IND vs NED: నెదర్లాండ్స్‌ చిత్తు.. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ రెండో విజయం

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ విజయాలతో దూసుకుపోతోంది. గత ఆదివారం పాక్‌పై అపూర్వ విజయం సాధించిన టీమ్‌ఇండియా.. తాజాగా ఇవాళ సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది.

Updated : 27 Oct 2022 19:15 IST

సిడ్నీ: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ రెండో విజయం నమోదు చేసింది. సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్‌ 123/9 స్కోరుకే పరిమితమైంది. టిమ్‌ ప్రింగ్లే (20) ఆ జట్టులో టాప్‌ స్కోరర్. మిగతా బ్యాటర్లలో విక్రమ్‌జిత్ 1, మ్యాక్స్‌ ఓడౌడ్ 16, బాస్ డి లీడె 16, కొలిన్ అకెర్‌మన్ 17, టామ్‌ కూపర్ 9, స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ 5, షరిజ్‌ అహ్మద్ 16*, పావ్ వ్యాన్‌ మీరెకెన్ 14* పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 2, అక్షర్ పటేల్ 2, అశ్విన్‌ 2, అర్ష్‌దీప్ 2, షమీ ఒక వికెట్ తీశారు. సూపర్ -12 స్టేజ్‌లో ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడనుంది.

ముగ్గురు అర్ధశతకాలు..

ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ (9) మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (53) ఆచితూచి ఆడుతూనే స్కోరు బోర్డును నడిపించాడు. అలాగే రాహుల్‌ స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (62*) తన ఫామ్‌ను కొనసాగిస్తూ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. భారీ షాట్‌కు యత్నించిన రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. అయితే ఆ తర్వాతే స్కోరు బోర్డు మరింత వేగం పుంజుకొంది. వచ్చీ రాగానే సూర్యకుమార్‌ యాదవ్‌ (51*) దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. విరాట్‌తో కలిసి మూడో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో మీకెరెన్, క్లాసెన్ చెరో వికెట్‌ తీశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని