Kampala Blasts: కంపాలాలో పేలుళ్లు.. భారత పారా బ్యాడ్మింటన్ ప్లేయర్లు సురక్షితం

ఉగాండా పారా బాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో పాల్గొనడానికి ఆ దేశ రాజధాని కంపాలాకు చేరుకున్న భారత క్రీడాకారులు వరుస బాంబుల పేలుళ్లతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. 

Published : 16 Nov 2021 23:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఉగాండా పారా బాడ్మింటన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో పాల్గొనడానికి ఆ దేశ రాజధాని కంపాలాకు చేరుకున్న భారత క్రీడాకారులు వరుస బాంబుల పేలుళ్లతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈఘటనలో ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘‘మన క్రీడాకారులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, అంతా సురక్షితంగా ఉన్నట్లు’’ కోచ్‌ గౌరవ్‌ ఖన్నా తెలిపారు. టోర్నమెంట్‌ను పూర్తి చేసుకుని వస్తామని స్పష్టం చేశారు. క్రీడాకారులకు కేటాయించిన హోటల్‌కు కేవలం 100 మీటర్ల దూరంలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు చనిపోయినట్లు అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురు ఆత్మాహుతి దళ సభ్యులు తమని తాము పేల్చుకున్నట్లు అధికారులు తెలిపారు. పేలుళ్ల అనంతరం భయాందోళనకు గురైన ప్రజలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు.  

‘‘బ్యాడ్మింటన్ పోటీల కోసం స్టేడియం వెళ్లేందుకు బస్సు సిద్ధం అవుతున్న సమయంలో మాకు ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. మా హోటల్‌ ఎదురు వీధిలోనే జరిగినట్లు అనిపించింది. అదే క్రమంలో ఒకసారికంటే ఎక్కువమార్లు పేలుళ్లు జరిగాయి. వెంటనే మేమంతా హోటల్‌ గదికి వెళ్లిపోయాం. కొద్దిసేపు ఆటగాళ్లు భయపడ్డారు’’ అని కోచ్‌ గౌరవ్‌ ఖన్నా తెలిపారు. ప్రస్తుతం అందరం సురక్షితంగా ఉన్నట్లు, ఎలాంటి ఇబ్బంది లేదని కోచ్‌ తెలిపారు. పారా ఒలింపిక్‌ ఛాంపియన్‌ ప్రమోద్‌ భగత్, మనోజ్ సర్కార్, మానసి జోషి, సుకాంత్‌ కాదమ్‌ బృందం టోర్నమెంట్ కోసం కంపాలా వెళ్లింది. ‘‘ప్రతి ఒక్కరం సురక్షితంగా ఉన్నాం. ఎలాంటి ఒత్తిడి లేదు. ఇప్పుడు అంతా సాధారణ స్థితికి వచ్చేసింది. కాస్త దూరంలో జరిగింది. అయినా హోటల్‌ వద్ద ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని ప్రమోద్‌ భగత్‌ పేర్కొన్నాడు. ప్రమోద్‌ భగత్‌, సుకాంత్‌ కాదమ్‌ తొలి రోజు ఆట షెడ్యూల్‌ లేదు. ఘటన జరిగినప్పుడు వీరిద్దరూ హోటల్‌ గదిలోనే ఉన్నారు. 

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని