FIFA: ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం.. తాష్కెంట్‌లో చిక్కుకుపోయిన 23సభ్యుల మహిళల బృందం

ఉజ్బెకిస్థాన్‌ క్లబ్‌ సొగ్డియానా-డబ్లూతో తలపడేందుకు వెళ్లిన భారత మహిళల లీగ్‌ ఛాంపియన్‌ గోకులం కేరళ జట్టు నిషేధం కారణంగా తాష్కెంట్‌లో చిక్కుకుపోయింది.........

Published : 18 Aug 2022 02:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య(ఏఐఎఫ్‌ఎఫ్‌)పై నిషేధం విధిస్తూ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య(ఫిఫా) బాంబు వేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత ఫుట్‌బాల్‌ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై ఆడేందుకు వీల్లేకుండా పోయింది. అయితే ఈ నెల 23న ఉజ్బెకిస్థాన్‌ క్లబ్‌ సొగ్డియానా-డబ్ల్యూతో తలపడేందుకు వెళ్లిన భారత మహిళల లీగ్‌ ఛాంపియన్‌ గోకులం కేరళ జట్టు అక్కడే ఉండిపోయింది. నిషేధం కారణంగా ఈ జట్టు ఆ మ్యాచ్‌లో పాల్గొనే వీల్లేదు. దీంతో తమ పరిస్థితిపై తక్షణ జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని మోదీ, క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను ఆ జట్టు సభ్యులు ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.

గోకులం కేరళ ఎఫ్‌సికి చెందిన 23 మంది మహిళా జట్టు సభ్యులమంతా ఇప్పుడు తాష్కెంట్‌లో చిక్కుకుపోయామని, తమ భవితవ్యాన్ని తేల్చాలంటూ ట్విటర్‌లో ఓ లేఖ రాశారు. ప్రధాని మోదీ, ట్యాగ్‌ చేశారు. ‘మా జట్టు కోలికోడ్‌ నుంచి ఈనెల 16వ తేదీనే ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌కు చేరుకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఏఐఎఫ్‌ఎఫ్‌పై ఫిఫా నిషేధం విధించిన సంగతి తెలిసింది. ఈ నిషేధం కారణంగా ఈ మ్యాచ్‌లో మేం పాల్గొనేందుకు అనుమతి లేకుండా పోయింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఫిఫా నిషేధాన్ని ఉపసంహరించుకోవడానికి, ఏఎఫ్‌సీ ఉమెన్స్ క్లబ్ ఛాంపియన్‌షిప్‌లో మమ్మల్ని ఛాంపియన్ క్లబ్ ఆఫ్ ఇండియాగా చేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రధాని కార్యాలయ్యాన్ని అభ్యర్థిస్తున్నాము’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్యపై నిషేధం విధిస్తున్నట్లు ఫిఫా మంగళవారం ప్రకటించింది. అంతే కాకుండా ఈ ఏడాది అక్టోబర్‌ 11 నుంచి 30 వరకు స్వదేశంలో జరగాల్సిన అండర్‌-17 మహిళల ప్రపంచకప్‌ను ప్రస్తుతానికి భారత్‌లో నిర్వహించడం లేదని వెల్లడించింది. 85 ఏళ్ల చరిత్రలో ఏఐఎఫ్‌ఎఫ్‌పై నిషేధం పడడం ఇదే తొలిసారి. ఏఐఎఫ్‌ఎఫ్‌లో బయట వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది.

విచారించిన సుప్రీం.. జోక్యం చేసుకోవాలంటూ కేంద్రానికి సూచన

ఈ నిషేధానికి సంబంధించిన అంశాన్ని భారత ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌పై ఫిఫా విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు కృషి చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ సస్పెన్షన్‌పై ప్రభుత్వం ఇప్పటికే ఫిఫాతో చర్చలు జరిపిందని కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌  తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. భారత్‌లో అండర్‌-17 ప్రపంచ కప్‌ను నిర్వహించేందుకు, ఏఐఎఫ్‌ఎఫ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు కేంద్రం ప్రో యాక్టివ్ పాత్రను పోషించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రపంచకప్ భారత్‌లో జరిగితే అది దేశానికి మేలు చేస్తుందని అభిప్రాయపడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని