IND vs SA: కీలక పోరులో భారత్‌ ఘన విజయం.. దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ కైవసం

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకొంది. దిల్లీ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. సఫారీలను బౌలింగ్‌తో కట్టడి చేసిన టీమ్‌ఇండియా.. బ్యాటింగ్‌లోనూ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గెలిచింది.

Updated : 11 Oct 2022 19:26 IST

దిల్లీ: ఇప్పటికే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకొన్న భారత్‌.. తాజాగా సఫారీలతో వన్డే సిరీస్‌నూ సొంతం చేసుకొంది. దిల్లీ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో అన్ని రంగాల్లో రాణించిన టీమ్‌ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకొంది. మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా గెలవగా.. చివరి రెండు మ్యాచుల్లో భారత్‌ విజయం సాధించడం విశేషం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కుల్‌దీప్‌ యాదవ్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డును మహమ్మద్ సిరాజ్‌ స్వీకరించారు.

చెరొక విజయంతో సిరీస్‌లో 1-1తో సమంగా నిలవడంతో మూడో వన్డే కీలకంగా మారింది. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించి దక్షిణాఫ్రికాను 99 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో వంద పరుగుల లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో 105 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ (49) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకోగా.. శ్రేయస్‌ అయ్యర్ 22*, ఇషాన్‌ కిషన్‌ 10, శిఖర్ ధావన్‌ 8 పరుగులు చేశారు. ఇంకో మూడు పరుగులు అవసరమైన సందర్భంలో గిల్ ఔట్ కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా బౌలర్‌ ఫోర్టుయిన్‌, ఎంగిడి చెరో వికెట్‌ తీయగా.. ధావన్‌ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 

స్పిన్నర్ల హవా.. ఏడుగురు సింగిల్‌ డిజిట్‌

భారత్‌ బౌలింగ్‌ దళంలో ఇవాళ స్పిన్నర్లు తమ సత్తా చాటారు. అయితే సిరాజ్‌ కూడా రెండు కీలక వికెట్లు తీశాడు. మరీ ముఖ్యంగా కుల్‌దీప్ యాదవ్ (4/18), సుందర్ (2/15), షహబాజ్‌ (2/32) విజృంభించారు. సఫారీల బ్యాటర్లను ఏమాత్రం క్రీజ్‌లో నిలవనీయకుండా పెవిలియన్‌కు చేర్చారు. స్లో డెలివరీలతో కుల్‌దీప్‌ దక్షిణాఫ్రికాను ఇబ్బంది పెట్టాడు. క్లాసెన్ (34) టాప్‌ స్కోరర్‌ కాగా.. మలన్ (15), జాన్‌సెన్ (14)  రెండంకెల స్కోరు సాధించారు. ఏడుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. దక్షిణాఫ్రికాకు డేవిడ్ మిల్లర్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని