Team India: 551 కాయా? పండా?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు మరో నెల రోజులే ఉంది. సౌథాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడేందుకు కోహ్లీసేన...

Published : 20 May 2021 09:29 IST

సెంచరీ టెస్టుల్లో భారత్‌ సత్తా చూస్తారా  

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు మరో నెల రోజులే ఉంది. సౌథాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడేందుకు కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది. సుదీర్ఘ ఫార్మాట్లో రికార్డులెన్నో సృష్టించిన భారత్‌కు, అభిమానులకు ఇదో మధుర జ్ఞాపకంగా నిలిచిపోనుంది. ఎందుకంటే ఇది మనకు 551వ టెస్టు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఆడిన 100, 200, 300, 400, 500 మ్యాచుల్లో ఏమైందో నెమరువేసుకొందాం!


వందలో ఓటమి

టీమ్‌ఇండియా 1932, జూన్‌6న లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఆడింది. 158 పరుగుల తేడాతో ఓడింది. అదే ప్రత్యర్థితో ఎడ్జ్‌బాస్టన్‌లో వందో మ్యాచ్‌లో తలపడింది. బారింగ్టన్‌ (75), జాన్‌ ముర్రే (77) అర్ధశతకాలు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 298 పరుగులు చేసింది. భగవత్ చంద్రశేఖర్‌, ఎరపల్లి ప్రసన్న చెరో 3 వికెట్లు తీశారు. కానీ టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ 32.3 ఓవర్లకే 92కే ముగిసింది. ఫరూక్‌ ఇంజినీర్‌ (23) టాప్‌ స్కోరర్‌. రెండో ఇన్నింగ్స్‌లో ఆంగ్లేయులు 203 పరుగులు చేసి భారీ లక్ష్యం నిర్దేశించారు. చంద్రశేఖర్‌ 3, ప్రసన్న 4 వికెట్లు తీయడం గమనార్హం. రెండో ఇన్నింగ్స్‌లో అజిత్‌ వాడేకర్‌ (70), పటౌడీ జూనియర్‌ (47) పోరాడటంతో టీమ్‌ఇండియా 277 పరుగులు చేసినా.. 132 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.


పాక్‌తో డ్రా

1982, డిసెంబర్‌10న టీమ్‌ఇండియా 200వ మ్యాచ్‌ ఆడింది. ప్రత్యర్థి పాకిస్థాన్‌. వేదిక గడాఫీ స్టేడియం. జహీర్‌ అబ్బాస్‌ (215; 254 బంతుల్లో 23×4, 2×6)కు తోడుగా మొహిసన్‌ ఖాన్‌ (94) చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 485కు ఆలౌటైంది. దిలీప్ దోషి 5 వికెట్లతో విజృంభించాడు. తర్వాత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 379కి ఆలౌటైంది. మొహిందర్ అమర్‌నాథ్‌ (109*; 284 బంతుల్లో 15×4) అజేయ శతకం సాధించాడు. క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ (83), అరుణ్ లాల్‌ (51), సందీప్‌ పాటిల్‌ (68) కీలకంగా నిలిచారు. ఈ రెండు ఇన్నింగ్స్‌లకే నాలుగు రోజులకు పైగా పట్టింది. ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ 135/1తో నిలవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. మొహిసిన్‌ ఖాన్‌ (101) సెంచరీ కొట్టేశాడు.


శ్రీనాథ్, కుంబ్లే కేక

భారత 300వ టెస్టు ప్రత్యర్థి దక్షిణాఫ్రికా. 1996, నవంబర్‌ 20న అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ పోరులో టీమ్‌ఇండియా 64 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 99 ఓవర్లు ఆడిన ఆతిథ్య జట్టు 223కు ఆలౌటైంది. సచిన్‌ తెందూల్కర్‌ (42), సంజయ్‌ మంజ్రేకర్‌ (34), మహ్మద్‌ అజహరుద్దీన్‌ (35) టాప్‌ స్కోరర్లు. అలన్‌ డొనాల్డ్‌ 4 వికెట్లు తీశాడు. ఆ తర్వాత సునిల్‌ జోషి (4/43) దెబ్బకు సఫారీలు 244కు పరిమితం అయ్యారు. ఫానీ డివిలియర్స్‌ (67) అర్ధశతకం బాదాడు. పాల్‌ ఆడమ్స్‌, అలన్‌ డొనాల్డ్‌ చెరో 3 వికెట్లు తీయడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 190 పరుగులే చేసింది. వీవీఎస్‌ లక్ష్మణ్ (51) అర్ధశతకంతో రాణించాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో జవగళ్‌ శ్రీనాథ్‌ (11.5-4-21-6), అనిల్ కుంబ్లే (3/34) బంతితో చుక్కలు చూపించారు. దాంతో 38.5 ఓవర్లకు ప్రత్యర్థి జట్టు 105కే కుప్పకూలింది.  శ్రీనాథ్‌, కుంబ్లే ఆరుగురు బ్యాటర్లను డకౌట్‌గా పెవిలియన్‌ పంపించడం గమనార్హం.


విండీస్‌పై 3 రోజుల్లో..

2006, జూన్‌ 30న భారత్ 400వ మ్యాచ్‌ ఆడింది. వేదిక సబీనా పార్క్‌. ప్రత్యర్థి వెస్టిండీస్‌. 49 పరుగుల తేడాతో టీమ్‌ఇండియానే గెలిచింది. మిస్టర్‌ డిఫెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తన క్లాస్‌ను మరోసారి చూపించాడు. ద్రవిడ్‌ (81), కుంబ్లే (45) నిలవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 200 పరుగులు చేసింది. జెరోమ్‌ టేలర్‌ (5/50) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఆ తర్వాత హర్భజన్‌ సింగ్‌ (5/13) స్పిన్‌ దెబ్బకు విండీస్‌ 103కే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ద్రవిడ్‌ (68; 166 బంతుల్లో 12×4) అర్ధశతకం సాధించాడు. కోరె కాలీమోర్‌ (5/48), జెరోమ్‌ టేలర్‌ (4/45) దెబ్బకు వికెట్లు పడుతున్నాఒంటరి పోరాటం చేశాడు. దాంతో టీమ్‌ఇండియా 171 పరుగులు చేసింది. ఈ సారి కుంబ్లే (6), శ్రీనాథ్ (3) బంతితో చెలరేగడంతో విండీస్‌ 219కి పరిమితమైంది. రామ్‌నరేశ్ శర్వాన్‌ (51), దినేశ్‌ రామ్‌దిన్‌ (62*) టాప్‌ స్కోరర్లు.  మ్యాచు 3 రోజుల్లోనే ముగిసింది.


కివీస్‌పై మైలురాయి

టీమ్‌ఇండియా సుదీర్ఘ ఫార్మాట్‌ చరిత్రలో ఓ అరుదైన మైలురాయి 500 టెస్టు. కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో 2016, సెప్టెంబర్‌ 22న తలపడింది. 197 పరుగులతో గెలిచి విజయాన్ని చిరస్మరణీయంగా మలుచుకుంది. మురళీ విజయ్‌ (65), చెతేశ్వర్‌ పుజారా (62), అశ్విన్‌ (40), రవీంద్ర జడేజా (42*) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 318 పరుగులు చేసింది. ఆ తర్వాత జడ్డూ 5, యాష్ 4 వికెట్లతో చెలరేగడంతో కివీస్‌ 262 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్‌ (75), టామ్‌ లేథమ్‌ (58) అర్ధశతకాలు చేశారు.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన టాప్‌, మిడిలార్డర్‌ అద్భుతంగా రాణించింది. రాహుల్‌ (38), మురళీ విజయ్‌ (76), పుజారా (78), విరాట్‌ కోహ్లీ (18), రహానె (40), రోహిత్‌ శర్మ (68*), రవీంద్ర జడేజా (50*) దుమ్మురేపారు. 377/5 వద్ద భారత్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. కివీస్‌ నాలుగో రోజు ఆటను 93/4తో ముగించింది. 38తో ల్యూక్‌ రోంచి, 8తో శాంట్నర్‌ నిలిచారు. ఐదో రోజు రోంచి (80), శాంట్నర్‌ (71) శతకాల వైపు నడిచారు. కానీ అశ్విన్‌ (6) వారి ఆటలు సాగనివ్వలేదు. దాంతో కివీస్‌ 236కు ఆలౌటైంది. కోహ్లీసేన ఘన విజయం అందుకుంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని