Commonwealth Games 2022: భారత్‌కు మరో బంగారం.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో అదరగొట్టిన జెరెమీ..

కామన్వెల్త్‌ క్రీడలు వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్‌లో నలుగురు......

Updated : 31 Jul 2022 20:00 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడలు వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్‌లో నలుగురు క్రీడాకారులు పతకాలు సాధించగా.. 19 ఏళ్ల జెరెమీ లాల్‌ రిన్నుంగా అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచాడు. నిన్న స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించగా.. జెరెమీ 67 కేజీల విభాగంలో సత్తా చాటి రెండో పసిడి పతకాన్ని తెచ్చిపెట్టాడు. స్నాచ్‌ ఈవెంట్‌లో 140 కేజీలు ఎత్తి కామన్వె్ల్త్‌ క్రీడల్లో రికార్డు సృష్టిస్తూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మొత్తంగా 160 కిలోలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 300 కిలోలకు పైగా ఎత్తి ఓవరాల్‌గానూ రికార్డు సృష్టించాడు. 165 కేజీలు ఎత్తే ఫైనల్‌ విభాగానికి ముందు గాయపడినప్పటికీ ఈ యువకెరటం వెనుకడుగు వేయలేదు. కోచ్‌ల సాయంతో పోటీని మొదటి స్థానంలో పూర్తిచేశాడు.

మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు చెందిన జెరెమీ.. ఏడేళ్ల ప్రాయంలోనే వెయిట్‌లిఫ్టింగ్‌ వైపు అడుగులు వేశాడు. 2018 యూత్‌ ఒలింపిక్స్‌ 62 కేజీల విభాగంలో పసిడి సాధించాడు. గత కామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకాన్ని సాధించాడు. ఈసారి కామన్వెల్త్‌ క్రీడల్లో జెరెమీ సాధించిన స్వర్ణంతో కలిపి భారత్‌ రెండు స్వర్ణ పతకాలు, రెండు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించింది. 

యువశక్తి చరిత్ర సృష్టిస్తోంది.. మోదీ

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ ఇప్పటివరకు రెండు స్వర్ణ పతకాలు సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. మన యువశక్తి చరిత్ర సృష్టిస్తోందని కొనియాడారు. ఆదివారం వెయిట్‌లిఫ్టింగ్‌లో అసాధారణ ప్రతిభతో బంగారు పతకాన్ని సాధించిన 19 ఏళ్ల జెరెమీ లాల్‌ రిన్నుంగాకు మోదీ అభినందనలు తెలిపారు. చిన్న వయస్సులోనే దేశానికి గర్వకారణంగా నిలిచాడని కొనియాడారు.

సంకేత్‌కు రూ.30లక్షల రివార్డు

మరోవైపు, వెయిట్‌ లిఫ్టింగ్‌ 55 కిలోల విభాగంలో రజత పతకంతో మెరిసిన సంకేత్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నగదు రివార్డు ప్రకటించారు. సంకేత్‌కు రూ.30లక్షలు, ఆయన ట్రైనర్‌కు రూ.7లక్షల చొప్పున రివార్డుగా ఇవ్వనున్నట్టు సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని