Team India: డబ్ల్యూటీసీ ఫైనల్‌.. అప్పటికి ఆటగాళ్లు సిద్ధం: భారత కోచింగ్‌ సిబ్బంది

టీమ్ఇండియా ఆటగాళ్లు టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final 2023) కోసం రంగంలోకి దిగారు. ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ మార్గదర్శకంలో కోచింగ్‌ సిబ్బంది సహకారంతో సాధన మొదలు పెట్టారు.

Published : 01 Jun 2023 23:13 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final 2023) ఫైనల్‌ కోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టారు. ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు. బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్‌ రాఠోడ్‌ ఆధ్వర్యంలో బ్యాటర్లు, బౌలింగ్‌ కోచ్  పరాస్‌ మాంబ్రే ఆధ్వర్యంలో బౌలర్లు విపరీతంగా శ్రమించారు. అందరితో ఫీల్డింగ్‌ కోచ్ దిలీప్ క్యాచ్‌లను ప్రాక్టీస్‌ చేయించారు. సీనియర్‌ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారాతోపాటు అక్షర్ పటేల్‌, గిల్ బ్యాటింగ్ సాధన చేశారు. దీనింతటిని ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షిస్తూ కీలక సూచనలు చేశాడు. ఈ సందర్భంగా కోచింగ్‌ సిబ్బంది పరాస్ మాంబ్రే, విక్రమ్, దిలీప్‌ మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

‘‘ప్రాక్టీస్ సెషన్ అద్భుతంగా జరుగుతోంది. ఐపీఎల్‌ ఆడి వచ్చిన తర్వాత ఇప్పుడే సాధన చేస్తుండటంతో ఆరంభంలో కాస్త ఇబ్బంది ఉండేది. గత రెండు సెషన్లు మాత్రం చాలా బాగా జరిగింది. టెస్టు ఫార్మాట్‌కు కనెక్టివిటీ కుదురుతోంది. వాతావరణం కూడా మరీ ఎక్కువ ఎండ లేకుండా, హాయిగానే ఉంది. ఇంకా కొన్ని సెషన్లు ఉంటాయి. అప్పటికి బౌలర్లు టెస్టు మోడ్‌లోకి వస్తారు’’ - పరాస్ మాంబ్రే

‘‘ఐపీఎల్‌ నుంచి వచ్చిన ఆటగాళ్లకు క్యాచ్‌లు, ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ పెద్దగా అవసరం లేదు. టెస్టులో బ్యాటర్‌కు దగ్గరగా ఫీల్డింగ్‌ చేయాల్సి ఉంటుంది. క్లోజప్‌ క్యాచ్‌లను పట్టుకోవాలి. కాబట్టి, అలాంటి క్యాచ్‌లను ప్రాక్టీస్‌ చేయించాం. స్లిప్‌, ఫ్లాట్‌ క్యాచ్‌లను ఎలా పట్టాలనే దానిపై మరింత సాధన చేశారు’’ - దిలీప్

‘‘గత రెండు నెలల నుంచి చాలా క్రికెట్‌ ఆడారు. మెగా లీగ్‌ ఆడి ఇక్కడి వచ్చారు. ఎప్పటిలోగా టీ20 ఆట నుంచి టెస్టు ఫార్మాట్‌లోకి మారతారనేది వేచి చూడాలి. రెడ్‌ బాల్‌తో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అన్ని సెషన్లు ముగిసి టెస్టు మ్యాచ్‌ సమయానికి తప్పకుండా ఆటగాళ్లు పుంజుకొంటారు’’ - విక్రమ్ రాఠోడ్‌

యశస్వికి కోహ్లీ బ్యాటింగ్‌ పాఠాలు!

ఐపీఎల్‌లో తమ మ్యాచ్‌ ముగియగానే ఇంగ్లాండ్‌కు చేరిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ కఠినంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అదరగొట్టిన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు కోహ్లీ చిట్కాలు చెప్పాడు. పరాస్ మాంబ్రే, విక్రమ్ రాఠోడ్, రవిచంద్రన్ అశ్విన్‌ సమక్షంలో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. అనంతరం విరాట్‌తో కొన్ని సూచనలు చేశాడు. ఆ వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ వివాహం నేపథ్యంలో అతడి గైర్హాజరీలో యశస్వికి పిలుపొచ్చింది.

ఐపీఎల్‌లోనూ డ్యూక్‌ బంతితో ప్రాక్టీస్: అక్షర్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో (IPL)నూ భారత ఆటగాళ్లం ప్రాక్టీస్‌ సందర్భంగానూ డ్యూక్‌ బంతులను వాడినట్లు అక్షర్‌ పటేల్ తెలిపాడు. తెల్ల బంతి క్రికెట్‌ నుంచి రెడ్‌బాల్‌కు మానసికంగా మారాలంటే కాస్త సమయం పడుతుందని, అయినా సిద్ధంగా ఉన్నట్లు అక్షర్ స్పష్టం చేశాడు. మెగా లీగ్‌లో ఆడినప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి చర్చిస్తూనే ఉన్నామని తెలిపాడు. Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని