ZIM vs IND : రెండో వన్డేలోనూ విజయం.. సిరీస్‌ పట్టేసిన టీమ్‌ఇండియా

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను టీమ్‌ఇండియా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. హరారే వేదికగా జరిగిన రెండో వన్డేలో...

Updated : 20 Aug 2022 18:56 IST

ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను టీమ్‌ఇండియా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. హరారే వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 161 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ ఐదు వికెట్లను కోల్పోయి 25.4 ఓవర్లలో 167 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (1), ఇషాన్‌ కిషన్‌ (6) విఫలం కాగా.. సంజూ శాంసన్ (43*), శిఖర్ ధావన్ (33), శుభ్‌మన్‌ గిల్ (33), దీపక్ హుడా (25) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో లూక్ జాగ్వే 2.. తనక చివాంగ, నైయుచి, సికిందర్ రజా తలో వికెట్ తీశారు. మూడో వన్డే సోమవారం జరగనుంది.

బ్యాటింగ్‌ పోయినా.. బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించి

తొలి వన్డేలో కాస్త పోరాడే స్కోరును సాధించిన జింబాబ్వే బ్యాటర్లు రెండో మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేశారు. సీన్ విలియమ్స్ (42), రైన్‌ బర్ల్ (39*) రాణించడంతో జింబాబ్వే (161) ఈ మాత్రం స్కోరునైనా సాధించగలిగింది. టాప్‌ఆర్డర్‌తోపాటు కెప్టెన్‌ చకబ్వా (2), సికిందర్‌ రజా (16) విఫలం కావడం జింబాబ్వేను దెబ్బతీసింది. అయితే భారత్  ఎదుట 162 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంచినా జింబాబ్వే బౌలర్లు మాత్రం అద్భుతంగా బౌలింగ్‌ వేశారు. గత మ్యాచ్‌లో వికెట్లు తీయడానికి ఇబ్బంది పడినప్పటికీ.. ఈసారి మాత్రం టీమ్‌ఇండియాకి చెందిన ఐదుగురు బ్యాటర్లను ఔట్‌ చేశారు. ఇక ఆఖరి మ్యాచ్‌లోనైనా బ్యాటింగ్‌లో పుంజుకుని ఆడితేనే జింబాబ్వే పరువు నిలుపుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భారత్ సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో రిజర్వ్‌ బెంచ్‌ను పరీక్షించే ఛాన్స్‌ ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని