Womens Cricket : మూడుసార్లు ఆతిథ్యం.. రెండుసార్లు ఫైనల్‌కు... ఒక్క కప్పూ దక్కకపాయె!

పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళా క్రికెట్‌కు ఆదరణ, ఆదాయం తక్కువే. అయితే గత కొంతకాలంగా...

Updated : 05 Mar 2022 19:48 IST

మహిళల వన్డే ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌ పరిస్థితి ఇదీ..

ఇంటర్నెట్ డెస్క్‌: పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళా క్రికెట్‌కు ఆదరణ, ఆదాయం తక్కువే. అయితే గత కొంతకాలంగా ఉమెన్స్‌ క్రికెట్‌కూ ప్రేక్షకుల అభిమానం పెరుగుతోంది. దాదాపు యాభై ఏళ్ల కిందట 1973లో తొలిసారి మహిళల కోసం ప్రపంచకప్‌ పోటీలు జరిగాయి. అయితే అప్పుడు వాటిని వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌గా పిలిచేవారు. తర్వాత ప్రపంచకప్‌గా నామకరణం చేశారు. ఇప్పుడు మరోసారి న్యూజిలాండ్‌ వేదికగా ప్రపంచకప్‌ పోటీలు ప్రారంభం అయ్యాయి. అసలు ఇప్పటి వరకు ఎన్ని టైటిళ్లు జరిగాయి.. ఏ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది.. అలానే మన టీమ్‌ఇండియా పరిస్థితేంటో తెలుసుకుందాం.. 

1973 నుంచి 2005 వరకు అంతర్జాతీయ మహిళల క్రికెట్‌ మండలి (ఐడబ్ల్యూసీసీ) ప్రపంచకప్‌ పోటీలను నిర్వహించింది. 2005లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో ఐడబ్ల్యూసీసీ విలీనం జరిగింది. ఇక అప్పటి నుంచి ఐసీసీనే వరల్డ్‌ కప్‌ నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. సాధారణంగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరగాలి. అయితే కొన్ని దేశాలు తమ జట్లను పంపకపోవడం, నిధులకు సంబంధించి ఇబ్బందులతో ఒక్కోసారి ఆరు, ఏడు సంవత్సరాలకూ నిర్వహించిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పటివరకు 11 ప్రపంచకప్‌లు మాత్రమే జరిగాయి. ఇందులోనూ ఆస్ట్రేలియానే ఆధిపత్యం ప్రదర్శించింది. అన్ని జట్ల కంటే ఆసీస్‌ ఆరుసార్లు కప్‌ను దక్కించుకుంది. తర్వాత ఇంగ్లాండ్‌ 4, న్యూజిలాండ్‌ ఒకసారి కప్‌ను సొంతం చేసుకున్నాయి. మార్చి 4 (శుక్రవారం) నుంచి న్యూజిలాండ్‌ వేదికగా పన్నెండో ప్రపంచకప్‌ మొదలైంది. 

టీమ్‌ఇండియా పరిస్థితి ఇదీ.. 

పురుషుల వన్డే ప్రపంచకప్‌ను రెండుసార్లు ముద్దాడిన భారత్‌కు.. మహిళల వరల్డ్‌ కప్‌ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. మూడుసార్లు (1978, 1997, 2013) టీమ్‌ఇండియా ఆతిథ్యం ఇవ్వగా ఒక్క టైటిల్‌ను నెగ్గలేకపోవడం గమనార్హం. రెండు సార్లు (2005, 2017) మాత్రం టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ ఓటమిపాలైంది. దీంతో కప్‌ నెగ్గాలనే కోరిక అలానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు తొమ్మిది ప్రపంచకప్‌లను ఆడిన మహిళల జట్టు రెండు సార్లు ఫైనల్‌కు, రెండు మార్లు సెమీస్‌కు చేరుకుంది. మిగిలిన అన్ని ప్రపంచకప్‌ పోటీల్లో గ్రూప్‌ స్టేజ్‌కే పరిమితమైంది. 

ఈసారైనా కప్‌ నెగ్గేనా..?

భారత నారీమణులు ఈసారైనా కప్‌ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. వన్డే ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న టీమ్‌ఇండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌లోనే ఉంది. కివీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో భారత్‌ చేజార్చుకుంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన టీమ్‌ఇండియా ఆఖరి మ్యాచ్‌లో మాత్రం అద్భుత విజయం సాధించి.. ప్రపంచకప్‌నకు ముందు కాస్త ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. అయితే బౌలర్లు, బ్యాటర్ల నిలకడలేమి ప్రదర్శనతో ఇబ్బంది పడుతోంది. బౌలింగ్‌లో విభిన్న కూర్పులను ప్రయత్నిస్తున్నట్లు కెప్టెన్‌ మిథాలీరాజ్‌ చెప్పింది. అలానే బౌలింగ్‌ దాడి కాస్త ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మార్చి 6న టీమ్ఇండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. మరి మెగా టోర్నీలో కుదురుకుని ఎలా ఆడుతుందో వేచి చూడాల్సిందే. 

టీమ్‌ఇండియా మహిళల జట్టు: 

మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), హర్మన్ ప్రీత్ కౌర్‌ (వైస్‌ కెప్టెన్‌), స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్‌), స్నేహ్ రానా, జులన్‌ గోస్వామి, జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘ్న సింగ్, రేణుక సింగ్ ఠాకూర్‌, తానియా భాటియా (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్‌ యాదవ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని