Ind Vs Bnagladesh: బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం.. సెమీస్‌ బెర్తు ఖాయం!

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 పోరులో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 22 Jun 2024 23:56 IST

ఆంటిగ్వా: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) సూపర్‌-8లో భాగంగా బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటర్లు అదరగొట్టడంతో టీమ్ఇండియా (Team India) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ హార్దిక్ పాండ్య (50*; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ భారీ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌ 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో (40; 32 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్. టెయిలెండర్ రిషాద్ హొస్సేన్ (24; 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. తాంజిద్ హసన్ (29), లిటన్ దాస్ (13), మహ్మదుల్లా (13), షకిబ్ అల్ హసన్ (11) పరుగులు చేశారు. కుల్‌దీప్ యాదవ్ (3/19), జస్‌ప్రీత్ బుమ్రా (2/13) బంగ్లాను దెబ్బకొట్టారు. అర్ష్‌దీప్ సింగ్ 2, హార్దిక్ పాండ్య ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ దాదాపు సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు, సూపర్‌-8లో వరుసగా రెండో ఓటమిని చవిచూసిన బంగ్లాదేశ్‌ సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించింది. రోహిత్ సేన సోమవారం (జూన్‌ 24న) ఆస్ట్రేలియాతో చివరి సూపర్‌-8 మ్యాచ్‌ ఆడనుంది.  

అదరగొట్టిన బ్యాటర్లు 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (6) తప్ప మిగిలిన ఆటగాళ్లంతా అదరగొట్టారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (23; 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్ కోహ్లీ (37; 28 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడారు. రిషభ్‌ పంత్ (36; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబె (34; 24 బంతుల్లో 3 సిక్స్‌లు) కూడా రాణించారు. చివర్లో హార్దిక్ పాండ్య దూకుడుగా ఆడాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో భారత్ భారీ స్కోరు సాధించింది. హార్దిక్‌ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఫోర్‌ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ 2, రిషాద్ హొస్సేన్ 2, షకిబ్ అల్ హసన్ ఒక వికెట్ పడగొట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని