఘటించినా అవతలివైపు నుంచి అతడికి అండ లభించలేదు. అక్షర్‌ దూకుడుగా ఆడి ఒత్తిడి చేద్దామనుకొని విఫలమయ్యాడు. కేవలం ఇషాంత్‌ (10; 20 బంతుల్లో 1×6) మాత్రమే అజేయంగా నిలిచాడు.

అక్షర్‌ హవా

ఆధిక్యం తక్కువగానే లభించినా టీమ్‌ఇండియా నిరుత్సాహపడలేదు. స్పిన్‌ ద్వయం అక్షర్‌ పటేల్‌ (5/32), అశ్విన్‌ (4/48) మరోసారి ఆ జట్టును ఘోరంగా దెబ్బకొట్టారు. ప్రత్యర్థిని 81 పరుగులకే ఆలౌట్‌ చేశారు.  పరుగుల ఖాతా ఆరంభించకముందే ఓపెనర్‌ జాక్‌ క్రాలీ (0), వన్‌డౌన్‌ ఆటగాడు జానీ బెయిర్‌ స్టో (0)ను అక్షర్‌ పటేల్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కాసేపు క్రీజులో నిలిచిన డొమినిక్‌ సిబ్లీ (7; 25 బంతుల్లో)నీ అతడే పెవిలియన్‌ పంపించి 19/3తోఆంగ్లేయులపై తీవ్ర ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ను కెప్టెన్‌ జో రూట్‌ (19)తో కలిసి బెన్‌స్టోక్స్‌ (25) ఆదుకొనే ప్రయత్నం చేశాడు. దూకుడుగా రెండు బౌండరీలు బాదాడు. ప్రమాదకరంగా మారేలా కనిపించిన ఆ జోడీని జట్టు స్కోరు 50 వద్ద స్టోక్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా అశ్విన్‌ విడదీశాడు.

అశ్విన్‌ 400 వికెట్లు

ఇక 56 వద్ద రూట్‌ను ఔట్‌ చేసి ఒక టెస్టులో 10 వికెట్ల ఘనత అందుకున్నాడు.మరికాసేపటికే ఒలీ పోప్‌ (12)ను యాష్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అప్పటికి ఇంగ్లాండ్‌ స్కోరు 66/6. ఇక టెయిలెండర్లు  ఎంతో సేపు నిలవలేదు. జోఫ్రా ఆర్చర్‌ (0), జాక్‌ లీచ్‌ (9; 22 బంతుల్లో 1×6)ను అశ్విన్‌ పెవిలియన్‌ పంపించాడు. బెన్‌ఫోక్స్‌ (8; 28 బంతుల్లో)ను అక్షర్ ఔట్‌ చేసి ఒక టెస్టులో 11 వికెట్ల ఘనత అందుకున్నాడు‌. అండర్సన్‌ (0)ను సుందర్‌ ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌ కథ ముగించాడు. ఇక 77 టెస్టుల్లోనే అశ్విన్‌ 400 వికెట్ల ఘనత అందుకొన్నాడు. ముత్తయ్య మురళీధరన్ తర్వాత వేగంగా ఆ మైలురాయి చేరుకొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని