IPL 2021: చెన్నై.. అడుగు పడింది

101/1.. 172 పరుగుల ఛేదనలో 11 ఓవర్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్కోరిది. చేతిలో తొమ్మిది వికెట్లున్న ఆ జట్టు సులువుగానే గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ మ్యాచ్‌ చివరి బంతి వరకూ వెళ్తుందని ఎవరూ ఊహించలేకపోయారు..

Updated : 27 Sep 2021 06:55 IST

ప్లేఆఫ్‌కు ధోనీసేన!

ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై గెలుపు

దుబాయ్‌

101/1.. 172 పరుగుల ఛేదనలో 11 ఓవర్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్కోరిది. చేతిలో తొమ్మిది వికెట్లున్న ఆ జట్టు సులువుగానే గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ మ్యాచ్‌ చివరి బంతి వరకూ వెళ్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఉత్కంఠగా సాగిన పోరులో చివర్లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ జడేజా మెరుపులతో ఆఖరి బంతికి సీఎస్కే గెలుపందుకుంది. రెండో దశలో వరుసగా మూడు విజయాలు సాధించిన సీఎస్కే.. మొత్తం 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకున్నట్లే!

పీఎల్‌ 14వ సీజన్‌లో చెన్నై జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం తొలి మ్యాచ్‌లో సీఎస్కే 2 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై గెలిచింది. రుతురాజ్‌ (40; 28 బంతుల్లో 2×4, 3×6), డుప్లెసిస్‌ (43; 30 బంతుల్లో 7×4) రాణించారు. చివర్లో జడేజా (22; 8 బంతుల్లో 2×4, 2×6) మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్పాడు. నరైన్‌ (3/41) సత్తాచాటాడు. మొదట కేకేఆర్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి (45; 33 బంతుల్లో 4×4, 1×6), నితీశ్‌ రాణా (37 నాటౌట్‌; 27 బంతుల్లో 3×4, 1×6), దినేశ్‌ కార్తీక్‌ (26; 11 బంతుల్లో 3×4, 1×6) మెరిశారు. చెన్నై బౌలర్లలో శార్దూల్‌ (2/20), జడేజా (1/21) రాణించారు.

ఆరంభం అదిరినా..: ఛేదనలో సీఎస్కేకు గొప్ప ఆరంభం లభించినా ఆఖర్లో ఉత్కంఠ తప్పలేదు. ఓపెనర్లు రుతురాజ్‌, డుప్లెసిస్‌ తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. రుతురాజ్‌ ఔటైనా.. డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ (32) బౌండరీలతో సాగడంతో 11 ఓవర్లకు 101/1తో జట్టు లక్ష్యం దిశగా సాగింది. కానీ డుప్లెసిస్‌ ఔటవడంతో కథ మాంది. మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడంతో పాటు రాయుడు (10) వికెట్‌ తీసిన కేకేఆర్‌ తిరిగి పోటీలోకి వచ్చింది.తర్వాతి రెండు ఓవర్లలో కేకేఆర్‌ 14 పరుగులే ఇచ్చి.. అలీ, రైనా, ధోనీ (1)లను వెనక్కిపంపింది. కానీ 19వ ఓవర్లో చివరి నాలుగు బంతులకు వరుసగా రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన జడేజా అద్భుతమే చేశాడు. దీంతో చివరి ఓవర్లో సీఎస్కేకు నాలుగు పరుగులే అవసరమైనప్పటికీ ఉత్కంఠ తప్పలేదు. మూడో బంతికి మూడు పరుగులు తీసిన శార్దూల్‌ స్కోరు సమం చేశాడు. కానీ నాలుగో బంతికి పరుగులు చేయని జడ్డూ.. ఆ వెంటనే ఎల్బీగా వెనుదిరిగాడు. కానీ దీపక్‌ చాహర్‌ సింగిల్‌తో మ్యాచ్‌ ముగించాడు.

ఆఖర్లో మెరుపులు..: కేకేఆర్‌ బ్యాటింగ్‌లో తొలి ఓవర్లోనే శుభ్‌మన్‌ గిల్‌ (9) రనౌటయ్యాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ (18) కూడా ఎక్కువసేపు నిలవలేదు. త్రిపాఠి జోరు కొనసాగించినప్పటికీ.. శార్దూల్‌, జడేజా కట్టుదిట్టంగా బంతులేశారు. మోర్గాన్‌ (8) విఫలమయ్యాడు. రసెల్‌ మెరుపులు మెరిపించినా.. అది కాసేపే. 17 ఓవర్లలో కోల్‌కతా 127/5తో నిలిచింది. ఆ దశలో కేకేఆర్‌ 150 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కానీ రానాతో పాటు దినేశ్‌ కార్తీక్‌ రెచ్చిపోవడంతో చివరి మూడు ఓవర్లలో ఆ జట్టు 44 పరుగులు రాబట్టింది.


కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభ్‌మన్‌ రనౌట్‌ 9; వెంకటేశ్‌ (సి) ధోని (బి) శార్దూల్‌ 18; త్రిపాఠి (బి) జడేజా 45; మోర్గాన్‌ (సి) డుప్లెసిస్‌ (బి) హేజిల్‌వుడ్‌ 8; నితీశ్‌ నాటౌట్‌ 37; రసెల్‌ (బి) శార్దూల్‌ 20; దినేశ్‌ కార్తీక్‌ (సి) ధోని (బి) హేజిల్‌వుడ్‌ 26; నరైన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1-10, 2-50, 3-70, 4-89, 5-125, 6-166; బౌలింగ్‌: దీపక్‌ 4-0-32-0; సామ్‌ కరన్‌ 4-0-56-0; హేజిల్‌వుడ్‌ 4-0-40-2; శార్దూల్‌ 4-1-20-2; జడేజా 4-0-21-1

చెన్నై సూపర్‌ కింగ్స్‌: రుతురాజ్‌ (బి) మోర్గాన్‌ (బి) రసెల్‌ 40; డుప్లెసిస్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) ప్రసిద్ధ్‌ 44; మొయిన్‌ అలీ (సి) వెంకటేశ్‌ (బి) ఫెర్గూసన్‌ 32; అంబటి రాయుడు (బి) నరైన్‌ 9; రైనా రనౌట్‌ 11; ధోని (బి) వరుణ్‌ 1; జడేజా ఎల్బీ (బి) నరైన్‌ 22; కరన్‌ (సి) నాగర్‌కోటి (బి) నరైన్‌ 4; శార్దూల్‌ నాటౌట్‌ 3; దీపక్‌ చాహర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172; వికెట్ల పతనం: 1-74, 2-102, 3-119, 4-138, 5-142, 6-142, 7-168, 8-171; బౌలింగ్‌: ప్రసిద్ధ్‌ 4-0-41-1; ఫెర్గూసన్‌ 4-0-33-1; వరుణ్‌ చక్రవర్తి 4-0-23-1; నరైన్‌ 4-0-41-3; రసెల్‌ 3-0-28-1; వెంకటేశ్‌ 1-0-5-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని