T20 World Cup: వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

దుబాయ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఒకే వికెట్ కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (60*)..

Updated : 20 Oct 2021 19:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దుబాయ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది. ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఒకే వికెట్ కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (60*) అర్ధశతకంతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆష్టన్ అగర్‌ ఒక వికెట్‌ తీశారు. 

ఛేదనకు దిగిన టీమిండియా ఆరంభం నుంచే నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ (39) శుభారంభం అందించారు. ఆష్టన్ అగర్ వేసిన పదో ఓవర్లో రాహుల్ వార్నర్‌కి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అర్థ శతకం పూర్తి చేసుకున్న తర్వాత రోహిత్‌ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా క్రీజు నుంచి నిష్క్రమించాడు. వన్‌ డౌన్‌ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌ (38), హార్దిక్‌ పాండ్య (14) ధాటిగా ఆడుతూ టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.

అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ (1) ఫేలవ ఫామ్‌ను కొనసాగించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన రెండో ఓవర్‌ ఐదో బంతికి అతడు ఎల్బీగా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన మిచెల్‌ మార్ష్‌ (0) కూడా తర్వాతి బంతికే పెవిలియన్‌ చేరాడు. రెండో ఓవర్‌ చివరి బంతికి అతడు రోహిత్ శర్మకి క్యాచ్‌ ఇచ్చి క్రీజు వీడాడు. మరో ఓపెనర్ ఆరోన్‌ ఫించ్‌(8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. రవీంద్ర జడేజా వేసిన నాలుగో ఓవర్లో అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్‌ స్మిత్ (57)‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (37) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని నిలబెట్టారు. ఈ క్రమంలోనే రాహుల్ చాహర్ వేసిన 12వ ఓవర్లో మాక్స్‌వెల్‌ బౌల్డయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్‌ స్టొయినిస్ (41)తో కలిసి స్టీవ్‌ స్మిత్ ఇన్నింగ్స్‌ కొనసాగించాడు. భువనేశ్వర్‌ కుమార్ వేసిన చివరి ఓవర్లో స్టీవ్ స్మిత్‌ రోహిత్ శర్మకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్లలో ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడుగా ఆడటంతో మోస్తరు పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండు, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తలో వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని