INDW vs WIW: వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం.. ప్రపంచకప్‌లో రెండో గెలుపు

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన పోరులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్...

Updated : 12 Mar 2022 14:51 IST

 (Photo: BCCI Womens Twitter)

హామిల్టన్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన పోరులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్‌ జట్టు 162 పరుగులకే ఆలౌటైంది. దీంతో మిథాలీ టీమ్‌ ప్రపంచకప్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన (123; 119 బంతుల్లో 13x4, 2x6), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (109; 107 బంతుల్లో 10x4, 2x6) శతకాలతో రాణించారు. మిగతావారు పెద్దగా రాణించలేదు. అనంతరం ఛేదనకు దిగిన వెస్టిండీస్‌ తొలుత దూకుడుగా ఆడినా తర్వాత చేతులెత్తేసింది.

భారీ ఛేదనలో ఆ జట్టు ఓపెనర్లు డియాండ్రా డాటిన్‌ (62; 46 బంతుల్లో 10x4, 1x6), హేలీ మ్యాథ్యూస్‌ (43; 36 బంతుల్లో 6x4) ధాటిగా ఆడారు. బౌండరీలే లక్ష్యంగా దంచికొట్టారు. దీంతో విండీస్‌ 12 ఓవర్లకే 100 పరుగులు సాధించి శుభారంభం చేసింది. ఇక వీరిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో భారత బౌలర్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఓపెనర్లతో పాటు మిగతా బ్యాటర్లను వరుసగా పెవిలియన్‌ పంపారు. దీంతో 100/1తో ఒకానొక దశలో పటిష్ఠస్థితిలో నిలిచి లక్ష్యం వైపు దూసుకుపోతున్న విండీస్‌ను టీమ్‌ఇండియా బౌలర్లు కట్టడి చేశారు. మధ్యలో షెమేన్‌ క్యాంప్‌బెల్లె (11), చెడియాన్‌ నేషన్‌ (19) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా.. చివరికి ఆ జట్టు 162 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమ్‌ఇండియా 155 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో స్నేహ్‌రాణా 3, మేఘ్నా సింగ్‌ రెండు వికెట్లు తీయగా రాజేశ్వరి, పుజూ వస్త్రాకర్‌, ఝులన్‌ గోస్వామి తలో వికెట్‌ తీశారు. కాగా, శతకాలతో అదరగొట్టిన హర్మన్‌ప్రీత్‌, స్మృతి మంధాన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డును పంచుకున్నారు.

మరోవైపు టీమ్‌ఇండియా సారథి మిథాలీ రాజ్‌ ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ చేయడం ద్వారా కొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ సారథి బెలిండా క్లార్క్‌ (23)ను మిథాలీ (24) అధిగమించింది. మరోవైపు టీమ్‌ఇండియా సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఝులన్‌ గోస్వామి ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీయడం ద్వారా వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు (40) తీసిన బౌలర్‌గా కొత్త రికార్డు నెలకొల్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని