Thomas cup: టెన్నిస్‌కు డేవిస్‌.. బ్యాడ్మింటన్‌కు థామస్‌..

బాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ ‘థామస్‌ కప్‌’లో భారత్‌ సత్తా చాటింది. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారిగా కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘థామస్‌ కప్‌’ టోర్నమెంట్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. 

Published : 16 May 2022 01:50 IST

థామస్‌ కప్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ ‘థామస్‌ కప్‌’లో భారత్‌ సత్తా చాటింది. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారిగా కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘థామస్‌ కప్‌’ టోర్నమెంట్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. 

🏸 థామస్‌ కప్‌ టోర్నీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన జార్జ్‌ అలన్‌ థామస్‌ది. ఇంగ్లాండ్‌కు చెందిన థామస్‌.. 1900ల్లో గొప్ప బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు. బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ సహ వ్యవస్థాపకుడు.

🏸 టెన్నిస్‌లో డేవిస్‌ కప్‌.. ఫుట్‌బాల్‌లో వరల్డ్‌ కప్‌ ఉన్నట్లే బ్యాడ్మింటన్‌లోనూ ఓ ప్రపంచస్థాయి టోర్నమెంట్‌ ఉండాలని థామస్‌ భావించారు. ఈ మేరకు ‘థామస్‌ కప్‌’టోర్నీకి ప్రణాళిక రచించారు. థామస్‌ కప్‌నే ‘వరల్డ్స్‌ మెన్స్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌’అని కూడా పిలుస్తుంటారు. 

🏸 1941లోనే ఈ టోర్నీ నిర్వహించాలని ప్రయత్నించినా...రెండో ప్రపంచయుద్ధం కారణంగా వీలుపడలేదు. దీంతో 1948-49లో తొలి ‘థామస్‌ కప్‌’ టోర్నీని ఇంగ్లాండ్‌లో నిర్వహించారు. 

🏸 ఇందులో ఆసియన్‌, ఆస్ట్రేలియన్‌, పాన్‌-అమెరికన్‌, యూరోపియన్‌ ఇలా నాలుగు కేటగిరీల్లో మూడు క్వాలిఫైయింగ్‌ జోన్స్‌గా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆఫ్రికన్‌, ఓషియనియన్‌ కేటగిరీలు వచ్చి చేరాయి. 

🏸 మూడేళ్లకోసారి జరిగే ఈ టోర్నీలో క్రీడాకారులు బెస్ట్‌ ఆఫ్ నైన్‌ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చేది. ఐదు సింగిల్స్‌ విభాగంలో.. నాలుగు డబుల్స్‌ విభాగంలో మ్యాచ్‌లు ఆడాలి. ఎవరైతే ఎక్కువ మ్యాచ్‌లు గెలుస్తారో వారే విజేతగా నిలిచేవారు. అలా తొలి ‘థామస్‌ కప్‌’ను మలేషియా గెలుచుకుంది.  

🏸 1984 నుంచి ఈ టోర్నీ రెండేళ్లకొకసారి జరుగుతోంది. అలాగే.. బెస్ట్‌ ఆఫ్‌ నైన్‌ కాకుండా బెస్ట్‌ ఆఫ్‌ ఫైవ్‌ ఫార్మాట్‌లో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. రెండు డబుల్స్‌, మూడు సింగిల్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.

🏸 తొలి మూడు సార్లు ‘థామస్‌ కప్‌’ను మలేషియానే గెలుచుకుంది. 1957 నుంచి దాదాపు దశాబ్దకాలం కప్‌ను ఇండోనేషియానే కైవసం చేసుకుంది.

🏸 ఇప్పటి వరకు జరిగిన ఈ టోర్నీలో డెన్మార్క్‌(2014) మినహా ఆసియేతర దేశాల్లో ఏ ఒక్కటీ ఈ కప్‌ను గెలవకపోవడం గమనార్హం.

🏸 ఇండోనేషియా అత్యధికంగా 14 సార్లు ఈ కప్‌ గెలవగా.. చైనా 10 సార్లు, మలేషియా నాలుగుసార్లు విజేతగా నిలిచాయి. 

🏸 2014లో దిల్లీ వేదికగా జరిగిన ఈ అంతర్జాతీయ మెగా టోర్నీలో జపాన్‌ తొలిసారి కప్‌ను దక్కించుకుంది.

🏸 భారత్‌ విషయానికొస్తే.. 1952లో తొలిసారి ‘థామస్‌ కప్‌’లో పోటీ పడింది. రెండు సార్లు ఫైనల్‌ రౌండ్‌ వరకు వెళ్లింది. మూడుసార్లు క్వార్టర్‌ ఫైనల్స్‌.. ఓసారి సెమీఫైనల్‌ వరకు వచ్చి వెనుదిరిగింది. 

🏸 తాజాగా థాయ్‌లాండ్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మొదటిసారి భారత్‌ కప్ గెలిచి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. 

🏸 ప్రపంచంలోని అన్నీ దేశాలు ఈ టోర్నీలో క్వాలిఫై అయి ఫైనల్‌ స్టేజ్‌కి చేరుకునేందుకు తాపత్రయపడుతుంటాయి. కానీ, కొన్ని దేశాలే ఫైనల్‌ స్టేజ్‌కు చేరుకుంటాయి. 

🏸 1984 నుంచి 2002 వరకు ఫైనల్‌ స్టేజ్‌లో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించేవారు. ఆ తర్వాత వీటి సంఖ్య పెరుగుతూ వస్తోంది.

🏸 తాజా టోర్నమెంట్‌లో మొత్తం 29 దేశాలు పోటీ పడగా.. 16 దేశాలు క్వాలిఫై అయ్యాయి. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించించి.. పోటీలు నిర్వహించారు. 

🏸 ఫైనల్‌ మ్యాచ్‌లో 14 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాతో భారత్‌ తలపడి విజయకేతనం ఎగరవేసింది. థామస్‌ కప్‌ను తొలిసారి ముద్దాడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని