
SRH vs PBKS: ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్‌దే గెలుపు..
ఇంటర్నెట్ డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మారలేదు. తొలుత బంతితో కట్టడి చేసినా బ్యాటింగ్‌లో మాత్రం చేతులెత్తేసింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఏడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. బ్యాట్స్‌మెన్‌లో జేసన్ హోల్డర్(47; 29 బంతుల్లో 5×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. చివరి బంతికి 7 పరుగులు అవసరం కాగా కేవలం ఒక పరుగు మాత్రమే వచ్చింది. దీంతో హైదరాబాద్ 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
హోల్డర్ మెరిసినా..
126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. షమి వేసిన తొలి ఓవర్ మూడో బంతికి డేవిడ్ వార్నర్(2) కీపర్ కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. తర్వాత షమి వేసిన మూడో ఓవర్‌లో విలియమ్సన్(1) బౌల్డయ్యాడు. దీంతో ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔటవడంతో జట్టు స్కోరు చాలా నెమ్మదించింది. ఈ క్రమంలో రవి బిష్ణోయ్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో మనీశ్ పాండే(13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన కేదార్ జాదవ్(12), అబ్దుల్ సమద్(1)లను కూడా బిష్ణోయ్ వెనక్కి పంపాడు. దీంతో హైదరాబాద్‌కు మరింత కష్టాల్లో పడింది. ఇక ఆదుకుంటాడనుకున్న వృద్ధీమాన్ సాహా(31) రనౌటయ్యాడు. ఇక హైదరాబాద్‌కు ఓటమి లాంఛనమే అనుకున్న తరుణంలో జేసన్ హోల్డర్ సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్‌ను ఉత్కంఠ స్థితికి తెచ్చాడు. ఇక చివరి ఓవర్‌లో హైదరాబాద్‌కు 17 పరుగులు అవసరమైన దశలో రెండో బంతికి హోల్డర్ సిక్స్ కొట్టాడు. దీంతో సమీకరణం 4 బంతుల్లో 10 పరుగులుగా మారింది. తర్వాత రెండు బంతులు పరుగులేమి రాలేదు. దీంతో లక్ష్యం రెండు బంతుల్లో పది పరుగులుగా మారింది. ఐదో బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఇక చివరి బంతికి 7 పరుగులు అవసరం కాగా హోల్డర్ ఒక పరుగు మాత్రమే చేశాడు. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. షమి రెండు వికెట్లు తీశాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. నాలుగు ఓవర్లకు 26/0తో కాస్త మెరుగైన స్థితిలో ఉన్న ఆ జట్టుకు జేసన్ హోల్డర్ ఐదో ఓవర్‌లో గట్టి షాక్ ఇచ్చాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (21; 21 బంతుల్లో 3×4), మయాంక్ అగర్వాల్ (5)లను ఔట్ చేశాడు. రాహుల్.. సుచిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా.. మయాంక్ విలియమ్సన్‌కి చిక్కాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత స్కోరు వేగం నెమ్మదించింది. క్రిస్ గేల్ (14; 17 బంతుల్లో 1×4) బ్యాట్ ఝళిపించలేదు. రషీద్ ఖాన్ వేసిన 11వ ఓవర్‌లో గేల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన నికోలస్ పూరన్(8), దీపక్ హుడా (13) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. పూరన్‌ని సందీప్ శర్మ పెవిలియన్ చేర్చగా.. హోల్డర్ వేసిన 16వ ఓవర్లో హుడా ఔటయ్యాడు. సమద్ వేసిన 15వ ఓవర్‌లో మార్‌క్రమ్.. మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నాథన్ ఎలిస్ (12) భువనేశ్వర్ కుమార్ వేసిన ఓవర్లో పెవిలియన్ చేరాడు. హర్‌ప్రీత్ బ్రర్ (18) నాటౌట్‌గా నిలిచాడు.సన్‌రైజర్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 3, రషీద్‌ఖాన్, సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, అబ్దుల్ సమద్ తలో వికెట్ పడగొట్టారు.