INDw Vs SAw: స్మృతి మంధాన హ్యాట్రిక్‌ సెంచరీ మిస్‌.. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ క్లీన్‌స్వీప్

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ని భారత మహిళల క్రికెట్‌ జట్టు 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది.

Updated : 23 Jun 2024 20:34 IST

బెంగళూరు: భారత మహిళల క్రికెట్‌ జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి (మూడో) వన్డేలో టీమ్‌ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఈ మోస్తరు లక్ష్యాన్ని భారత్‌.. 40.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి రెండు వన్డేల్లో సెంచరీలు బాదిన వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన (90; 83 బంతుల్లో 11 ఫోర్లు) ఈ మ్యాచ్‌లో త్రుటి సెంచరీ మిస్‌ చేసుకుంది. దీంతో హ్యాట్రిక్ సెంచరీల రికార్డు చేజారింది. శతకానికి చేరువైన మంధాన.. మ్లాబా వేసిన 31 ఓవర్‌లో వెనుదిరిగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (42; 48 బంతుల్లో 2 ఫోర్లు) రాణించింది. జట్టు విజయానికి రెండు పరుగుల అవసరమైన దశలో హర్మన్‌ప్రీత్‌ రనౌట్‌గా పెవిలియన్‌ చేరింది. రిచా ఘోష్‌ (6*) సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించింది. షఫాలీ వర్మ (25), ప్రియా పునియా (28), జెమీమా రోడ్రిగ్స్‌ (19*) ఫర్వాలేదనిపించారు.  

దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్‌ వోల్వార్ట్ (61; 57 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ శతకం బాదగా.. మరో ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ (38; 66 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది. ఈ జోడీ 20 ఓవర్లలో తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించింది. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటవ్వడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఒక్కసారిగా గాడితప్పింది. తర్వాత భారత బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టడంతో పెద్ద భాగస్వామ్యాలు నమోదు కాలేదు. నాడిన్ డిక్లెర్క్ (26), మైకే డి రిడర్ (26*) ఆదుకోవడంతో స్కోరు 200 దాటింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2, అరుందతి రెడ్డి 2,  శ్రేయాంకా పాటిల్, పూజ వస్త్రాకర్‌ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

  • మహిళల క్రికెట్‌లో మూడు వన్డేల సిరీస్‌లో అత్యధిక పరుగులు (343) చేసిన క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని