IPL 2021 Preview: ప్లేఆఫ్‌ కోసం రాయల్స్‌.. పరువు కోసం సన్‌రైజర్స్‌

ఆడిన 9 మ్యాచ్‌లలో 8 పరాజయాలతో ప్లేఆఫ్‌కు దూరమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓవైపు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్‌ రేసులో నిలవాలని తపన పడుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌ మరోవైపు......

Updated : 27 Sep 2021 16:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆడిన 9 మ్యాచ్‌లలో 8 పరాజయాలతో ప్లేఆఫ్‌కు దూరమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓవైపు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్‌ రేసులో నిలవాలని తపన పడుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌ మరోవైపు. ఐపీఎల్‌ 2021 రెండో దశలో ఈ జట్లు సోమవారం సాయంత్రం పోటీ పడనున్నాయి. జట్టులో భీకర బ్యాట్స్‌మెన్‌ ఉన్నప్పటికీ.. మిడిలార్డర్‌ రాణించకపోవడంతో తడబడుతున్న రాజస్థాన్‌ ఈ మ్యాచ్‌లో గెలుపొంది పుంజుకోవాలని భావిస్తోంది. ఎనిమిది పరాజయాలతో కేవలం రెండు పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకుందాం.

అనూహ్య విజయాలు.. ఊహించని పరాజయాలు.. ఇదీ ఈ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ పరిస్థితి. కెప్టెన్‌ సంజూ శాంసన్‌, యశస్వి జైస్వాల్, ఎవిన్‌ లూయీస్‌, డేవిడ్‌ మిల్లర్‌ లాంటి భీకర బ్యాటర్లు ఉన్నప్పటికీ.. సరైన సమయంలో వారు రాణించలేక మ్యాచ్‌ను చేజేతులా జారవిడుచుకుంటున్నారు. వీరిలో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ రాణించినా జట్టుకు తిరుగుండదు. దిల్లీతో జరిగిన గత మ్యాచ్‌ ప్రదర్శనను శాంసన్‌ పునరావృతం చేయాలని జట్టు భావిస్తోంది. బౌలింగ్‌లో తబ్రెయిజ్ శంశి, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్ రాణిస్తుండటం వారికి కలిసొచ్చే అంశం. మొదటి దశలో హైదరాబాద్‌తో తలపడ్డ రాజస్థాన్‌ 55 పరుగుల తేడాతో విజయం సాధించడం సైతం ఈ జట్టుకు సానుకూలాంశం.

జట్టులోని కొందరిపైనే ఆశలు పెట్టుకున్న హైదరాబాద్‌ జట్టు.. వారు కూడా రాణించలేకపోవడంతో దారుణంగా విఫలమవుతోంది. ప్రత్యర్థి జట్టును బౌలర్లు కట్టడి చేస్తున్నప్పటికీ.. వారికి బ్యాట్స్‌మెన్‌ సహకారం లేకుండా పోయింది. డేవిడ్‌ వార్నర్‌, కెప్టెన్‌ విలియమ్సన్‌, మనీష్‌ పాండే విఫలమవుతుండటంతో ఆ జట్టు చతికిలబడుతోంది. దీంతో నేటి మ్యాచ్‌లో వార్నర్‌ స్థానంలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జేసన్‌ రాయ్‌ను తీసుకునే అవకాశం ఉంది. జేసన్‌ హోల్డర్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కొనసాగించి, బౌలర్లు రాణిస్తే వారికి విజయం పెద్ద కష్టమేమీకాదు. ప్లేఆఫ్‌కు దూరమైన ఈ జట్టు ఎలాంటి భయం లేకుండా ఆడుతుందనడంలో సందేహం లేదు. అయితే ప్రస్తుతం 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్‌.. నేటి పోరులో గెలిచి 10 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. ఒత్తిడిని అధిగమించి రాణిస్తే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ రెండు జట్లలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని