‘జడేజా మా వాడు.. బాగా చూసుకోండి’: ధోనీకి మోదీ చెప్పిన వేళ..

ప్రధానమంత్రి నరేంద్రమోదీని తొలిసారి కలిసిన క్షణాలను క్రికెటర్‌ జడేజా గుర్తుచేసుకున్నాడు. అంతటి గొప్ప వ్యక్తి తన గురించి ప్రత్యేకంగా చెప్పడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నాడు.

Published : 22 Nov 2022 10:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి రీవాబా జడేజా పోటీ చేస్తున్నారు. భార్యకు మద్దతుగా జడ్డూ గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని తొలిసారి కలిసిన క్షణాలను గుర్తుచేసుకున్న జడేజా.. అప్పటి ఆసక్తికర సంభాషణను పంచుకున్నాడు. అప్పుడు గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీ.. తన గురించి ధోనీకి ప్రత్యేకంగా చెప్పారని జడేజా తెలిపాడు.

‘‘మోదీజీని నేను 2010లో తొలిసారి కలిశాను. అప్పుడు ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియం (ఇప్పుడు నరేంద్రమోదీ మైదానం)లో దక్షిణాఫ్రికాతో మా మ్యాచ్‌ జరిగింది. ఆ సందర్భంగా మా టీమంతా మోదీజీని కలిశాం. అప్పుడు మా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న మహీ భాయ్‌ (ధోనీ) మమ్మల్ని.. మోదీజీకి పరిచయం చేశారు. నా వంతు రాగానే.. మోదీ జీ వెంటనే స్పందిస్తూ.. ‘‘ఇతను మా వాడు(గుజరాత్‌ వ్యక్తి అనే ఉద్దేశంతో).. జాగ్రత్తగా చూసుకోండి’’ అని నవ్వుతూ చెప్పారు. అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి నా గురించి ప్రత్యేకంగా చెప్పినప్పుడు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మోదీజీ అలా చెప్పగానే నాకు చాలా సంతోషంగా అన్పించింది’’ అని జడేజా గుర్తుచేసుకున్నాడు. మోదీ నేతృత్వంలో గుజరాత్‌తో పాటు భారత్‌ ఎంతో అభివృద్ధి సాధిస్తోందని జడ్డూ ఈ సందర్భంగా కొనియాడారు. ఈ వీడియోను ‘మోదీ స్టోరీ’ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

జడేజా సతీమణి రీవాబా.. గుజరాత్‌లోని జామ్‌నగర్‌(ఉత్తర) నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో జడ్డూ కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారు. సోమవారం జడేజా దంపతులు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, జడేజా సోదరి నైనా.. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తుండటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని