Cricket News: 2028 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు?

2028 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను కూడా నిర్వహించేందుకు సానుకూల పరిణామం చోటుచేసుకుంది. అందుకు సంబంధించి అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) తాజాగా...

Published : 05 Aug 2022 01:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2028 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను కూడా నిర్వహించేందుకు సానుకూల పరిణామం చోటుచేసుకుంది. అందుకు సంబంధించి అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) తాజాగా మరో ఎనిమిది క్రీడా విభాగాలతో కలిసి సమీక్ష నిర్వహించింది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదివరకు 1900వ సంవత్సరంలో పారిస్‌ ఒలింపిక్స్‌లో ఒక్కసారి మాత్రమే క్రికెట్‌ను నిర్వహించారు. అప్పుడు కేవలం ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాలు మాత్రమే అందులో పాల్గొన్నాయి.

ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో కథనం ప్రకారం.. తాజాగా లాస్‌ ఏంజిల్స్‌ 2028 ఒలింపిక్స్‌ నిర్వాహకులు, ఐఓసీ ప్రతినిధులు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)ని ఆహ్వానించి ఒలింపిక్స్‌లో క్రికెట్‌ నిర్వహణకు సంబంధించిన ప్రెజెంటేషన్‌ ఇవ్వమన్న తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. అయితే, దీనిపై వచ్చే ఏడాది స్పష్టత రానుంది. 2023 ఐఓసీ వార్షిక సమావేశం ముంబయిలో జరగనున్న సంగతి తెలిసిందే. దానికన్నా ముందే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను నిర్వహించడంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు మరో 8 క్రీడలు కూడా కొత్తగా చేరే వీలుంది. అందులో బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లాక్రోసీ, బ్రేక్‌ డాన్సింగ్‌, కరాటే, కిక్‌ బాక్సింగ్‌, స్క్వాష్‌, మోటార్‌స్పోర్ట్స్‌ వంటివి ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల టీ20 క్రికెట్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో మొత్తం 8 జట్లు పోటీపడుతుండగా పురుషుల క్రికెట్‌కు చోటివ్వలేదు. అలాగే ఒలింపిక్స్‌లో ఒక క్రీడను నిర్వహించాలంటే అందులో కచ్చితంగా పురుషులు, మహిళల విభాగాలు ఉండాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని