IND vs SL: భారత్‌పై శ్రీలంక విజయం..

టీమ్‌ఇండియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గబ్బర్‌సేన నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 39 ఓవర్లలో ఛేదించింది...

Updated : 23 Jul 2021 23:50 IST

2-1 తేడాతో గబ్బర్‌సేన సిరీస్‌ కైవసం..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గబ్బర్‌సేన నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 39 ఓవర్లలో ఛేదించింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక 1-2 తేడాతో కోల్పోయింది. అంతకుముందు భారత్‌ తొలి రెండు వన్డేలు గెలుపొందడంతో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఏడు వికెట్లు కోల్పోయి ఉత్కంఠ పరిస్థితుల్లో విజయం సాధించింది. ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో(76; 98 బంతుల్లో 4x4, 1x6), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ భానుక రాజపక్స(65; 56 బంతుల్లో 12x4) కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 109 పరుగులు జోడించి లంక విజయానికి బలమైన పునాది వేశారు. తర్వాత చారిత్‌ అసలంక (24; 28 బంతుల్లో 3x4), రమేశ్‌ మెండిస్‌(15 నాటౌట్‌; 18 బంతుల్లో 1x4) వీలైనన్ని పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చడంలో తమవంతు పాత్ర పోషించారు. భారత బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ మూడు, చేతన్‌ సకారియా రెండు వికెట్లు తీయగా హార్దిక్‌, కృష్ణప్ప గౌతమ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఇక తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 225 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(13) త్వరగా పెవిలియన్‌ చేరినా పృథ్వీషా(49; 49 బంతుల్లో 8x4), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌ (46; 46 బంతుల్లో 5x4, 1x6) నిలకడగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే అర్ధశతకాలకు ముందు స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔటయ్యారు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 118/3గా నమోదైంది. తర్వాత సూర్యకుమార్‌‌(40; 37 బంతుల్లో 7x4), మనీశ్‌ పాండే (11; 19 బంతుల్లో) ఆదుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. 23 ఓవర్ల తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దాంతో సుమారు 45 నిమిషాలు పాటు ఆట నిలిచిపోయింది. ఈ క్రమంలోనే మ్యాచ్‌ను డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో 47 ఓవర్లకు కుదించారు.

మరోవైపు మ్యాచ్‌ తిరిగి ప్రారంభమయ్యాక లంక బౌలర్లు చెలరేగిపోయారు. భారత బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనివ్వలేదు. వరుస క్రమంలో వికెట్లు తీశారు. 38 పరుగుల తేడాతో ఐదు వికెట్లు పడగొట్టి భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. దాంతో టీమ్‌ఇండియా 32.5 ఓవర్లకే 195/8 స్కోర్‌తో నిలిచింది. మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య (19), సూర్యకుమార్‌ యాదవ్, కృష్ణప్ప గౌతమ్ (2), నితీశ్‌ రాణా (7) వరుసగా ఔటయ్యారు. అయితే, 34వ ఓవర్‌ నుంచి బ్యాటింగ్‌ కొనసాగించిన రాహుల్‌ చాహర్‌ (13), నవ్‌దీప్‌ సైని (15) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 29 పరుగులు జోడించి భారత్‌కు మోస్తరు స్కోర్‌ అందించారు. చివరికి 42, 43 ఓవర్లలో ఒకరి తర్వాత ఒకరు ఔటవ్వడంతో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని