INDW vs SAW: స్మృతి మంధాన సెంచరీ.. దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళా జట్టు 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Published : 16 Jun 2024 20:29 IST

బెంగళూరు: భారత అమ్మాయిలు అదరగొట్టారు.  చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్‌ సేన.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (117; 127 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) శతక్కొట్టింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో దక్షిణాఫ్రికా లక్ష్యఛేదనలో కనీస ప్రతిఘటన చేయకుండా 37.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. సునే లూస్ (33; 58 బంతుల్లో) టాప్‌ స్కోరర్‌. మారిజానే కాప్ (24), తజ్మిన్ బ్రిట్స్ (18), సినాలో జాఫ్తా (27*) పరుగులు చేశారు. ఆశా శోభన (4/21) అరంగేట్రంలోనే సత్తాచాటింది. దీప్తి శర్మ 2, రేణుకా సింగ్, పుజా వస్త్రాకర్‌, రాధా యాదవ్‌,  తలో వికెట్ పడగొట్టారు. 

భారత టాప్‌ ఆర్డర్‌లో స్మృతి మంధాన తప్ప మరెవరు భారీ స్కోరు చేయలేదు. షఫాలీ వర్మ (7), హేమలత (12), హర్మన్‌ప్రీత్‌ (10), జెమీమా రోడ్రిగ్స్‌ (17), రిచా ఘోష్‌ స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. దీంతో 99 పరుగులకే భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన మంధాన దీప్తి శర్మ (37), పుజా వస్త్రాకర్ (31)లతో కలిసి జట్టుకు భారీ స్కోరు అందించింది. 116 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్న స్మృతికి వన్డేల్లో ఇది ఆరో శతకం కాగా.. స్వదేశంలో మొదటిది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఆయబొంగ ఖాకా 3, మసాబాటా 2, అన్నరీ డెర్క్సెన్,  మ్లాబా, షాంగసే తలో వికెట్ పడగొట్టారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని