T20 World Cup: అడుగు పడినట్లే..

టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతూ వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా.. సెమీస్‌ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. సూపర్‌-8లో ఇప్పటికే అఫ్గానిస్థాన్‌ను ఓడించిన రోహిత్‌ సేన.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది.

Updated : 23 Jun 2024 06:45 IST

బంగ్లాపై భారత్‌  ఘనవిజయం 
మెరిసిన కుల్‌దీప్, హార్దిక్‌

టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతూ వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా.. సెమీస్‌ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. సూపర్‌-8లో ఇప్పటికే అఫ్గానిస్థాన్‌ను ఓడించిన రోహిత్‌ సేన.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టోర్నీలో తొలిసారి పూర్తి సాధికారితతో బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 196 పరుగుల భారీ స్కోరు సాధించడమే కాదు.. బంతితోనూ సత్తా చాటి ప్రత్యర్థిని 146/8కే పరిమితం చేసింది. సూపర్‌-8లో రెండో విజయంతో భారత్‌ దాదాపుగా ముందంజ వేయగా.. రెండో ఓటమితో బంగ్లాదేశ్‌ దాదాపుగా నిష్క్రమించినట్లే.

నార్త్‌సౌండ్‌

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం గ్రూప్‌-1 సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌.. 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. మొదట హార్దిక్‌ పాండ్య (50 నాటౌట్‌; 27 బంతుల్లో 4×4, 3×6), విరాట్‌ కోహ్లి (37; 28 బంతుల్లో 1×4, 3×6), రిషబ్‌ పంత్‌ (36; 24 బంతుల్లో 4×4, 2×6), శివమ్‌ దూబె (34; 24 బంతుల్లో 3×6) చెలరేగడంతో టీమ్‌ఇండియా 5 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. బంగ్లా బౌలర్లలో తంజిమ్‌ హసన్‌ (2/32), రిషాద్‌ హొస్సేన్‌ (2/43) రాణించారు. అనంతరం కుల్‌దీప్‌ యాదవ్‌ (3/19), బుమ్రా (2/13) విజృంభించడంతో బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేసింది. నజ్ముల్‌ శాంటో (40; 32 బంతుల్లో 1×4, 3×6) టాప్‌స్కోరర్‌.

కూల్చేసిన కుల్‌దీప్‌: ఛేదనలో బంగ్లాదేశ్‌కు పర్వాలేదనిపించే ఆరంభమే దక్కింది. 4.2 ఓవర్లలో 35/0తో బంగ్లా మెరుగ్గా కనిపించింది. అయితే తన బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన లిటన్‌ దాస్‌ (13)ను తర్వాతి బంతికే ఔట్‌ చేసి భారత్‌కు తొలి వికెట్‌ అందించాడు హార్దిక్‌. ఆ తర్వాత కుల్‌దీప్‌ మాయాజాలం మొదలైంది. ఫామ్‌లో ఉన్న తంజిద్‌ (29), తౌహిద్‌ (4)లను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న కుల్‌దీప్‌.. బంగ్లాను కోలుకోలేని దెబ్బ తీశాడు. ప్రమాదకర షకిబ్‌ (11) కూడా అతడికే వికెట్‌ సమర్పించుకోవడంతో బంగ్లా 14 ఓవర్లకు 100/4తో నిలిచింది. మరో ఎండ్‌లో నిలకడగా షాట్లు ఆడుతున్న నజ్ముల్‌ శాంటోను బుమ్రా పెవిలియన్‌ చేర్చడంతో బంగ్లా ఓటమి ఖాయమైపోయింది. చివర్లో రిషాద్‌ హొస్సేన్‌ (24; 10 బంతుల్లో 1×4, 3×6) మెరుపులతో ఆ జట్టు ఓటమి అంతరం కొంచెం తగ్గింది.

అందరూ దంచారు: మొదట భారత ఇన్నింగ్స్‌లో మధ్యలో కొన్ని ఓవర్లు మినహా మెరుపులే మెరుపులు. సూర్యకుమార్‌ మినహా ప్రధాన బ్యాటర్లందరూ ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడారు. టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌లోనూ శుభారంభం అందించని ఓపెనర్లు కోహ్లి, రోహిత్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం ధాటిగా ఆడి జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చారు. రోహిత్‌ ఉన్న కాసేపు మెరుపు షాట్లు ఆడాడు. తంజిమ్‌తో కొత్త బంతిని పంచుకున్న షకిబ్‌ను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి దిగిన రోహిత్‌.. అతడి బౌలింగ్‌లో మరో షాట్‌ ఆడబోయి జేకర్‌కు దొరికిపోయాడు. అయినా స్కోరు బోర్డు జోరు తగ్గలేదు. మరో ఓపెనర్‌ కోహ్లి స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. ముస్తాఫిజుర్‌ వేసిన ఆరో ఓవర్లో విరాట్‌ కళ్లు చెదిరే సిక్సర్‌ కొట్టాడు. పవర్‌ ప్లే అయ్యేసరికి స్కోరు 53/1. 8 ఓవర్లకు 71/1తో భారత్‌ పటిష్ట స్థితికి చేరుకోగా.. తర్వాతి ఓవర్లో తంజిమ్‌ డబుల్‌ షాక్‌ ఇచ్చాడు. మూడు బంతుల వ్యవధిలో కోహ్లి, సూర్యకుమార్‌ (6)లను ఔట్‌ చేశాడు. కోహ్లి బౌల్డవడంతో క్రీజులోకి సూర్య తొలి బంతికే సిక్సర్‌ బాది, తర్వాతి బంతికే ఔటైపోయాడు. దీంతో భారత్‌ 77/3తో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో దూబెతో కలిసి పంత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కుదురుకునేందుకు కొంత సమయం తీసుకున్న పంత్‌.. ఉన్నట్లుండి రెచ్చిపోయాడు. 9 బంతుల వ్యవధిలో 2 సిక్సర్లు, మూడు ఫోర్లు బాదేశాడు. మంచి ఊపుమీదున్న అతణ్ని రిషాద్‌ ఔట్‌ చేసినా.. దూబెకు హార్దిక్‌ తోడవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దూబె మూడు భారీ సిక్సర్లతో అలరించాడు. 16.1 ఓవర్లకే భారత్‌ 160 దాటేసింది. తర్వాతి బంతికి దూబె ఔటైనా.. హార్దిక్‌ చివరి వరకు క్రీజులో నిలిచి జట్టు స్కోరును 200కు చేరువ చేశాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) జేకర్‌ (బి) షకిబ్‌ 23; కోహ్లి (బి) తంజిమ్‌ 37; పంత్‌ (సి) తంజిమ్‌ (బి) రిషాద్‌ 36; సూర్యకుమార్‌ (సి) లిటన్‌ (బి) తంజిమ్‌ 6; దూబె (బి) రిషాద్‌ 34; హార్దిక్‌ నాటౌట్‌ 50; అక్షర్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 196; వికెట్ల పతనం: 1-39, 2-71, 3-77, 4-108, 5-161; బౌలింగ్‌: మెహిదీ హసన్‌ 4-0-28-0; షకిబ్‌ 3-0-37-1; తంజిమ్‌ హసన్‌ 4-0-32-2; ముస్తాఫిజుర్‌ 4-0-48-0; రిషాద్‌ హొస్సేన్‌ 3-0-43-2; మహ్మదుల్లా 2-0-8-0

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: లిటన్‌దాస్‌ (సి) సూర్యకుమార్‌ (బి) హార్దిక్‌ 13; తంజిద్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 29; నజ్ముల్‌ శాంటో (సి) అర్ష్‌దీప్‌ (బి) బుమ్రా 40; తౌహిద్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 4; షకిబ్‌ (సి) రోహిత్‌ (బి) కుల్‌దీప్‌ 11; మహ్మదుల్లా (సి) అక్షర్‌ (బి) అర్ష్‌దీప్‌ 13; జేకర్‌ అలీ (సి) కోహ్లి (బి) అర్ష్‌దీప్‌ 1; రిషాద్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 24; మెహిదీ హసన్‌ నాటౌట్‌ 5; తంజిమ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 146; వికెట్ల పతనం: 1-35, 2-66, 3-76, 4-98, 5-109, 6-110, 7-138, 8-145; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-30-2; బుమ్రా 4-0-13-2; అక్షర్‌ పటేల్‌ 2-0-26-0; హార్దిక్‌ పాండ్య 3-0-32-1; జడేజా 3-0-24-0; కుల్‌దీప్‌ 4-0-19-3 

3002....

టీ20, వన్డే ప్రపంచకప్‌ల్లో కలిపి కోహ్లి చేసిన పరుగులు. ఈ రెండు ప్రపంచకప్‌ల్లో కలిపి 3 వేల పరుగుల మైలురాయి చేరుకున్న తొలి ఆటగాడు అతనే. రెండో స్థానంలో రోహిత్‌ (2637) ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లి.. 30 ఇన్నింగ్స్‌లో 1,207 పరుగులు సాధించాడు. వన్డే ప్రపంచకప్‌ల్లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న అతను.. 37 ఇన్నింగ్స్‌లో 1,795 పరుగులు చేశాడు. 

196....

టీ20 చరిత్రలో తమ టాప్‌-5 బ్యాటర్లలో ఒక్కరూ అర్ధశతకం చేయకుండా టీమ్‌ఇండియా చేసిన రెండో అత్యధిక స్కోరు ఇది. 2019లో న్యూజిలాండ్‌పై 208 పరుగులు సాధించింది. 

13....

బంగ్లాతో మ్యాచ్‌లో భారత్‌ కొట్టిన సిక్సర్లు. టీ20 ప్రపంచకప్‌లో ఓ ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే. గత రికార్డు (2007లో ఇంగ్లాండ్‌పై 11) బద్దలైంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని