Asian Games: అక్కడ అబ్బాయిలు.. ఇక్కడ అమ్మాయిలు

పసిడి వేట మొదలైంది. గురి తప్పని షూటర్లు బంగారు బోణీ కొట్టగా.. క్రికెట్‌ అమ్మాయిలు స్వర్ణం పట్టుకొచ్చి.. అభిమానులకు డబుల్‌ ఆనందాన్నిచ్చారు.

Updated : 26 Sep 2023 09:32 IST

ఆసియా క్రీడల్లో పసిడి మోత
షూటింగ్‌, క్రికెట్‌లో భారత్‌కు స్వర్ణాలు
రోయింగ్‌లో మరో రెండు కాంస్యాలు
రెండో రోజు ఖాతాలో ఆరు పతకాలు

పసిడి వేట మొదలైంది. గురి తప్పని షూటర్లు బంగారు బోణీ కొట్టగా.. క్రికెట్‌ అమ్మాయిలు స్వర్ణం పట్టుకొచ్చి.. అభిమానులకు డబుల్‌ ఆనందాన్నిచ్చారు. తొలి రోజు అయిదు పతకాలు నెగ్గినా పసిడి గెలవని భారత్‌.. రెండో రోజు క్రీడల్లో రెండు స్వర్ణాలు సహా ఆరు పతకాలు ఖాతాలో వేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌లో భారత బృందం ప్రపంచ రికార్డుతో ఛాంపియన్‌గా నిలవడం విశేషం. షూటింగ్‌లో మరో రెండు కాంస్యాలూ ఖాతాలో చేరాయి. ఆసియాలో క్రికెట్‌లో భారత్‌కు తిరుగులేదంటూ హర్మన్‌సేన ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసింది. రోయర్లు ఉత్తమ ప్రదర్శన కొనసాగించి మరో రెండు కాంస్యాలనూ గెలుచుకున్నారు.

హాంగ్‌జౌ

ద్భుత ప్రదర్శనతో మెప్పించిన షూటర్లు ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పసిడిని అందించారు. సోమవారం పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో బంగారు పతకం గెలిచింది. ప్రపంచ ఛాంపియన్‌ రుద్రాంక్ష్, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌, దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌ కలిసి 1893.7 స్కోరు చేసి అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. అర్హత రౌండ్లో టీనేజీ సంచలనం రుద్రాంక్ష్ 632.5, ప్రతాప్‌ 631.6, దివ్యాన్ష్‌ 629.6 పాయింట్ల చొప్పున సాధించారు. దీంతో ఈ ఏడాది బాకులో చైనా నెలకొల్పిన ప్రపంచ రికార్డు (1893.3)ను భారత షూటర్లు తిరగరాశారు. దక్షిణ కొరియా (1890.1), చైనా (1888.2) వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గాయి. వ్యక్తిగత విభాగంలో ప్రతాప్‌ కాంస్యం సాధించాడు. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో రుద్రాంక్ష్ కానీ, ప్రతాప్‌ కానీ పసిడి గెలవలేకపోవడం నిరాశ కలిగించే విషయమే. క్వాలిఫికేషన్‌లో రుద్రాంక్ష్, ప్రతాప్‌, దివ్యాంశ్‌ వరుసగా 3, 5, 8 స్థానాల్లో నిలిచారు. కానీ ఫైనల్లో ఒక దేశం నుంచి ఇద్దరు షూటర్లు మాత్రమే పోటీపడాలనే ఈ క్రీడల నిబంధన కారణంగా ఎనిమిది మంది షూటర్ల ఫైనల్‌కు దివ్యాంశ్‌ దూరమయ్యాడు. మూడో స్థానం కోసం షూటాఫ్‌లో రుద్రాంక్ష్ (208.7)తో తలపడి ప్రతాప్‌ (228.8) గెలిచాడు. చైనా షూటర్‌ షెంగ్‌ (253.3) ప్రపంచ రికార్డు స్కోరుతో పసిడి పట్టేశాడు. పార్క్‌ (దక్షిణ కొరియా- 251.3) వెండి పతకం దక్కించుకున్నాడు. మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో దేశానికి కంచు పతకం దక్కింది. అనీశ్‌ భన్వాలా, విజయ్‌వీర్‌  సిద్ధు, ఆదర్శ్‌ సింగ్‌తో కూడిన భారత త్రయం క్వాలిఫికేషన్లో 1718 పాయింట్లతో మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. రెండంచెల క్వాలిఫికేషన్లో ఆదర్శ్‌ 576, అనీశ్‌ 560, విజయ్‌వీర్‌ 582 చొప్పున పాయింట్లు సాధించారు. చైనా (1765) స్వర్ణం, దక్షిణ కొరియా (1734) రజతం అందుకున్నాయి.  

అయిదు పతకాలతో: ఆసియా క్రీడలను భారత రోయర్లు అయిదు పతకాలతో ముగించారు. పోటీల తొలి రోజు రెండు రజతాలు, ఓ కాంస్యం నెగ్గిన రోయర్లు.. రెండో రోజు మరో రెండు కాంస్యాలు సొంతం చేసుకున్నారు. మొదట పురుషుల ఫోర్‌ విభాగం ఫైనల్లో జస్విందర్‌ సింగ్‌, భీమ్‌ సింగ్‌, పునీత్‌ కుమార్‌, ఆశిష్‌ గోలియాన్‌తో కూడిన భారత జట్టు 6 నిమిషాల 10.81 సెకన్లలో రేసు ముగించి మూడో స్థానంలో నిలిచింది. చివరి 20 మీటర్లు ఉందనగా ఒక తెడ్డు (ఓర్‌) బూయ్‌లో ఇరుక్కుపోవడంతో భారత్‌ 0.77 సెకన్ల తేడాతో మూడో స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్థాన్‌ (6:04.96సె), చైనా (6:10.04సె) వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. క్వాడ్రపుల్‌ స్కల్స్‌ ఫైనల్లోనూ సత్నామ్‌ సింగ్‌, పర్మిందర్‌, జకార్‌, సుఖ్‌మీత్‌ తో కూడిన భారత్‌ కంచు పతకం గెలిచింది. రేసులో 6 నిమిషాల 08.61 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. చైనా (6:02.65సె), ఉజ్బెకిస్థాన్‌  (6:04.64సె) వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలుచుకున్నాయి. భారత రోయర్లు ఈ సారి 2018 క్రీడల (ఓ స్వర్ణం, రెండు కాంస్యాలు) కంటే ఎక్కువ పతకాలు గెలిచారు. కానీ పసిడి ముద్దాడలేకపోయారు.


బోపన్న జోడీకి షాక్‌

ఫైనల్లో ప్రణతి

టెన్నిస్‌ డబుల్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలో దిగిన రోహన్‌ బోపన్న-యుకి బాంబ్రి జోడీకి షాక్‌! ఈ భారత జంట రెండో రౌండ్లోనే ఓడిపోయింది. బోపన్న ద్వయం 6-2, 3-6, 6-10తో సెర్గీ ఫొమిన్‌-కుమోయున్‌ (ఉజ్బెకిస్థాన్‌) జోడీ చేతిలో కంగుతింది. రామ్‌కుమార్‌-సాకేత్‌ మైనేని 6-3, 6-2తో సుశాంటో-అగుంగ్‌ (ఇండోనేషియా)పై నెగ్గి క్వార్టర్స్‌ చేరారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బోపన్న ముందంజ వేశాడు. బోపన్న-రుతుజ భోంస్లే జంట 6-4, 6-2తో అక్‌గుల్‌-మక్‌సిమ్‌ (ఉజ్బెకిస్థాన్‌) జోడీని ఓడించి ప్రిక్వార్టర్స్‌ చేరింది. మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా, రుతుజ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించారు. స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్‌ 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ఫైనల్‌ చేరాడు. హీట్స్‌లో 25.43 సెకన్లలో రేసు పూర్తి చేసిన అతడు ఆరో స్థానంలో నిలిచి ముందంజ వేశాడు. 100 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌లో లిఖిత్‌ సెల్వరాజ్‌ ఫైనల్‌ చేరినా పతకం తేవడంలో విఫలమయ్యాడు. అతడు 1 నిమిషం 1.62 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల 4×200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ స్విమ్మింగ్‌లోలో ఆర్యన్‌, అనీష్‌, కుశాగ్ర, తనీష్‌లతో కూడిన భారత జట్టు (7 నిమిషాల 29.04 సె) కూడా తుదిపోరుకు అర్హత సాధించింది.  జిమ్నాస్టిక్స్‌లో ప్రణతి నాయక్‌ ఆల్‌రౌండ్‌, వాల్ట్‌ విభాగాల్లో ఫైనల్లోకి ప్రవేశించింది ఆల్‌రౌండ్‌లో 44.232 స్కోరుతో 23వ స్థానం, వాల్ట్‌లో 12.716 స్కోరుతో ఆరో స్థానంతో ప్రణతి ముందంజ వేసింది.

బాక్సర్లు ముందంజ: బాక్సింగ్‌లో పురుషుల విభాగంలో నిశాంత్‌ దేవ్‌ (71 కేజీ), దీపక్‌ (51 కేజీ) ప్రిక్వార్టర్స్‌ చేరారు. నిశాంత్‌ 5-0తో దీపేశ్‌ (నేపాల్‌)ను చిత్తు చేయగా.. దీపక్‌ అంతే తేడాతో అబ్దుల్‌ బిన్‌ (మలేసియా)ను ఓడించాడు. చెస్‌లో అర్జున్‌ ఇరిగేశి, విదిత్‌ గుజరాతి మూడేసి పాయింట్లతో వరుసగా 3, 6 స్థానాల్లో కొనసాగుతున్నారు. జూడోలో గరిమ చౌదరి నిష్క్రమించింది. మహిళల 70 కేజీల ప్రిక్వార్టర్స్‌లో ఆమె 0-10తో రైకో సలైనాస్‌ (ఫిలిప్ఫీన్స్‌) చేతిలో చిత్తయింది.


డ్రాగన్‌ పసిడి జోరు

ఆసియా క్రీడల్లో ఇప్పటిదాకా 69 స్వర్ణాలకు పోటీలు జరిగితే అందులో 39 చైనానే కైవసం చేసుకుని ఆధిపత్యాన్ని చాటింది. రెండురోజుల్లోనే ఆ దేశం ఖాతాలో 69 పతకాలు చేరాయి. రోయింగ్‌లో చైనా హవా కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న 14 స్వర్ణాల్లో ఆ దేశం 11 గెలుచుకుంది. ఈ ఆసియాక్రీడల్లో తొలి స్వర్ణాన్ని రోయింగ్‌ ఈవెంట్లోనే చైనా సాధించింది.

ఉత్తర కొరియాకు ఓ పతకం: 2018 ఆసియా క్రీడల తర్వాత ఓ పెద్ద ఈవెంట్లో పాల్గొంటున్న ఉత్తర కొరియా తొలిసారి పతకాన్ని సొంతం చేసుకుంది. జూడోలో క్వాంగ్లిన్‌ (60 కేజీ) ఆ దేశానికి పతకాన్ని సాధించి పెట్టాడు.


క్రికెట్‌ రాణులు

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు అంచనాలను అందుకుంది. సోమవారం ఫైనల్లో శ్రీలంకను 19 పరుగుల తేడాతో ఓడించి స్వర్ణం చేజిక్కించుకుంది. బౌలర్లకు పూర్తిగా అనుకూలిస్తూ పరుగులు చేయడం కష్టంగా మారిన పిచ్‌పై మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 7 వికెట్లకు 116 పరుగులే చేయగలిగింది. స్మృతి మంధాన (46; 45 బంతుల్లో 4×4, 1×6), జెమీమా రోడ్రిగ్స్‌ (42; 40 బంతుల్లో 5×4) రాణించారు. లంక బౌలర్లలో ఉదేశిక (2/16), ఇనోక (2/21), సుగందిక కుమారి (2/30) సత్తా చాటారు. అనంతరం పేసర్‌ తితాస్‌ సాధు (3/6) నిప్పులు చెరగడంతో ఛేదనలో లంక కుదేలైంది. 14 పరుగులకే ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. హాసిని (25), నీలాక్షి (23), ఒషాడి (19) పోరాడటంతో లంక పుంజుకున్నా.. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి ఆ జట్టుకు అవకాశం లేకుండా చేశారు. రాజేశ్వరి (2/20), దేవిక వైద్య (1/15) పూజ వస్త్రాకర్‌ (1/20) కూడా లంక పతనంలో పాలుపంచుకున్నారు. ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులే చేయగలిగింది.

రెండే రెండు మ్యాచ్‌లతో..: ఈసారి ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌ జట్టు రెండే మ్యాచ్‌లు ఆడి, ఆ రెంటిలోనూ నెగ్గి స్వర్ణం సాధించడం విశేషం. టాప్‌ సీడ్‌ కావడంతో భారత్‌ నేరుగా క్వార్టర్స్‌ ఆడే అవకాశం దక్కించుకుంది. అయితే మలేసియాతో జరిగిన ఈ మ్యాచ్‌ మధ్యలో వర్షం వల్ల రద్దయింది. అయినప్పటికీ టాప్‌ సీడ్‌ కావడంతో భారత్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్‌.. ఫైనల్లో లంకకు చెక్‌ పెట్టి పసిడి నెగ్గింది. మరోవైపు బంగ్లాదేశ్‌ కాంస్యం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. భారత జట్టులో సభ్యురాలైన అనూష తెలుగమ్మాయి.


స్కోరర్‌గా మొదలై..

శ్రీలంకతో ఆసియా క్రీడల క్రికెట్‌ ఫైనల్లో సత్తా చాటిన తితాస్‌ సాధు ప్రయాణమే ఒక చిత్రం. ఎందుకంటే ఈ 18 ఏళ్ల బెంగాల్‌ అమ్మాయి క్రికెటర్‌ కావాలని అనుకోలేదు. బుద్ధిగా చదువుకునేది. తండ్రి రమణ్‌దీప్‌ రాష్ట్ర స్థాయి అథ్లెట్‌ కావడంతో క్రికెట్‌తో పాటు కొన్ని ఆటలు పరిచయమే.. ఏదో ఒక దాన్ని కెరీర్‌గా ఎంచుకోలేదు. చదువుపైనే దృష్టి పెట్టడంతో పదో తరగతి పరీక్షల్లో 90 శాతానికి పైగానే మార్కులు వచ్చాయి. అయితే రాజేంద్ర స్మృతి సంఘా క్లబ్‌లో తితాస్‌ అప్పుడప్పుడూ స్కోరర్‌గా సేవలందించేది. ఒకరోజు క్లబ్‌ జట్టుకు నెట్‌ బౌలర్‌ తక్కువ కావడంతో తితాస్‌కు అవకాశం ఇచ్చారు. క్రికెట్లో ఆమెకు పడిన తొలి అడుగు అదే. అక్కడ నుంచి ఆటను సీరియస్‌గా తీసుకున్న తితాస్‌.. తాను ఎంతో అభిమానించే జులన్‌ గోస్వామి మార్గదర్శనంలో పేసర్‌గా ఎదిగింది. త్వరగానే సీనియర్‌ బెంగాల్‌ జట్టులో చోటు దక్కించుకుంది. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటి జాతీయ జట్టు తలుపు తట్టింది.


ఆసియా క్రీడల్లో ఈనాడు

ఈక్వెస్ట్రియన్‌:  డ్రెసేజ్‌ వ్యక్తిగత, టీమ్‌ (హృదయ్‌, అనూష్‌, దివ్యాకృతి, సుదీప్తి)- ఉ.5.30

షూటింగ్‌: పురుషుల స్కీట్‌ వ్యక్తిగత, టీమ్‌ క్వాలిఫికేషన్‌ ఫేజ్‌ 1 (అనంత్‌, గుర్జాత్‌, అంగద్‌ వీర్‌); మహిళల స్కీట్‌ వ్యక్తిగత, టీమ్‌ (గనేమత్‌, దర్శన, పారినాజ్‌); మహిళల 25మీ. పిస్టల్‌ క్వాలిఫికేషన్‌, టీమ్‌ (రిథమ్‌, ఇషా సింగ్‌, మను బాకర్‌); 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ క్వాలిఫికేషన్‌, పతక పోరు (దివ్యాన్ష్‌, రమిత)- ఉ.6.30

హాకీ: పురుషుల మ్యాచ్‌ (భారత్‌ × సింగపూర్‌)- ఉ.6.30

ఫెన్సింగ్‌: మహిళల సాబర్‌ వ్యక్తిగత విభాగం (భవాని దేవి)- ఉ.6.30

బాక్సింగ్‌: సచిన్‌ × ఆస్రి ఉదీన్‌ (ఇండోనేసియా)- మ.12.30; నరేందర్‌ × నురాదిన్‌ (కిర్గిస్థాన్‌)- సా.6.15

చెస్‌: పురుషుల, మహిళల వ్యక్తిగత 5, 6, 7 రౌండ్లు (విదిత్‌, అర్జున్‌, హంపి, హారిక)- మ.12.30

వుషూ: పురుషుల 70 కేజీ క్వార్టర్స్‌ (సూరజ్‌ × ఖలీద్‌ (అఫ్గాన్‌)- సా.5

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని