Gambhir: వన్డే ప్రపంచకప్‌ ఈ ఏడాదే ఉంది.. ఐపీఎల్ కంటే భారత క్రికెటే ముఖ్యం: గంభీర్‌

ఐపీఎల్‌ (IPL) కంటే భారత క్రికెటే ముఖ్యమని టీమ్‌ఇండియా (Team India) మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. 

Published : 10 Jan 2023 01:21 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ టోర్నీ ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ మధ్య జరగనున్న నేపథ్యంలో టీమ్‌ఇండియాలోని ప్రధాన ఆటగాళ్లకు భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ కీలక సూచనలు చేశాడు. ఐపీఎల్ కంటే భారత క్రికెటే ముఖ్యమని పేర్కొంటూ వన్డే ప్రపంచకప్‌ కోసం సన్నద్ధం కావడానికి ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమైనా మంచిదే అని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ‘ఫ్రాంచైజీ ఇబ్బంది పడితేపడని. భారత క్రికెటే ముఖ్యం. ఐపీఎల్ కాదు. IPL అనేది ఉప ఉత్పత్తి. భారత్ ప్రపంచకప్ గెలిస్తే అది మనకు పెద్ద సంబరం. కాబట్టి, ఎవరైనా ప్రధాన ఆటగాడు ఐపీఎల్‌కు దూరమైతే కానివ్వండి. ఐపీఎల్‌ ప్రతి సంవత్సరం జరిగితే, ప్రపంచకప్‌ నాలుగేళ్లకోసారి జరుగుతుంది’ అని గంభీర్‌ అన్నాడు.

‘మూడు ఫార్మాట్లలో ఆడుతున్న క్రికెటర్లు విరామం కావాలనుకుంటే టీ20లకు దూరంగా ఉండాలి. కానీ, వన్డేలు తప్పకుండా ఆడాలి. గత రెండు ప్రపంచ కప్‌లలో భారత్‌ చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే..  జట్టు సభ్యులు కలిసి తగినంత క్రికెట్ ఆడకపోవడం. అప్పుడు తుది జట్టు కూర్పు సరిగా లేదు. దురదృష్టవశాత్తు గత టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే తప్పు జరిగింది’ అని గంభీర్‌ వివరించాడు. ఏప్రిల్‌, మే నెలల్లో ఐపీఎల్-15 సీజన్‌ జరగనున్న విషయం తెలిసిందే.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని