నర్వస్‌ నైంటీస్‌.. ఎవరెన్నిసార్లు ఔటయ్యారు?

క్రికెట్‌లో ఏ ఫార్మాటైనా బ్యాట్స్‌మెన్‌ శతకం సాధిస్తే ఆ అనుభూతే వేరు. అది ఆ ఆటగాడికే కాకుండా అభిమానులకూ సంతోషాన్ని కలిగిస్తుంది. సెంచరీ అంటే అంత విలువ మరి..

Published : 25 Mar 2021 19:44 IST

సచిన్‌ తర్వాత దాదాయే..

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో ఏ ఫార్మాటైనా బ్యాట్స్‌మెన్‌ శతకం సాధిస్తే ఆ అనుభూతే వేరు. అది ఆ ఆటగాడికే కాకుండా అభిమానులకూ సంతోషాన్ని కలిగిస్తుంది. సెంచరీ అంటే అంత విలువ మరి. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి ఎంతో మంది బ్యాట్స్‌మెన్‌ ఎన్నో శతకాలు సాధించారు. ఈ క్రమంలోనే పలువురు ఆటగాళ్లు పలుమార్లు 90ల్లో ఔటయ్యారు. దాన్నే నర్వస్‌ నైంటీస్‌ అంటారు. టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌లో అత్యధిక సార్లు ఇలా 90ల్లో ఔటైన ఆటగాళ్లు కొంత మంది ఉన్నారు. వారు ఎవరో ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

తెందూల్కర్‌ నంబర్‌ వన్‌..

ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు సచిన్‌ తెందూల్కర్‌ను మించిన బ్యాట్స్‌మెన్‌ లేడు. మొదట మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా కెరీర్‌ ప్రారంభించిన అతడు తర్వాత ఓపెనర్‌ అవతారమెత్తాడు. దాంతో మైదానాల్లో పరుగుల వరద పారింది. బౌండరీలు చిన్నబోయాయి. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మొత్తం 100 అంతర్జాతీయ శతకాలు బాదాడు. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో అందరికన్నా అత్యధికంగా 17 సార్లు 90ల్లో ఔటయ్యాడు. ఇక టెస్టుల్లో 10 సార్లు ఇలానే పెవిలియన్‌ చేరాడు.

తర్వాతి స్థానం దాదాదే..

టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ తన కెరీర్‌లో మొత్తంలో 22 వన్డే శతకాలు సాధించాడు. తన నాయకత్వంతో టీమ్‌ఇండియాను సరికొత్త బాటలో నడిపించిన దాదా వన్డే క్రికెట్‌లో సచిన్‌ తర్వాత అత్యధిక సార్లు 90ల్లో ఔటైన ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా ప్రిన్స్‌ మొత్తం 6 సార్లు నర్వస్‌ నైంటీస్‌లో పెవిలియన్‌ బాటపట్టాడు. అలాగే టెస్టు కెరీర్‌లో మరో రెండు సార్లు 90ల్లో ఔటయ్యాడు.  

సెహ్వాగ్‌, ధావన్‌, కోహ్లీ..

ఇక మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌, ప్రస్తుత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌తో పాటు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సైతం వన్డేల్లో అత్యధికంగా ఇప్పటివరకు 5సార్లు 90ల్లో ఔటయ్యారు. మరోవైపు టెస్టుల్లో సెహ్వాగ్‌ ఒకసారి ఇలా ఔటవ్వగా.. ధావన్‌, కోహ్లీ రెండుసార్లు సుదీర్ఘ ఫార్మాట్‌లో నర్వస్‌ నైంటీస్‌లో ఔటయ్యారు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ధావన్‌ 98 పరుగుల వద్ద ఔటైన సంగతి తెలిసిందే. 

రోహిత్‌, అజహరుద్దీన్‌..

టీమ్‌ఇండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ వన్డేల్లో మూడుసార్లు 90ల్లోనే పెవిలియన్‌ చేరారు. మరోవైపు అజహర్‌ టెస్టుల్లో ఒకసారి ఇలాగే ఔటవ్వగా, రోహిత్‌ ఇక్కడ ఒక్కసారి కూడా అలా ఔటవ్వలేదు. ఇక మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ వన్డేల్లో మూడు సార్లు, టెస్టుల్లో ఐదు సార్లు శతకాల ముందు ఔటయ్యాడు.

టీ20ల్లో ఎవరంటే..

ఇక టీ20 ఫార్మాట్‌లో 90ల్లో ఔటైన ఆటగాళ్లలో శిఖర్‌ ధావన్‌ ఒకసారి, రోహిత్‌ శర్మ ఒకసారి శతకం చేజార్చుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని