Wriddhiman Saha : మరే ఆటగాడు బెదిరింపులకు గురి కాకూడదు : సాహాకు మద్దతుగా నిలిచిన ఐసీఏ

టీమిండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ (ఐసీఏ) మద్దతుగా నిలిచింది. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు సాహాను బెదిరిస్తూ ఓ పాత్రికేయుడు చేసిన..

Published : 22 Feb 2022 17:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమిండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ (ఐసీఏ) మద్దతుగా నిలిచింది. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు సాహాను బెదిరిస్తూ ఓ పాత్రికేయుడు చేసిన సందేశాన్ని ఖండించింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఐసీఏ స్వాగతించింది.

‘ఆటగాళ్ల ఎదుగుదలలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందనే వాస్తవాన్ని మేం అంగీకరిస్తున్నాం. కానీ, హద్దు దాటి వ్యవహరించకూడదు. సాహా విషయంలో జరిగింది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. సంబంధిత మీడియా యాజమాన్యం ఈ విషయంపై స్పందించి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాం’ అని ఐసీఏ అధ్యక్షుడు అశోక్‌ మల్హోత్రా పేర్కొన్నాడు.

‘వృద్దిమాన్‌ సాహాకు మేమంతా మద్దతు తెలుపుతున్నాం. మీడియా నుంచి మరే ఆటగాడు ఇలాంటి బెదిరింపులకు గురి కాకూడదు. ఈ విషయంలో మిగతా మీడియా సంస్థలు కూడా సాహాకు మద్దతుగా నిలవాలి. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలి. మీడియా, ఆటగాళ్ల మధ్య జరిగే ఏ సంభాషణ అయినా స్వచ్ఛందంగా ఉండాలి’ అని ఐసీఏ కార్యదర్శి హితేశ్ మజుందార్‌ అన్నారు. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు ఓ పాత్రికేయుడు సాహాను బెదిరిస్తూ సందేశం పంపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్‌ సింగ్‌ లాంటి పలువురు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని