‘కోహ్లీ మాట దాటాలంటే ఆటగాళ్లకు భయం’

విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు కాస్త భయపడతారని, అదే రహానె సారథ్యంలో ప్రశాంతంగా ఆడతారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ లీ వ్యాఖ్యానించాడు...

Published : 02 Feb 2021 01:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విరాట్‌ కోహ్లీ అంటే టీమ్‌ఇండియా ఆటగాళ్లు కాస్త భయపడతారని, అదే రహానె సారథ్యంలో ప్రశాంతంగా ఆడతారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ లీ వ్యాఖ్యానించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్‌ 2-1 తేడాతో గెలుపొంది బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన లీ.. కోహ్లీ, రహానె కెప్టెన్సీలపై స్పందించాడు. 

‘టీమ్‌ఇండియాకు విరాట్‌ కోహ్లీ సరైన కెప్టెన్‌. నేను కూడా అది అంగీకరిస్తాను. క్రికెట్‌లో అతడు ఆల్‌టైమ్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. కానీ అతడంటే ఆటగాళ్లకు కాస్త భయమెక్కువ అని నేను అనుకుంటున్నా. అతడుంటే గీత దాటడానికి ఆటగాళ్లు భయపడతారు. జట్టులో అలాంటి క్రమశిక్షణ తీసుకొచ్చాడు. ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలని అంటాడు. మైదానంలో బాధ్యతగా ఉండాలని, క్యాచ్‌లు వదలకూడదని ఆశిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు భయపడుతున్నట్లు నాకనిపించింది. అదే రహానె కెప్టెన్సీలో ఎలాంటి ఒత్తిడీ లేకుండా, ప్రశాంతంగా ఆడినట్లు అనిపించింది’ అని షేన్‌ లీ వివరించాడు.

కోహ్లీ కెప్టెన్సీని వదులుకోడని లీ అభిప్రాయపడ్డాడు. తాను టీమ్‌ఇండియా సెలెక్టర్‌గా ఉంటే రహానెను కెప్టెన్‌గా ఎంచుకుంటానని అన్నాడు. అప్పుడు కోహ్లీ బ్యాటింగ్‌ మీదే దృష్టిసారించేలా చూస్తానన్నాడు. అలా జరిగితే టీమ్‌ఇండియా ఇంకా బాగా ఆడుతుందని బ్రెట్‌ లీ సోదరుడు ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ నెల 5 నుంచి చెన్నైలో ఇంగ్లాండ్‌తో తలపడే టెస్టు సిరీస్‌కు కోహ్లీ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆటగాళ్లంతా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. రేపటి నుంచి మూడు రోజుల ప్రాక్టీస్‌ మొదలుపెట్టనున్నారు. 

ఇవీ చదవండి..
దేశం గర్వపడేలా చేయడానికి నిరంతరం కృషిచేస్తాం
ఆలస్యంగా వస్తానన్నాడు.. తీసేశారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు