Pink Test: చరిత్రలో తొలిసారి ఆడనున్న మిథాలీసేన

మహిళల క్రికెట్‌ జట్టుకు శుభవార్త! చరిత్రలో తొలిసారి టీమ్‌ఇండియా మహిళల క్రికెట్‌ జట్టు గులాబి బంతి టెస్టు ఆడనుంది....

Published : 20 May 2021 13:35 IST

ముంబయి: మహిళల క్రికెట్‌ జట్టుకు శుభవార్త! చరిత్రలో తొలిసారి టీమ్‌ఇండియా మహిళల క్రికెట్‌ జట్టు గులాబి బంతి టెస్టు ఆడనుంది. ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియాతో డే/నైట్‌ టెస్టులో తలపడనుంది. సెప్టెంబర్లో ఈ సిరీసు ఉండొచ్చని సమాచారం.

‘మహిళల క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు మేం కట్టుబడి ఉన్నాం. చరిత్రలో తొలిసారి భారత మహిళల జట్టు గులాబి టెస్టు ఆడనుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో డే/నైట్‌ టెస్టులో తలపడనుంది. ఈ విషయం ప్రకటించేందుకు సంతోషిస్తున్నాం’ అని బీసీసీఐ కార్యదర్శి జే షా గురువారం ట్వీట్‌ చేశారు. 

మొత్తంగా మహిళల క్రికెట్లో ఇది రెండో డే/నైట్‌ టెస్టు కావడం విశేషం. 2017లో సిడ్నీలో ఆసీస్‌, ఇంగ్లాండ్‌ తొలి గులాబి టెస్టు ఆడాయి. టీమ్‌ఇండియా చివరి సారిగా 2006లో ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌ ఆడింది. ఇక మొత్తంగా ఆసీస్‌, భారత్‌ తొమ్మిది టెస్టులు ఆడగా కంగారూలు నాలుగు మ్యాచుల్లో గెలిచారు. ఐదు మ్యాచులు డ్రా అయ్యాయి.

ప్రస్తుతం భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌ పర్యటనకు సిద్ధమైంది. 2014 తర్వాత తొలిసారి టెస్టు మ్యాచ్‌ ఆడుతోంది. బ్రిస్టల్‌ వేదికగా జూన్‌ 16న ఇంగ్లాండ్‌తో తలపడనుంది. మిథాలీరాజ్‌ జట్టుకు సారథ్యం వహించనుంది. ఆ తర్వాత ఇంగ్లిష్ జట్టుతో 3 వన్డేలు, 3 టీ20ల్లో భారత్‌ పోటీ పడనుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని