T20 World Cup: భారత్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉంది: ఇంజామామ్‌ ఉల్ హక్‌

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియానే టైటిల్‌ ఫేవరేట్‌ అని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజామామ్‌ ఉల్‌ హక్‌ అన్నాడు. యూఏఈలోని పరిస్థితులు, టీ20 ఫార్మాట్‌లో ఆటగాళ్ల అనుభవం, ఇలా ఏ విధంగా చూసిన భారత జట్టు ఛాంపియన్‌ నిలిచే అవకాశాలు మెండుగా

Published : 22 Oct 2021 01:43 IST

(Photo: BCCI Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియానే టైటిల్‌ ఫేవరేట్‌ అని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజామామ్‌ ఉల్‌ హక్‌ అన్నాడు. యూఏఈలోని పరిస్థితులు, టీ20 ఫార్మాట్‌లో ఆటగాళ్ల అనుభవం, ఇలా ఏ విధంగా చూసిన భారత జట్టు ఛాంపియన్‌ నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇంజామామ్ పేర్కొన్నాడు. ‘ఏ టోర్నీలోనైనా ఫలానా జట్టు కచ్చితంగా విజేతగా నిలుస్తుందని చెప్పలేం. విజయం సాధించడం అనేది ఆ జట్టు అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. నా అంచనా ప్రకారం.. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఇతర జట్ల కంటే టీమ్‌ఇండియాకే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడి పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నాయి. ఆ జట్టుకు అనుభవజ్ఞులైన టీ20 ఆటగాళ్లున్నారు’ అని ఇంజామామ్‌ అన్నాడు.

అక్టోబరు 24న భారత్, పాక్‌ మధ్య హై వోల్టెజీ  మ్యాచ్  జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌ గురించి ఇంజామామ్‌ మాట్లాడాడు.‘సూపర్‌ 12 దశలో భారత్, పాకిస్థాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌ ఫైనల్‌కు ముందు ఫైనల్‌లాంటిది. ఈ మ్యాచ్‌కు ఉన్నంత క్రేజ్ మరే మ్యాచ్‌కు ఉండదు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇరు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌లు ఫైనల్స్‌ను తలపించాయి’అని ఇంజామామ్‌ ఉల్‌ హక్‌ అన్నాడు. బుధవారం భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ మాట్లాడుతూ..‘ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా హాయిగా ఆడింది. 155 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీ సేన పెద్దగా శ్రమించకుండానే ఛేదించింది. టీ20ల్లో ఇలాంటి పిచ్‌లపై టీమ్ఇండియా అత్యంత ప్రమాదకరమైన జట్టు’అని వివరించాడు. మరోవైపు, తన మొదటి వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ని ఓడించి పాకిస్థాన్‌.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌కు ఇది గట్టిదెబ్బగానే చెప్పవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు