IPL 2021: నిలవాలంటే గెలవాలి.. కోల్‌కతా ముందున్న సవాళ్లివే!
కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓటమిపాలై రెండు మ్యాచ్‌లే గెలిచింది. కరోనా కేసుల కారణంగా టోర్నీ నిరవధిక వాయిదా పడేసరికి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే
ఇంటర్నెట్‌డెస్క్: కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓటమి పాలై రెండు మ్యాచ్‌లే గెలిచింది. కరోనా ఉద్ధృతి కారణంగా టోర్నీ నిరవధిక వాయిదా పడేసమయానికి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సిన పరిస్థితి. అయితే, తాము చరిత్ర తిరగరాస్తామని ఆ జట్టు చీఫ్ మెంటార్ డేవిడ్ హస్సీ తాజాగా ధీమా వ్యక్తం చేశాడు. కోల్‌కతా నిజంగా చెలరేగాలంటే వేటిపై దృష్టి సారించాలి? అధిగమించాల్సిన అడ్డంకులేంటి..?
(ఫొటో : కేకేఆర్ ట్విటర్)
రెండే విజయాలు: ఐపీఎల్ 14వ సీజన్ తొలి భాగంలో కోల్‌కతా రెండు విజయాలే సాధించింది. ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ సీజన్‌లో ఆ జట్టు తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌తో ఆడింది. 187 పరుగులు సాధించి అదరగొట్టిన మోర్గాన్ టీమ్ తర్వాత వరుసగా విఫలమైంది. ముంబయి, బెంగళూరు, చెన్నై, రాజస్థాన్ చేతుల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో వెనుకంజలో పడిపోయింది. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి కాస్త ఊరట పొందింది. అయితే, తర్వాత మళ్లీ దిల్లీ చేతిలో భంగపడిన కోల్‌కతా టోర్నీ నిలిచిపోయేసరికి ఏడో స్థానంలో కొనసాగుతోంది.
బెంగళూరు నుంచే మొదలుపెట్టాలి: ఇక రెండో భాగంలో కోల్‌కతా తొలి మ్యాచ్‌లో సోమవారం బెంగళూరును ఢీకొట్టనుంది. ఇంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో కోహ్లీసేన 38 పరుగులతో ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు మోర్గాన్ టీమ్ ఆ జట్టుపై చెలరేగి విజయం సాధించాలనే కసితో ఉంది. ఇక్కడి నుంచే విజయ ప్రస్థానం మొదలుపెట్టాలని చూస్తోంది. ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టీమ్ 204/4 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ మ్యాచ్‌లో మాక్స్‌వెల్ (78), డివిలియర్స్ (76*) దంచికొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన కోల్‌కతా 166/8 స్కోరుకే పరిమితమైంది. దినేశ్ కార్తీక్ విఫలమైనా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా తలా కొన్ని పరుగులు చేశారు. అయితే, ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడకపోవడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు.
(ఫొటో : కేకేఆర్ ట్విటర్)
రాహుల్, నితీశ్, రసెల్.. దంచికొట్టాలి: కోల్‌కతా తరఫున ఈ సీజన్‌లో ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా పూర్తిస్థాయిలో ఆడలేకపోయారు. నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఆండ్రీ రసెల్ ఈ ముగ్గురూ తలా కొన్ని పరుగులు సాధించడం తప్ప ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. రాణా ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచుల్లో రెండు అర్ధ శతకాలు సాధించి 201 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. తర్వాత రాహుల్ ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధశతకంతో 187 పరుగులు సాధించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడగల రసెల్ కూడా ఏడు మ్యాచ్‌ల్లో 163 పరుగులే చేశాడు. ఈ ముగ్గురూ తర్వాతి మ్యాచ్‌ల్లో మరింత దంచికొట్టాలి.
(ఫొటో : కేకేఆర్ ట్విటర్)
శుభ్‌మన్, కార్తీక్, మోర్గాన్ పరుగులు చేయాలి: ఇక ఈ జట్టులో మిగిలిన ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో ముందుండేది ఓపెనర్ శుభ్‌మన్ గిల్. గతేడాది తన బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఈ యువ బ్యాట్స్‌మన్.. ఈ సీజన్‌లో అంతగా ఆడలేకపోయాడు. ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధ శతకం సాధించి 132 పరుగులే చేశాడు. ఇక మిడిల్ ఆర్డర్‌లో దినేశ్ కార్తీక్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సైతం తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. గతేడాది వరుస ఓటముల తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కార్తీక్ ఈ సీజన్‌లోనూ అస్సలు రాణించలేదు. ఏడు మ్యాచ్‌ల్లో 123 పరుగులే చేశాడు. మరోవైపు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 92 పరుగులే చేశాడు. దీంతో ఈ ముగ్గురూ మిగిలిన సీజన్‌లో పూర్తి స్థాయిలో రాణించాలి. లేదంటే కోల్‌కతా పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం లేకపోలేదు.
కమిన్స్‌ను భర్తీ చేయగలడా?: కోల్‌కతా బౌలింగ్ యూనిట్‌కు ప్యాట్ కమిన్స్ ప్రధాన బలం. అయితే, అతడు ఈ సీజన్ రెండో భాగంలో ఆడటం లేదు. వ్యక్తిగత కారణాలతో ఆడనని ముందే ప్రకటించాడు. కానీ తొలి భాగంలో కోల్‌కతా తరఫున అత్యధిక వికెట్లు తీసిన అతడు వీలైతే బ్యాటింగ్ చేయగల సమర్థుడు. దీంతో కోల్‌కతా రెండో భాగంలో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరోవైపు కమిన్స్ స్థానాన్ని భర్తీ చేస్తూ కోల్‌కతా రెండో దశలో టిమ్‌సౌథీని తమ జట్టులోకి తీసుకుంది. సౌథీ సైతం అద్భుతంగా బౌలింగ్ చేయగల సమర్థుడు. కానీ, యూఏఈ పిచ్‌లపై అతడు ఏ మేరకు చెలరేగుతాడో చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో మోర్గాన్ టీమ్ రెండో దశలో రాణించడం చాలా కష్టం. అయినా తమ జట్టు పుంజుకుంటుందని.. ఓపెనర్లు నితీశ్ రాణా, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌తో ఆదుకుంటారని మెంటార్ హస్సీ ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ కూడా జట్టును సరైన దిశలో నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా మిగిలిన సీజన్‌లో ఈ సవాళ్లను దాటుకొని రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ram Ramapati Bank: శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
Ts-top-news News
Summer: మండే వరకు ఎండలే.. ఏడు జిల్లాలకు హెచ్చరికలు
-
Crime News
Andhra News: సీఎం జగన్‌పై పోస్టులు పెట్టారని ప్రవాసాంధ్రుడి అరెస్టు
-
Crime News
Vijayawada: వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి
-
India News
Nirmala Sitharaman: చిన్నారి మోములో చిరునవ్వు కోసం..
-
Ap-top-news News
Vande Bharat Express: 8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి.. వందేభారత్ టైమింగ్స్ ఇలా...