ZIM vs IND: డియోన్ మేయర్స్ పోరాటం వృథా.. జింబాబ్వేపై భారత్‌ విజయం

జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్‌ పరుగుల 23 తేడాతో గెలిచింది.

Updated : 10 Jul 2024 21:04 IST

హరారె: జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకు పరిమితమైంది. జింబాబ్వే బ్యాటర్లలో డియోన్ మేయర్స్ (65*; 49 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో మెరవగా..  మండాడే (37; 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. మసకద్జ (18; 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) నాటౌట్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. 

39 పరుగులకే 5 వికెట్లు

భారత బౌలర్ల ధాటికి ఆరంభంలో జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోయింది. మద్వీర (1), మరుమణి (13), బ్రియాన్ బెనెట్ (4), సికిందర్‌ రజా (15), క్యాంప్‌బెల్ (1) వరుసగా పెవిలియన్ బాటపట్టారు. దీంతో 39 పరుగులకే ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం దిశగా సాగింది. ఈ దశలో మండాడే, మేయర్స్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను గాడిలోపెట్టారు. ఈ జోడీ ఆరో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. టీమ్ఇండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, అవేశ్ ఖాన్ 2, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇదే వేదికలో శనివారం నాలుగో టీ20 జరగనుంది. 

రాణించిన గిల్, రుతురాజ్‌ 

టాస్ గెలిచి భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (66; 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఈ మ్యాచ్‌లో అర్ధ శతకం బాదాడు. యశస్వి జైస్వాల్ (36; 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. దీంతో భారత్‌కు శుభారంభం దక్కింది. గత మ్యాచ్‌లో సెంచరీ బాదిన అభిషేక్ శర్మ (10) ఈ సారి నిరాశపర్చాడు. రుతురాజ్ గైక్వాడ్ (49; 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి త్రుటిలో హాఫ్‌ సెంచరీ మిస్ చేసుకున్నాడు.  సంజు శాంసన్ (12*; 7 బంతుల్లో 2 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని