RSAW vs INDW: మూడో మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం.. మహిళా టీ20 సిరీస్‌ సమం

దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది.

Updated : 09 Jul 2024 22:14 IST

చెన్నై: దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా రెండో మ్యాచ్‌ రద్దవడంతో చెరో విజయంతో సిరీస్‌ 1-1 గా ముగిసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 84 పరుగులకు ఆలౌటయ్యింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియా కేవలం 10.5 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధాన (54*; 40 బంతుల్లో 8×4,2×6) అర్ధశతకంతో చెలరేగగా.. షెఫాలీ వర్మ (27*; 25 బంతుల్లో 3×4) అద్భుత సహకారం అందించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు భారత్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. ఓ వైపు పరుగులు కట్టడి చేస్తూనే కీలక వికెట్లను పడగొట్టారు. కెప్టెన్‌ ఓల్వార్డ్‌ (9) స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. తజ్మిన్‌ బ్రిట్స్‌ (20), మరిజన్నె (10), అన్నెక బోచ్‌ (17) ఫర్వాలేదనిపించారు. ఈ నలుగురూ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో తొలి మ్యాచ్‌లో విజృంభించిన దక్షిణాఫ్రికా కేవలం 84 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. భారత్‌ బౌలర్లలో పూజా వస్త్రాకర్‌ 4 వికెట్లు పడగొట్టగా.. రాధా యాదవ్‌ 3, అరుంధతి రెడ్డి, శ్రేయంక పాటిల్‌, దీప్తి శర్మ తలో వికెట్‌ తీశారు. ఈ పర్యటనలో మూడు వన్డేల సిరీస్, ఏకైక టెస్టులో సఫారీ జట్టును భారత్‌ చిత్తు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని