CWG 2022: బార్బడోస్‌ చిత్తు.. సెమీస్‌ చేరిన భారత్‌

కామన్వెల్త్‌ మహిళా క్రికెట్‌లో కీలక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బార్బడోస్‌ను చిత్తుగా ఓడించి గ్రూప్‌-A నుంచి సెమీస్‌కు దూసుకెళ్లింది.

Updated : 04 Aug 2022 05:15 IST

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్‌ మహిళా క్రికెట్‌ కీలక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బార్బడోస్‌ను చిత్తుగా ఓడించి గ్రూప్‌-A నుంచి సెమీస్‌కు దూసుకెళ్లింది. బార్బడోస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 62 పరుగులు మాత్రమే చేసింది. బ్యాటింగ్‌లో రోడ్రిగ్స్‌ (56* నాటౌట్‌; 46 బంతుల్లో 6x4, 1x6), బౌలింగ్‌లో రేణుకా సింగ్ 4/10 విజృంభించిన వేళ భారత్‌ 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యఛేదనకి దిగిన బార్బడోస్‌ బ్యాటర్లు ఆది నుంచే చతికిలపడ్డారు. భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. టీమిండియా బౌలర్లలో రేణుకా సింగ్‌ 4 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేయగా, మేఘ్నా సింగ్‌, స్నేహ రాణా, రాధా యాదవ్, హర్మన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. బార్బడోస్‌ బ్యాటర్లలో కైషోనా నైట్ (16) టాస్‌ స్కోరర్‌గా నిలిచింది.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టుకు ఆరంభంలో షాక్‌ తగిలింది. షకెరా సెల్మాన్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్‌ స్మృతీ మంధాన (5) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేరింది. ఆపై షఫాలీ వర్మ (43), రోడ్రిగ్స్ (56*) దూకుడుగా ఆడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలిసి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 9 ఓవర్లో షఫాలీ రనౌట్‌ కాగా, ఆ వెంటనే వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ డకౌట్‌ అయింది. ఆ తర్వాత తానియా (6) కూడా నిరాశపరచగా, రోడ్రిగ్స్‌తో కలిసి దీప్తి శర్మ (31* నాటౌట్‌) స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. దీంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని