Side Shows: టిమ్‌ పైన్‌ను తిడుతున్నారట

భారత క్రికెట్‌ అభిమానులు తనను విమర్శిస్తున్నారని ఆసీస్‌ టెస్టు సారథి టిమ్‌పైన్‌ అన్నాడు....

Published : 15 May 2021 01:10 IST

ఫర్వాలేదన్న ఆసీస్‌ సారథి

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్‌ అభిమానులు తనను విమర్శిస్తున్నారని ఆసీస్‌ టెస్టు సారథి టిమ్‌పైన్‌ అన్నాడు. 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకొనే అర్హత టీమ్‌ఇండియాకు ఉందన్నాడు. ఉద్దేశపూర్వకంగా తానేమీ ఇబ్బందికర వ్యాఖ్యలు చేయలేదని వివరించాడు. ఆ ముఖాముఖిలో సవాళ్ల గురించి ప్రశ్నించారని తెలిపాడు. అందులో భాగంగా కొన్ని అంశాలు సవాల్‌గా మారాయని మాత్రమే అన్నానన్నాడు.

టీమ్‌ఇండియా చివరి సారి పర్యటించినప్పుడు తమను పక్కదారి పట్టించిందని టిమ్‌పైన్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆటేతర అంశాలతో దృష్టి మళ్లించడంతో తాము ఓటమి పాలయ్యామని చెప్పాడు. అందువల్లే తమ ఏకాగ్రత దెబ్బతిందని, బంతిపై దృష్టి సారించలేకపోయామని తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై అభిమానులు మండిపడుతున్నారు. పైన్‌ నిందలు వేస్తున్నాడని విమర్శించారు.

‘నన్ను చాలా ప్రశ్నలు అడిగారు. టీమ్‌ఇండియాతో ఆడినప్పుడు ఎదురైన సవాళ్ల గురించి అడిగారు. అందులో ఒకటి ఏకాగ్రత చెదరగొట్టిన అంశాలు. వారు బ్రిస్బేన్‌కు వెళ్లరన్నది ఒక వదంతి. తరచూ గ్లోవ్స్‌ మార్చడం, ఫిజియోలు రావడంతో ఏకాగ్రత పోయి బంతిపై దృష్టి సారించలేకపోయాం. అయితే టీమ్‌ఇండియా మమ్మల్ని చిత్తుగా ఓడించిందనీ చెప్పాను. విజయానికి వారు అర్హులని చెప్పాను. భారత అభిమానులు సోషల్‌ మీడియాలో నన్ను విమర్శిస్తున్నారు’ అని పైన్‌ అన్నాడు.

‘భారత అభిమానుల్ని నేను ప్రేమిస్తాను. చాలాసార్లు ప్రశంసించేందుకు నేను వెనుకాడను. నేను క్యాచులు వదిలేసినప్పుడు వారు చెలరేగారు. అందులో తప్పేం లేదనే అంటాను. అభిమానుల్లోని ప్రేమ, అనురాగాన్ని నేను ప్రేమిస్తాను. వారు సానుకూలంగా విమర్శిస్తే ఫర్వాలేదు. కానీ కొందరు నాపై వేలెత్తి చూపుతున్నారు. అయినా ఫర్వాలేదు’ అని పైన్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని