INDW vs PAKW : కామన్వెల్త్‌ గేమ్స్‌.. పాక్‌పై టీమ్‌ఇండియా సూపర్‌ విక్టరీ

కామన్వెల్త్‌లో భారత క్రికెట్ అమ్మాయిలు తొలి గెలుపు రుచి చూశారు. కీలకమైన పోరులో పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా...

Updated : 31 Jul 2022 20:06 IST

సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న భారత్‌

ఇంటర్నెట్ డెస్క్‌: కామన్వెల్త్‌లో భారత క్రికెట్ అమ్మాయిలు తొలి గెలుపు రుచి చూశారు. కీలకమైన పోరులో పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. తొలుత 99 పరుగులకే పాక్‌ను కట్టడి చేసిన భారత్‌.. లక్ష్య ఛేదనలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడేసింది. కేవలం రెండు వికెట్లను మాత్రమే నష్టపోయి 11.4 ఓవర్లలో 102 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్‌ స్మృతీ మంధాన (63*) హాఫ్‌ సెంచరీ సాధించి కీలక పాత్ర పోషించింది. షఫాలీ వర్మ 16, సబ్బినేని మేఘన 14, రోడ్రిగ్స్‌ 2* పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో టుబా హస్సన్‌, సోహైల్‌ చెరో వికెట్ తీశారు.

బౌలింగ్‌లో అదరగొట్టి.. 

బౌలింగ్‌లోనూ పాక్‌ను టీమ్ఇండియా బెంబేలెత్తించింది. తొలి ఓవర్‌నే రేణుకా సింగ్‌ మెయిడిన్‌ వేయగా.. రెండో ఓవర్‌లో పాక్‌ బ్యాటర్‌ జావెద్ (0)ను  మేఘ్నా సింగ్ పెవిలియన్‌కు చేర్చింది. అయితే ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ మరూఫ్‌ (17)తో కలిసి ఓపెనర్‌ మునీబా అలీ (32) ఇన్నింగ్స్‌ను నిర్మించేందుకు ప్రయత్నించింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 50 పరుగులను జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని స్నేహ్‌ రాణా ఒకే ఓవర్‌లో ఔట్‌ చేసి భారత్‌కు బ్రేక్ ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి పాక్‌  పతనం ప్రారంభమైంది. అయేషా నసీమ్ (10), అలియా రియాజ్‌ (18), సోహైల్ (10) రెండంకెల స్కోరు సాధించడంతో పాక్‌ ఈ మాత్రం స్కోరునైనా నమోదు చేసింది. ఆఖరి ఓవర్‌లో రనౌట్‌ సహా రెండు వికెట్లను తీసి పాక కుప్పకూలడంలో రాధా యాదవ్‌ కీలకపాత్ర పోషించింది. దీంతో సరిగ్గా 18 ఓవర్లకు 99 పరుగులకు పాక్‌ ఆలౌటైంది. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 2, రాధా యాదవ్ 2.. షఫాలీ వర్మ, రేణుకా సింగ్, మేఘ్నా సింగ్‌ తలో వికెట్ తీశారు. 

ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. 

పాకిస్థాన్‌ నిర్దేశించిన 100 పరుగుల లక్ష్య ఛేదనను భారత్‌ ధాటిగా ప్రారంభించింది. తొలి ఓవర్‌ను ఆచితూచి ఆడిన ఓపెనర్లు స్మృతీ మంధాన, షఫాలీ వర్మ ఆ తర్వాతి నుంచి చెలరేగారు. కేవలం ఆరు ఓవర్లలోనే తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. దూకుడు పెంచేందుకు యత్నించిన షఫాలీని తుబా హస్సన్‌ పెవిలియన్‌కు చేర్చింది. ఆ తర్వాత వచ్చిన సబ్బినేని మేఘన (14)తో మంధాన ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకుపోయింది. మరో ఆరు పరుగులు చేస్తే విజయం భారత్ సొంతమవుతుందనే క్రమంలో పాక్‌ బౌలర్‌ సొహైల్‌ బౌలింగ్‌లో మేఘన క్లీన్‌బౌల్డయింది. ఆఖర్లో స్మృతీ మంధాన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌లో టీమ్ఇండియా సెమీస్‌ ఆశలు సజీవంగా నిలిచాయి. బుధవారం బార్బోడస్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ సెమీస్‌కు చేరుకునే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని