BBL: సిడ్నీ థండర్స్‌ 15కే ఆలౌట్‌.. ఇదేం ఆటంటూ నెటిజన్లు ఫైర్‌

టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును సిడ్నీ థండర్స్‌ తన ఖాతాలో వేసుకొంది. కేవలం 15 పరుగులకే ఆలౌటై సంచలనం సృష్టించింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు, విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.

Published : 17 Dec 2022 15:22 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతం జరిగింది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన సిడ్నీ థండర్స్‌.. కేవలం 15 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకొంది. దీంతో మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. అలెక్స్ హేల్స్‌, రిసోవ్‌ వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నప్పటికీ కుప్పకూలడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హెన్రీ థామ్‌టన్ (5/3), వేస్ అగర్ (4/6), మ్యాథ్యూ షార్ట్ (1/5) దెబ్బకు సిడ్నీ ఘోర పరాభవం ఎదుర్కొంది.

‘కళ్లు నులుముకొనే లోపే మ్యాచ్‌ అయిపోయింది’ అంటూ ఓ వ్యక్తి వ్యంగ్యంగా కామెంట్‌ రాయగా.. ‘హమ్మయ్య!.. భారత టీ20 లీగ్‌లో బెంగళూరు జట్టు రికార్డు కనుమరుగైంది. కోల్‌కతాపై కేవలం 49 పరుగులకే అప్పట్లో బెంగళూరు ఆలౌట్‌ కాగా.. ఇప్పుడు సిడ్నీ థండర్స్‌ 15కే కుప్పకూలడం విశేషం’.. అంటూ అభిమానులు నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు.

‘‘15 పరుగులు.. అడిలైడ్‌ బౌలర్లు అద్భుతం చేశారు. నిజం చెప్పాలంటే నాకు మాటలు రావడం లేదు. అడిలైడ్ స్ట్రైకర్స్‌ పరిస్థితి కూడా ఇలానే ఉంటుందేమో. ఇప్పటి వరకు నా క్రికెట్ జీవితంలో ఇలాంటి మ్యాచ్‌ను చూడలేదు’’ - బ్రెట్‌ లీ, ఆసీస్‌ మాజీ పేసర్

‘‘కేవలం 35 బంతుల్లోనే మ్యాచ్‌ ముగిసింది. 15 పరుగులకు ఆలౌట్‌ కావడం దారుణం. థండర్స్‌ కోచ్‌ ట్రావెర్ బేలిస్‌ అద్భుతమైన కోచ్. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మ్యాచ్‌ ఫలితం గురించి మరిచిపోయి మిగతా టోర్నీపై దృష్టిసారించాలి’’ - బ్రాడ్ హడిన్, ఆసీస్‌ మాజీ స్పిన్నర్

‘‘మాకే ఆశ్చర్యంగా అనిపించింది. చాలా త్వరగా జరిగిపోయింది. ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. రషీద్‌ ఖాన్‌ చాలా టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఈసారి అతడితోపాటు నేను కూడా ఒక్క బంతి కూడా బౌలింగ్‌ చేయకపోవడం గమనార్హం. కేవలం ముగ్గురే సిడ్నీ థండర్స్‌ను కుప్పకూల్చారు’’ - పీటర్ సిడిల్, అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ కెప్టెన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని