icc mens t20 world cup: చిన్నోళ్లు దమ్మున్నోళ్లు

ఎవరైనా ఊహించారా.. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను వెనక్కినెట్టి అమెరికా సూపర్‌- 8కు చేరుతుందని! ఎవరైనా అనుకున్నారా.. ప్రపంచకప్‌ల్లో అత్యంత నిలకడగా ఆడే న్యూజిలాండ్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమిస్తుందని! కానీ ఇవి జరిగాయి.

Updated : 16 Jun 2024 06:55 IST

ఎవరైనా ఊహించారా.. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను వెనక్కినెట్టి అమెరికా సూపర్‌- 8కు చేరుతుందని! ఎవరైనా అనుకున్నారా.. ప్రపంచకప్‌ల్లో అత్యంత నిలకడగా ఆడే న్యూజిలాండ్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమిస్తుందని! కానీ ఇవి జరిగాయి. అందుకు కారణం పొట్టి కప్‌లో చిన్న జట్ల సంచలన ప్రదర్శనే. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే తపనతో.. తమ సత్తాను ప్రపంచానికి చాటాలనే లక్ష్యంతో.. పసికూనలు అదరగొడుతున్నాయి. అనూహ్య ఫలితాలు సాధిస్తున్నాయి.  

ఈనాడు క్రీడావిభాగం

మెరికా, వెస్టిండీస్‌ ఆతిథ్యమిస్తున్న  ఈ టీ20 ప్రపంచకప్‌ రసవత్తరంగా సాగుతోంది. భారీ స్కోర్లు నమోదు కాలేకపోతున్నా ఉత్కంఠకు, నాటకీయతకు కొదవేం లేదు. సంచలనాలూ తక్కువేం కాదు. టోర్నీని తొలిసారి 20 దేశాలతో నిర్వహిస్తుండటంతో ప్రతి చిన్న జట్టూ తమదైన ముద్ర వేయాలనే సంకల్పాన్ని ప్రదర్శిస్తున్నాయి. వీటి దెబ్బకు ప్రతి గ్రూప్‌లోనూ ఓ పెద్ద జట్టు కష్టాల్లో పడింది. అమెరికా ఇచ్చిన షాక్‌తో గ్రూప్‌- ఎ నుంచి పాకిస్థాన్‌ నిష్క్రమించింది. స్కాట్లాండ్‌ మెరుగైన ప్రదర్శన కారణంగా గ్రూప్‌- బి నుంచి ముందంజ వేయడం ఇంగ్లాండ్‌కు కష్టంగా మారింది. అఫ్గానిస్థాన్‌ చేతిలో అనూహ్య పరాజయంతో గ్రూప్‌- సిలో న్యూజిలాండ్‌ పనైపోయింది. ఇక గ్రూప్‌- డిలో శ్రీలంక ఇంటి ముఖం పట్టింది. 

అదే అనూహ్యం: అమెరికా అసలు టీ20 ప్రపంచకప్‌లో ఆడటమే అనూహ్యం. గత ఎనిమిది పొట్టికప్‌ల్లో ఒక్కసారి కూడా ఆ జట్టు ప్రాతినిథ్యం లేదు. ఆతిథ్య హోదాలో తొలిసారి ఈ మెగా టోర్నీలో ఆడుతోంది. కప్‌లో అడుగుపెట్టినా ఆ జట్టు ఒక్క విజయం సాధిస్తేనే చాలు అన్నట్లు చూశారు. కానీ టోర్నీ ఆరంభానికి ముందు కెనడా, బంగ్లాదేశ్‌పై సిరీస్‌ విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో బరిలో దిగిన అమెరికా అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో కెనడాను కంగుతినిపించిన ఆ జట్టు.. రెండో మ్యాచ్‌లో పటిష్ఠమైన పాకిస్థాన్‌ను సూపర్‌ ఓవర్లో మట్టికరిపించడం చరిత్రాత్మకమే. టీమ్‌ఇండియాను కూడా అమెరికా కంగారు పెట్టింది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ వర్షంతో రద్దవడంతో యుఎస్‌ ముందంజ వేసింది. ఇక సంచలన విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకున్న అఫ్గానిస్థాన్‌ చిన్న జట్టు అనే ముద్రను చెరిపేసుకునే దిశగా సాగుతోంది. నిరుడు వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంకపై గెలిచిన ఆ జట్టు.. ఈ పొట్టికప్‌లో కివీస్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ గెలుపుతో అఫ్గాన్‌ ముందంజ వేయగా.. ప్రపంచకప్‌లో నిలకడగా రాణిస్తుందనే పేరున్న కివీస్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. కెనడా, నెదర్లాండ్స్, నేపాల్‌ కూడా ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాయి. దక్షిణాఫ్రికాను నేపాల్‌ ఓడించినంత పని చేసింది. చివరకు సఫారీ జట్టు ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది. దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్‌ కూడా భయపెట్టింది. రసవత్తరంగా సాగుతున్న ఈ టోర్నీలో వరుణుడి రాకతో కొన్ని మ్యాచ్‌లు రద్దయ్యాయి. వర్షంతో ఇంగ్లాండ్‌- స్కాట్లాండ్, శ్రీలంక- నేపాల్, అమెరికా- ఐర్లాండ్, భారత్‌- కెనడా మ్యాచ్‌లు జరగలేదు. ఒకవేళ వర్షం లేకుంటే మరిన్ని అనూహ్య ఫలితాలు వచ్చేవనడంలో సందేహం లేదు. 

అలా కలిసొచ్చింది..: టోర్నీలో చిన్న జట్ల ప్రదర్శన నిస్సందేహం ఆకట్టుకునేదే. కనీస పోటీ ఇవ్వలేవనుకున్న జట్లు స్ఫూర్తిదాయక ప్రదర్శనే చేశాయి. క్రికెట్‌ భవిష్యత్తుకు ఇది శుభసూచకం అనడంలో సందేహం లేదు. బౌలింగ్‌ అనుకూల పరిస్థితులూ జట్లకు కలిసొచ్చాయి. అస్థిర బౌన్స్, బంతి ఆగుతూ రావడంతో మేటి బ్యాటర్లు సైతం ధాటిగా ఆడలేకపోతున్నారు. స్వేచ్ఛగా బ్యాట్‌ ఝళిపించలేకపోతున్నారు. కోహ్లి ఇంకా రెండంకెల స్కోరే అందుకోలేద]ు. సాధారణ పిచ్‌లపై బ్యాటర్లు రెచ్చిపోయి భారీ స్కోర్లు చేస్తే చిన్న జట్లకు లక్ష్యాలను ఛేదించడం చాలా కష్టమయ్యేది. కానీ ప్రస్తుత పరిస్థితులను కూన జట్లు పూర్తిగా సొమ్ము చేసుకున్నాయి. ఆ జట్లలో అనామక బౌలర్లు కూడా బ్యాటర్లను కట్టిపడేయగలిగారు. దక్షిణాఫ్రికాకు ఇది బాగా అనుభవమైంది. నెదర్లాండ్స్‌పై 104 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి 18.5 ఓవర్లాడిన ఆ జట్టు.. నేపాల్‌పై అతికష్టంగా 115 పరుగులు చేసి, ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఇక ఓ ఓవర్లో ఫలితం తారుమారయ్యే టీ20ల్లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయరాదని చెప్పడానికి ఈ టోర్నీ ఓ నిదర్శనం. పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు చిన్న జట్టుతో ఆడేటప్పుడు పెద్ద జట్టుపైనే ఒత్తిడి ఉంటుంది. ఇది కూడా ఈ టోర్నీలో కూనలకు కలిసొచ్చిన అంశం. ఎలాంటి అంచనాల భారం లేకపోవడం వల్ల ఆ జట్లు ఆశ్చర్యకర ప్రదర్శన చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌ల్లో తమ ఆటగాళ్లు ఆడటమూ ఈ చిన్న జట్లకు మేలు చేస్తోంది. అమెరికాలో క్రికెట్‌ ప్రాచుర్యం కోసం తొలిసారి అక్కడ టీ20 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడీ చిన్న జట్ల విజయాలు.. కేవలం యుఎస్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు మరింత ఆదరణ పెరిగేందుకు దోహదపడేవే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని