
IPL 2021: ముంబయి, చెన్నై మధ్య తొలి మ్యాచ్!
యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి రెండో భాగం..
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా కేసుల కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2021 మిగతా సీజన్ సెప్టెంబర్ 19 నుంచి తిరిగి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 వరకూ జరిగే ఈ మెగా టోర్నీలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్‌లో తలపడుతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 9న మొదలైన 14వ సీజన్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి బయోబుడగలో పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారు. దాంతో మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
టీమ్‌ఇండియా ఇంగ్లాండ్ పర్యటన తర్వాత సెప్టెంబర్-అక్టోబర్‌లో యూఏఈలో మిగిలిన మ్యాచ్‌లు పూర్తి చేయాలని బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం చకాచకా పూర్తి చేస్తోంది. ఈ క్రమంలోనే 14వ సీజన్ తిరిగి ప్రారంభమైనప్పుడు ముంబయి, చెన్నై పోటీపడతాయని ఓ ఫ్రాంఛైజీ అధికారి తాజాగా పీటీఐతో అన్నారు.
‘సెప్టెంబర్ 19న ఈ రెండు జట్ల మధ్యా తొలి పోటీ ఉంటుందని బీసీసీఐ నుంచి కొద్దిసేపటి క్రితమే మాకు మెయిల్ వచ్చింది. అలాగే అక్టోబర్ 10న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ నిర్వహిస్తుండగా.. 11న తొలి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఆపై అక్టోబర్ 13న సెకండ్ క్వాలిఫయర్ ఉంటుంది. 15న ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు’ అని ఆ అధికారి పేర్కొన్నారు.
కాగా, టోర్నీ వాయిదాపడేసరికి మొత్తం 29 మ్యాచ్‌లు జరగ్గా అందులో దిల్లీ క్యాపిటల్స్ టాప్‌లో నిలిచింది. ఆ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. మరోవైపు చెన్నై జట్టు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతోనే మూడో స్థానంలో తర్వాత ముంబయి 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచాయి.