INDw vs NZw : 0-3తో సిరీస్‌ కోల్పోయిన భారత మహిళల జట్టు

న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న మహిళల టీమ్‌ఇండియా జట్టు మూడో వన్డేలోనూ ఓటమిపాలైంది. దీంతో 0-3 తేడాతో 5 వన్డేల సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పటికే జరిగిన...

Updated : 18 Feb 2022 13:57 IST

(Photo: BCCI Women Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న మహిళల టీమ్‌ఇండియా జట్టు మూడో వన్డేలోనూ ఓటమిపాలైంది. దీంతో 0-3 తేడాతో 5 వన్డేల సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పటికే జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో ఓటమిపాలైన భారత జట్టు శుక్రవారం వన్డే సిరీస్‌నూ చేజార్చుకుంది. న్యూజిలాండ్‌ ముందు 280 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా జట్టు విజయం సాధించలేకపోయింది. కాగా, ఈ మ్యాచ్‌లో సాధించిన 279 పరుగులు భారత మహిళల వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అతిపెద్ద స్కోర్‌ కావడం గమనార్హం. అయినా, ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు విరోచితంగా పోరాడి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను సొంతం చేసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు మేఘన (61; 41 బంతుల్లో 9x4, 2x6), షెఫాలీ వర్మ (51; 57 బంతుల్లో 7x4) శుభారంభం చేశారు. తొలి వికెట్‌కు 100 పరుగులు జోడించగా తర్వాత వచ్చిన యస్తిక భాటియా (19), కెప్టెన్‌ మిథాలి రాజ్‌ (23), హర్మన్‌ ప్రీత్ కౌర్‌ (13) విఫలమయ్యారు. అనంతరం టెయిలెండర్లతో కలిసి దీప్తి శర్మ (69 నాటౌట్‌; 69 బంతుల్లో 7x4, 1x6) విలువైన ఇన్నింగ్స్‌ ఆడింది. దీంతో భారత్‌ 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. ఇక ఛేదనలో జూలన్‌ గోస్వామి (3/47) ఆదిలోనే కివీస్‌ ఓపెనర్లు సోఫీ డివైన్‌ (0), సూజీ బేట్స్‌(5)ను పెవిలియన్‌ పంపినా తర్వాత జట్టు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆపై వచ్చిన మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు అమెలియా కెర్ర్‌ (67; 80 బంతుల్లో 8x4), ఆమీ సాతర్‌వైట్‌ (59; 76 బంతుల్లో 6x4), లారెన్‌ డౌన్‌ (64 నాటౌట్‌; 52 బంతుల్లో 6x4, 2x6) అర్ధశతకాలతో రాణించి ఆ జట్టును గెలిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని